story: అజయ్‌.. ఉత్తరాలు రాశాడోచ్‌!

అది ఒక ప్రాథమిక పాఠశాల. నాలుగో తరగతి గదిలోని పిల్లలంతా కబుర్లాడుకుంటున్నారు. ‘రేపటి నుంచి వేసవి సెలవులు కదా.. మీరు ఊరు వెళుతున్నారా?’ అజయ్, తన మిత్రులైన రహీమ్, కిరణ్‌ను అడిగాడు.

Published : 05 Jun 2024 04:43 IST

అది ఒక ప్రాథమిక పాఠశాల. నాలుగో తరగతి గదిలోని పిల్లలంతా కబుర్లాడుకుంటున్నారు. ‘రేపటి నుంచి వేసవి సెలవులు కదా.. మీరు ఊరు వెళుతున్నారా?’ అజయ్, తన మిత్రులైన రహీమ్, కిరణ్‌ను అడిగాడు. ‘ఏ ఊరూ వెళ్లడం లేదు. మన ఇళ్లకు దగ్గరలో ఉన్న మైదానంలో ఎంచక్కా క్రికెట్‌ ఆడుకుంటాం. నువ్వూ వస్తావుగా!’ అని కిరణ్, రహీమ్‌ అన్నారు. ‘నేను రాను.. అమ్మమ్మ ఇంటికి మానేపల్లి వెళుతున్నామని అమ్మ నిన్న నాతో చెప్పింది’ అన్నాడు అజయ్‌. అంతలో తెలుగు ఉపాధ్యాయుడు రవి రావడంతో అందరూ మాట్లాడుకోవడం ఆపారు.

ఆయన పిల్లలందరినీ చూస్తూ... ‘పిల్లలూ! సెలవుల్లో ఎవరెవరు ఏమి చేస్తారు? ఒక్కొక్కరూ వచ్చి చెప్పండి’ అన్నారు. శ్రీహిత లేచి.. ‘నాకు కథలంటే చాలా ఇష్టం. నాన్న నాకోసం కథల పుస్తకాలు తెచ్చారు. సెలవుల్లో అవన్నీ చదివేస్తాను’ హుషారుగా అంది. ‘వెరీ గుడ్‌! శ్రీహితా..’ అంటూ సార్‌ అభినందించారు. ‘చాందినీ! మరి నువ్వేం చేస్తావు?’ అని రవి సార్‌ అడిగారు. ‘నాకు బొమ్మలు వేయడం ఇష్టం సార్‌. సెలవుల్లో బోలెడు బొమ్మలు వేస్తాను’ అని చాందిని ఆనందంగా అంది. ‘గుడ్‌! బొమ్మలు వేయడం చాలా మంచి అలవాటు. నీ నైపుణ్యం పెరుగుతుంది’ అంటూ సార్‌ అభినందించారు. ‘సెలవుల్లో కథలు చదవడంతోపాటు, సాయంత్రం వేళల్లో ఆటలు కూడా ఆడుకుంటాం.. సార్‌!’ అని కిరణ్, రహీమ్‌ లేచి చెప్పారు.

‘శారీరక, మానసిక ఆరోగ్యానికి ఆటలు చాలా ముఖ్యం’ అని సార్‌ వాళ్లిద్దరికేసి మెచ్చుకోలుగా చూస్తూ అన్నారు. ఇలా పిల్లలందరూ.. వాళ్లు చేయాలనుకుంటున్న విషయాలను చెప్పారు. అజయ్‌ మాత్రం ఏమి చెప్పక పోవడం గమనించిన సార్, అజయ్‌ దగ్గరకు వెళ్లారు. ‘అజయ్‌.. నువ్వేమి చేయాలనుకుంటున్నావో చెప్పలేదే?’ అని అడిగారు. ‘అజయ్‌ అమ్మమ్మ ఇంటికి వెళుతున్నానని మాతో అన్నాడు సార్‌!’ కిరణ్‌ లేచి సార్‌తో చెప్పాడు. ‘అమ్మమ్మ ఇంటికి వెళుతున్నావంటే హుషారుగా ఉండాలే, కానీ ఇలా దీనంగా ఉన్నావే..’ అని సార్‌ ఆశ్చర్యపోతూ అడిగారు.

‘అక్కడ కిరణ్, రహీమ్‌ ఉండరు కదా సార్‌?! వీళ్లతో ఆడుకోలేనుగా. అందుకే బాధగా ఉంది’ అని అసలు కారణం చెప్పాడు అజయ్‌. ‘అజయ్‌! అలా అనుకోవడం తప్పు. అమ్మమ్మ ఇంటికి ఆనందంగా వెళ్లు. అక్కడ ఆ ఊరి విశేషాలు, వింతలు పెద్ద వారిని అడిగి తెలుసుకో. అవే నీ మిత్రులకు ఇక్కడకు వచ్చినప్పుడు చెప్పు. అయితే ఒక్కటి గుర్తుంచుకో! నీ మిత్రులకు ఆ విశేషాలను సృజనాత్మకంగా చెప్పాలి’ అని అనడంతో, అజయ్‌ హుషారుగా ‘సరే సార్‌!’ అన్నాడు.

‘పిల్లలూ! తిరిగి అందరం, సెలవుల తర్వాత కలుసుకుందాం. అప్పుడు మీరు చేసిన వాటి గురించి చెప్పాలి.. సరేనా!’
అని సార్‌ పిల్లలందరి వైపు చూస్తూ అడిగారు. ‘అలాగే.. సార్‌!’ అని పిల్లలు కూడా హుషారుగా జవాబిచ్చారు. సాయంత్రం కాగానే... బడి విడిచి పెట్టారు. పిల్లలంతా సంతోషంగా వారి, వారి ఇళ్లకు వెళ్లారు. మరుసటి రోజునే అజయ్‌.. అమ్మతో కలిసి తన అమ్మమ్మ గారి ఊరైన మానేపల్లి వెళ్లాడు. కిరణ్, రహీమ్‌ ప్రతి రోజూ సాయంత్రం.. క్రికెట్‌ ఆడుకుంటున్నారు. ఓ రోజు కిరణ్, రహీమ్‌తో.. ‘అజయ్‌ వాళ్ల అమ్మగారికి ఫోన్‌ చేశాను. అజయ్‌తో మాట్లాడాలని.. ఎలా ఉన్నాడని, ఆంటీని అడిగాను.

అయితే ఆంటీ.. బావున్నాడని చెప్పారే కానీ, అజయ్‌తో మాట్లాడించమంటే.. వాడు, మీతో మాట్లాడలేనని చెబుతున్నాడమ్మా’ అంటూ ఫోన్‌ పెట్టేశారు. ‘అజయ్‌! నాతో, ఎందుకు మాట్లాడనని చెప్పాడంటావు?’ అని అడిగాడు. ‘నేను ఫోన్‌ చేసినా కూడా, అజయ్‌ మాట్లాడలేదు’ అని కిరణ్‌ కూడా రహీమ్‌తో అన్నాడు.

సెలవులు ముగిశాయి. బడులు ప్రారంభమయ్యాయి. ఆ రోజు శ్రీహిత, చాందిని, రహీమ్, కిరణ్, అజయ్‌... ఇలా అందరూ.. నాలుగో తరగతి గది నుంచి అయిదో తరగతి గదిలో కూర్చున్నారు. సెలవుల్లో ఏమేమి చేశారో ఒకరికొకరు కబుర్లాడుకుంటున్నారు. అప్పుడే రవి సార్‌ వచ్చారు.

‘పిల్లలూ! మిమ్మల్ని చూస్తుంటే సెలవుల్లో బాగా గడిపారని, మీకు నచ్చిన, వచ్చిన పని చేశారనిపిస్తోంది. ఎవరెవరు ఏమేమి చేశారో.. ఒక్కొక్కరూ వచ్చి చెప్పండి’ అన్నారు. శ్రీహిత లేచింది. తాను చదివిన కథల పేర్లు చెప్పింది. తనకు బాగా నచ్చిన కుందేలు, తాబేలు పరుగు పందెం కథను చక్కగా చెప్పింది. ‘వెరీ గుడ్‌! శ్రీహితా!’ అంటూ రవి సార్‌ మెచ్చుకున్నారు. పిల్లలంతా చప్పట్లు కొట్టారు. చాందిని.. తాను వేసిన బొమ్మలను చూపించింది. ‘చాలా, చక్కగా బొమ్మలు వేశావు, చాందినీ..’ అంటూ సార్‌ అభినందించారు.

కిరణ్, రహీమ్‌ లేచారు. వాళ్లు ఆటల పోటీల్లో గెలుచుకున్న కప్పులను చూపించారు. ‘ఆటలు బాగా ఆడారు. బహుమతులు గెలుచుకున్నారు. రహీమ్, కిరణ్‌.. మీ ఇద్దరికీ అభినందనలు’ అంటూ సార్‌ మెచ్చుకున్నారు. అజయ్‌ మాత్రం ఏమీ చెప్పక పోవడంతో, సార్‌ మళ్లీ ఆశ్చర్యపోయారు. అజయ్‌ దగ్గరకు వెళ్లి, ‘అమ్మమ్మ గారింటికి వెళ్లావా? ఆ ఊర్లో వింతలు, విశేషాలు చూశావా? వచ్చి నీ మిత్రులకు చెప్పావా?’ అని ఆత్రంగా అడిగారు. అజయ్‌ తన అమ్మమ్మ ఊరి విశేషాలు, వింతలు తెలియజేస్తూ తమకు రాసిన ఉత్తరాలను.. కిరణ్, రహీమ్‌.. రవి సార్‌ చేతిలో పెట్టారు. ఒక్క అక్షర దోషమూ లేకుండా, చక్కని చేతిరాతతో ఉన్న వాటిని మొత్తం చదివారు.

‘అజయ్‌! ఈ రోజుల్లో దాదాపు ఉత్తరాలను రాయడం పెద్దవాళ్లే మర్చిపోయారు. చిన్నవాళ్లేమో నేర్చుకోవడం లేదు. ఫోన్‌ వచ్చాక, ఉత్తరాలు రాయడం పూర్తిగా తగ్గిపోయింది. నువ్వు విభిన్నంగా ఆలోచించావు. వెరీ గుడ్‌!’ అంటూ సార్, అజయ్‌ను అభినందించారు.

 కె.వి.లక్ష్మణరావు 


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని