నిజమేంటో తెలిసింది!

అప్పుడే నిద్ర లేచిన సింహం గుహ నుంచి బయటకు వచ్చింది. అక్కడే ఉన్న బండ మీద కూర్చుంది. ఎదురుగా ఉన్న వేప చెట్టు మీద నుంచి ఎగురుకుంటూ ఒక కోకిల వచ్చి, ఆ బండకు మరోవైపున వాలింది.

Published : 05 Aug 2023 02:17 IST

ప్పుడే నిద్ర లేచిన సింహం గుహ నుంచి బయటకు వచ్చింది. అక్కడే ఉన్న బండ మీద కూర్చుంది. ఎదురుగా ఉన్న వేప చెట్టు మీద నుంచి ఎగురుకుంటూ ఒక కోకిల వచ్చి, ఆ బండకు మరోవైపున వాలింది. ‘కుహూ.. కుహూ’ అంటూ కూసింది. తన ముందే బండకు అటువైపు కూర్చున్న సింహాన్ని చూసి కూయడం ఆపింది. ‘నీ స్వరం మధురంగా ఉంది. పాడటం ఆపకు..’ అందా సింహం. ‘మరేం లేదు మృగరాజా.. నాకో సమస్య వచ్చిపడింది. ఆ బాధను మీతో చెప్పుకోవడానికే ఇలా వచ్చాను’ అని దీనంగా అంది కోకిల.

‘అందంగా పాటలు పాడే నీకు బాధ కలిగిందా? నిన్ను ఇబ్బంది పెట్టిన వారెవరో చెప్పు. తప్పకుండా శిక్షిస్తాను’ ఓదార్పుగా అంది సింహం. సింహం మాటలతో కోకిలకు ధైర్యం వచ్చింది. ‘‘నేనూ, చిలుకా అడవిలో చెరువు పక్కనున్న జామ చెట్టు మీద ఉంటున్నాం. నిన్న చిలుక నాతో.. ‘అందంలో నన్ను మించిన వారెవ్వరూ లేరు. నా పచ్చని రంగు ప్రకృతికి ప్రతిరూపం. నా ఎర్రని ముక్కు సూర్యోదయానికి సంకేతం. నల్లగా ఉన్న నువ్వు నాతో కలిసి ఉండటానికి వీల్లేదు. చెట్టు మీది నుంచి వెళ్లిపో’ అంటూ కేకలు పెట్టింది. తన ముక్కుతో నన్ను పొడవడానికి కూడా వచ్చింది. ‘రంగు కన్నా గుణం మిన్న’ అని చెప్పినా అది వినలేదు. దాని బారి నుంచి మీరే నన్ను కాపాడాలి’’ అని కోరింది కోకిల.

అది విన్న సింహం.. ‘బాధే అన్నింటికీ పరిష్కారం కాదు. నీకు న్యాయం చేస్తాను. ఆ చిలుకను శిక్షిస్తాను’ అని భరోసానిచ్చింది. తన ఆంతరంగికుడైన కాకితో.. ‘వెంటనే వెళ్లి ఆ చిలుకను నా దగ్గరకు తీసుకురా..’ అని చెప్పింది. తుర్రుమంటూ బయలుదేరింది కాకి. కోకిల హాయిగా.. మళ్లీ మృగరాజు కోసం పాడటం మొదలుపెట్టింది. కొంతసేపటి తరువాత కాకి, చిలుక అక్కడకు చేరాయి. ‘మృగరాజా.. నన్ను రమ్మనడానికి కారణం?’ అంటూ సింహం వైపు చూస్తూ అడిగింది చిలుక. ‘నీ పచ్చని రెక్కలను చూస్తుంటే ముచ్చటగా ఉంది. నీ పలుకులు వింటుంటే ఆనందం వేస్తోంది. ఒకసారి నీ మాటలు వినాలనిపించింది. అందుకే కాకితో కబురు పెట్టాను’ అంది సింహం.

ఆ మాటలకు కోకిల ఆశ్చర్యపోయింది. ‘మృగరాజా.. నాకు న్యాయం చేస్తానన్నారు. కానీ, చిలుకను పొగుడుతున్నారు. మీ అంతరార్థం ఏంటో నాకు తెలియడం లేదు’ అంది దీనంగా. కోకిల మాటలను పట్టించుకోకుండా సింహం మాత్రం చిలుకను పొగుడుతూనే ఉంది. తన బాధను పట్టించుకోని సింహంతో ‘రాజుకు తర, తమ భేదం ఉండకూడదని మీకు తెలియంది కాదు.. కానీ..’ అంది కోకిల కోపంగా.. దాంతో సింహం ఒక్కసారిగా లేచి గట్టిగా గర్జించింది. భయంతో కాకి, కోకిల, చిలుకలు ఒక్కసారిగా కాస్త వెనక్కు వెళ్లాయి. ‘భయపడకండి’ అంటూ ఒక అడుగు ముందుకు వేసింది సింహం. ‘రంగు కన్నా గుణమే మిన్న అని నాకూ తెలుసు. కానీ, నీ అసలు రంగు నాకు తెలిసింది కాబట్టే చిలుకతో సరదాగా మాట్లాడుతున్నాను’ అందది.

‘రాజా.. మీ మాటలు నాకు అర్థం కావడం లేదు’ సందేహంగా అంది కోకిల. చిలుక కూడా మృగరాజు వైపు విచిత్రంగా చూసింది. ‘చిలుక పచ్చని రంగును చూసి నల్లగా ఉన్న నీకు అసూయ కలిగింది. దాన్ని ఎలాగైనా చెట్టు పైనుంచి తప్పించాలనుకున్నావు. అందుకే గొడవ పెట్టుకున్నావు. కానీ, అది వెళ్లనంది. ఇక లాభం లేదనుకొని దానిపై చాడీలు చెప్పడానికి నువ్వు నా వద్దకు వచ్చావు.. అవునా?’ అని అడిగింది సింహం. ఆ మాటలతో కోకిల ఆశ్చర్యపోయింది.

‘ఇదంతా మీకెలా తెలుసు?’ అని భయపడుతూ అడిగింది. ‘వినదగునెవ్వరు చెప్పిన.. వినినంతనె వేగపడక.. అని పెద్దలు ఎప్పుడో చెప్పారు. కేవలం విన్నదే కాకుండా కళ్లతో చూసి నిజాలు తెలుసుకోవాలి. రాజుగా నాకు అన్ని విషయాలు తెలుస్తూనే ఉంటాయి. ఈ కాకి నాకు అడవిలో ఏ మూలన ఏం జరిగినా చేరవేస్తుంది. చిలుకతో నువ్వు గొడవ పడుతున్నప్పుడు కాకి అక్కడే ఉన్న విషయాన్ని గమనించలేదు. ఇప్పటికైనా తప్పెవరిదో ఒప్పుకుంటావా? శిక్ష ఎవరికి విధించాలో చెప్పమంటావా?’ అని ప్రశ్నించింది సింహం. తన నిజస్వరూపం తెలియడంతో కోకిల సిగ్గుతో తలదించుకుంది.
‘తోటి వారి అందాన్ని చూసి అసూయ పడితే, నీలో ఉన్న సహజ ప్రతిభ మరుగున పడిపోతుందని గ్రహించు. నీ స్వరం దేవుడిచ్చిన వరం అని గుర్తుంచుకో..’ అని హితవు పలికింది సింహం. ఆ మాటలతో తన పొరపాటును గ్రహించిన కోకిల.. మృగరాజును క్షమాపణ కోరింది. ఇకపైన చిలుకతో గొడవ పడకుండా స్నేహంగా ఉంటానని హామీనిచ్చింది. కోకిలలో వచ్చిన మార్పును చూసి కాకి, చిలుకËతోపాటు మృగరాజు కూడా ఎంతో సంతోషించింది.

కె.వి.లక్ష్మణరావు


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని