వినయాదిత్యుడి పట్టాభిషేకం

పూర్వం విదేహ రాజ్యాన్ని విమలాదిత్యుడు పరిపాలించేవాడు. ఆయనకు వినయాదిత్యుడు అనే కుమారుడుండేవాడు. లేక లేక కలిగిన సంతానం అవడం వల్ల కాలు కిందపెడితే కందిపోతుందేమో అనేంతలా అతి గారాబంగా పెంచాడు.

Updated : 08 Aug 2023 06:16 IST

పూర్వం విదేహ రాజ్యాన్ని విమలాదిత్యుడు పరిపాలించేవాడు. ఆయనకు వినయాదిత్యుడు అనే కుమారుడుండేవాడు. లేక లేక కలిగిన సంతానం అవడం వల్ల కాలు కిందపెడితే కందిపోతుందేమో అనేంతలా అతి గారాబంగా పెంచాడు. గురువులు అంతఃపురానికే వచ్చి సకలశాస్త్రాలూ నేర్పించారు. రాజ్యంలో ప్రసిద్ధి చెందిన యోధులు యుద్ధవిద్యల్లో శిక్షణ ఇచ్చారు.

ఆ విధంగా యువరాజుకు యుక్తవయసు వచ్చేసరికి విద్యాభ్యాసం పూర్తయ్యింది. కానీ, వాక్చాతుర్యం అబ్బలేదు. నాలుగు గోడల మధ్యే పెరగడంతో నలుగురితో కలిసిమెలిసి ఉండే గుణమూ రాలేదు. అంతఃపురంలోని వారు అతని వెనక యువరాజును పరిహాసం చేసేవారు. ఇది మంత్రి మాణిక్యుడి చెవిన పడింది.

ఇక కుమారుడికి పట్టాభిషేకం చేసి తాను విశ్రాంతి తీసుకుంటే బావుంటుందని విమలాదిత్యుడు భావించాడు. మంత్రి మాణిక్యుడితో ఆ విషయం ప్రస్తావించాడు. దానికి మంత్రి... ‘ప్రభూ! యువరాజుకు విద్యాభ్యాసం పూర్తయినమాట వాస్తవమే. కానీ, పాలనకు కేవలం శాస్త్రజ్ఞానమే సరిపోదు. లోకజ్ఞానమూ కావాలి’ అన్నాడు. ‘అందుకు మనమేం చేయాలి’ అని అడిగాడు విమలాదిత్యుడు. ‘యువరాజావారు ఏడాదిపాటు దేశాటన చేయాలి. అప్పుడు మన రాజ్య పరిస్థితుల మీద ఒక అవగాహన ఏర్పడుతుంది. పట్టాభిషేకానికి ముందు యువరాజు దేశాటన చేయడాన్ని పెద్దలందుకే నిర్ణయించారు. అదీగాక మీ వంశాచారం కూడా అదేకదా. మీకు తెలియనిదేముంది’ అన్నాడు. రాజు ఆలోచనలో పడ్డాడు.

‘మీ భయం నాకు అర్థమైంది ప్రభూ! యువరాజును ఒక్కణ్నే దేశాటనకు పంపడం మీకు భయం కలిగిస్తూ ఉండవచ్చు. నా కుమారుణ్ని కూడా తోడుగా పంపుతాను. వాళ్లు అతి సామాన్యులుగా మారువేషాల్లో దేశాటన చేస్తారు. వారికి తెలియకుండా రక్షణ ఏర్పాట్లు చేస్తాను. వేగుల ద్వారా వారి పర్యటన వివరాలు మనకు ఎప్పటికప్పుడు అందేలా చూస్తా. మీరు భయపడాల్సిన అవసరం లేదు’ అంటూ రాజుకు ధైర్యం చెప్పాడు. ఆయన తెలివితేటల మీద అపార నమ్మకం ఉన్న రాజు సరేనన్నాడు. యువరాజు వినయాదిత్యుడు, మంత్రి కుమారుడు మహీధరుడు ఇద్దరూ దేశాటనకు బయలుదేరారు. మొదట కొండాపురం అనే గ్రామం చేరారు. ఊరి బయట గుడిసెలో ఉన్న అవ్వ.. వారికి ఆప్యాయంగా గోంగూర పచ్చడితో రాగి సంగటి పెట్టింది.
తిన్నాక యువరాజు.. ‘అవ్వా! మీరు వరి అన్నం తినరా?’ అని అడిగాడు. ‘అయ్యో! మాకు వరి పండితే కదా! పదిమైళ్ల దూరాన నది పారుతోంది. దాన్నుంచి కాలువ తవ్వుకోగలిగితే మేమూ వరి అన్నం తినగలం. కానీ పట్టించుకునేవారేరి?’ అంది. యువరాజు మనసులో దృఢ సంకల్పం ఏర్పడింది. అవ్వతో సంభాషించడం ఆయనకెంతో జ్ఞానాన్ని ఇచ్చింది.

తర్వాత మరో గ్రామంలో.. ప్రజలు దొంగల బెడదతో బాధ పడుతుండడం గమనించాడు యువరాజు. మరొక గ్రామంలో.. రచ్చబండ వద్ద చేరిన రైతులతో మాట్లాడేప్పుడు రాజోద్యోగుల్లో పెరుగుతున్న అవినీతి గురించి తెలిసింది. రహదారులు రాకపోకలకు అనుకూలంగా లేకపోవడం ప్రత్యక్షంగా చూశారు. యువత నిరుద్యోగులుగా ఉండడం, వ్యాపారులు అధిక ధరలకు వస్తువులు అమ్ముతున్నారని గ్రహించాడు. ప్రతి గ్రామంలోనూ ఏదో ఒక సమస్య ఉండడం, అక్కడివారితో దాన్ని చర్చించడంతో.. యువరాజుకు మాట్లాడే నైపుణ్యం పెంపొందింది. నెమ్మదిగా సమస్యకు పరిష్కారం ఆలోచించడం అలవాటైపోయింది. అలా తెలియకుండానే... సంవత్సరం గడిచిపోయింది. రాజ్యంలోని పరిస్థితులు బాగా అర్థమయ్యాయి. ఇద్దరూ చర్చించుకుని పరిష్కారాలు ఆలోచించారు.  

తిరిగి వచ్చాక యువరాజు మాటల్లో తేడా కనిపించింది. అంతఃపురంలో అందరితో కలివిడిగా ఉంటున్నాడు. తండ్రితో రాజ్యంలోని సమస్యల గురించి వీలున్నప్పుడల్లా చర్చిస్తున్నాడు. రాజు ఆనందానికి అంతులేదు. ‘మంత్రివర్యా! మీ ఆలోచన సత్ఫలితాలను ఇచ్చింది. అతి గారాబం వల్ల బావిలో కప్పలాగ యువరాజు లోకానికి దూరమయ్యాడు. మీ సలహాతో రాజ్యంలోని సమస్యలపై అవగాహన తెచ్చుకున్నాడు. ఇక ప్రజాసంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని పాలన చేయగలడని నాకు పూర్తి నమ్మకం ఏర్పడింది. పట్టాభిషేకానికి మీరే తగిన సమయం నిర్ణయించండి’ అన్నాడు.
మంత్రి మాణిక్యుడు వినయాదిత్యుడికి పట్టాభిషేకం పూర్తి చేశాడు. వినయాదిత్యుడు తనతో దేశాటన చేసిన మహీధరుని మంత్రిగా నియమించుకుని సమస్యలను త్వరగా పరిష్కరించి.. రాజ్యాన్ని సుభిక్షం చేశాడు. వృద్ధులైన రాజు, మంత్రి విశ్రాంతి తీసుకుంటూ, అవసరమైనపుడు సలహాలనిస్తూ పాలనలో సహకరించసాగారు.    

గంగిశెట్టి శివకుమార్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని