కోతి.. కుందేలు.. ఓ బాలుడు!

అదొక చిన్న పల్లెటూరు. ఆ ఊరికి ఆనుకొని చిట్టడవి ఉంది. అందులో ఓ కుందేలు, కోతి మంచి మిత్రులు. ఒకదాన్ని విడిచి మరొకటి ఉండేవి కావు. దొరికిన ఆహారం పంచుకుని తినేవి. రెండూ కలిసి ఇతర జంతువుల కష్టసుఖాల్లో తోడుగా నిలిచేవి.

Updated : 09 Aug 2023 23:01 IST

దొక చిన్న పల్లెటూరు. ఆ ఊరికి ఆనుకొని చిట్టడవి ఉంది. అందులో ఓ కుందేలు, కోతి మంచి మిత్రులు. ఒకదాన్ని విడిచి మరొకటి ఉండేవి కావు. దొరికిన ఆహారం పంచుకుని తినేవి. రెండూ కలిసి ఇతర జంతువుల కష్టసుఖాల్లో తోడుగా నిలిచేవి. తగిన సలహాలు ఇవ్వడమే కాకుండా చేతనైన సాయం చేసేవి. ఒకరోజు కుందేలు, కోతి కలిసి ఆహారం కోసం నిత్యం వెళ్లే నేరేడు చెట్టు దగ్గరకు బయలుదేరాయి. అల్లంత దూరం నుంచి ఆ చెట్టు కింద ఎవరో ఒక బాలుడు కూర్చొని ఏడుస్తున్నట్లు గమనించాయి. బాలుడు పసిగట్టకుండా నెమ్మదిగా చెట్టు వెనకాలకు వెళ్లి అవి కూర్చున్నాయి.

బాలుడు తనలో తాను మాట్లాడుకుంటూ ఉండడంతో చెవులు నిక్కించి వినసాగాయి. ‘‘నేనేం తప్పు చేశానని అమ్మ కొట్టింది..! అమ్మకు నేనంటే ఇష్టం లేదు. చెల్లి అంటేనే ప్రేమ. నేను చెల్లి కోసమే కదా.. ఇద్దరం దాచుకునే గల్లాపెట్టె నుంచి డబ్బులు తీసి, చాక్లెట్లు కొనుక్కొచ్చింది. నేనేమైనా తిన్నానా? ‘బాబూ రవీ.. నువ్వు కూడా ఒక చాక్లెట్‌ తీసుకో..’ అని అమ్మ అనకుండా కొడుతుందా! నేనంటే ఎందుకంత కోపమో!’’ అనుకుంటూ చటుక్కున లేచి నాలుగు అడుగులు ముందుకు వేశాడు.

కుందేలు, కోతి అక్కడే ఉండి తొంగి చూడసాగాయి. ఆ పిల్లవాడు చెట్టు కింద రాలిన నాలుగు నేరేడు పండ్లను ఏరుకొని.. పక్కనే ఉన్న నీటి కొలను దగ్గరకు వెళ్లాడు. వాటిని శుభ్రంగా కడుక్కొని.. తినుకుంటూ తిరిగి చెట్టు కిందకు వచ్చాడు. ‘నేను ఇంటికి పోను. ఇక్కడే పండ్లు దొరుకుతున్నాయి. మంచి నీళ్లు కూడా ఉన్నాయి. ఇక ఇంటితో నాకు పని లేదు’ అంటుండగా.. చెట్టు వెనకాల నుంచి కుందేలు గొంతు వినబడింది.

పిల్లవాడికి ఆశ్చర్యమేసింది. ఎవరో చెట్టు వెనకాల ఉన్నారని తొంగి చూశాడు. కుందేలు పక్కనే ఉన్న కోతితో అచ్చం మనిషిలా మాట్లాడుతూ ఉండడం గమనించి, మరింత ఆశ్చర్యపోయాడు. వాటి మాటలు నిశ్శబ్దంగా వినసాగాడు. ‘ఈ రోజు ఉదయం నుంచి నువ్వు పచ్చి మంచి నీళ్లు కూడా ముట్టలేదు. ఏడుపూ ఆపడం లేదు. నీ కన్నీళ్లు చూడలేక పోతున్నా. దయచేసి ఏమి జరిగిందో చెప్పు. స్నేహితులతో చెప్పుకుంటే గుండెలోని బాధ కొంతైనా తగ్గుతుందంటారు. నీ బాధ ఏంటో చెప్పు. నాకు చేతనైన సాయం చేస్తాను’ అని కోతిని.. కుందేలు ఓదార్చే ప్రయత్నం చేసింది.

‘ఏం చెప్పమంటావు మిత్రమా..! కడుపు చించుకుంటే కాళ్ల మీద పడుతుంది అన్నట్లు.. నా బిడ్డ నిన్నటి నుంచి కనబడటం లేదు’ అంది కోతి. ‘అసలు ఏం జరిగిందో చెప్పు.. ఎందుకు పారిపోయింది?’ అంటూ కుందేలు ఆందోళనగా అడిగింది. ‘తల్లి అన్నాక పిల్లల బాగోగులు చూసుకోవాలా వద్దా..!. చిన్న పిల్లలు తెలియక ఏవేవో తప్పులు చేస్తుంటారు. అలా చేయకూడదని మందలిస్తాం. ఎదురు తిరిగితే రెండు తగిలిస్తాం. అంత మాత్రాన నా బిడ్డ మీద నాకు ప్రేమ లేనట్టా? నేను దాని మంచి కోసమే కదా! చెయ్యి చేసుకుంది’ అంటూ బాధపడింది.  

‘నీ బిడ్డను కొట్టావా.. తప్పు చేశావు.. కొట్టడం మంచి పద్ధతి కాదు. ప్రేమగా పిల్లలకు నచ్చే విధంగా చెప్పి వారి తప్పును సరిదిద్దాలి. మన దారికి తెచ్చుకోవాలి. ఇంతకూ నీకు అంతగా ఆవేశం వచ్చే పని ఏం చేసింది?’ అంటూ ఆరా తీసింది కుందేలు. ‘నా బిడ్డ నిన్న పెద్ద తప్పు చేసింది. ఊళ్లోకి వెళ్లి ఎవరి ఇంట్లోనో దొంగలా దూరి కొబ్బరి ముక్కలను ఎత్తుకొచ్చింది. ఆ పాపంలో నేనూ భాగస్వామిని కావాలి అన్నట్టు నాకూ ఒక ముక్క ఇవ్వబోయింది. నేను ఎక్కడిదని అడిగాను. అది ఏమాత్రం బెరుకు లేకుండా జరిగింది చెప్పింది. అలా దొంగతనం చేయరాదని కోపగించుకున్నాను. అలా తీసుకురావొద్దని నెమ్మదిగా చెప్పాను. అది వెంటనే ముఖమంతా చిట్లించుకుని.. నన్నే ఎదురు ప్రశ్నించింది. నాకు కోపం ఆగక దాన్నో దెబ్బ కొట్టాను’ అంటూ వెక్కి వెక్కి ఏడవసాగింది కోతి.  

‘తప్పు చేశావు మిత్రమా.. అది చిన్న పిల్ల.. దానికేం తెలుసు. దానికేమైనా అయితే మనకే కదా నష్టం. జీవితాంతం బాధ పడాల్సి వస్తుంది’ అంది కుందేలు. ‘నిజమే.. కొట్టకూడదు. కానీ క్షణికావేశంలో తప్పు చేశాను’ అంటూ కోతి మరింత బిగ్గరగా ఏడవసాగింది. ఇదంతా వింటున్న ఆ పిల్లాడికి కళ్లలో నీళ్లు తిరిగాయి. ‘అమ్మను అడగకుండా గల్లాపెట్టె నుంచి దొంగలా డబ్బులు తీయడం తప్పు. అది సరిదిద్దుకోవాలనే నన్ను అమ్మ కొట్టింది. కానీ నేను అర్థం చేసుకోలేక పోయాను. ఇలా అడవిలోకి పరుగెత్తుకు రావడం మరింత పెద్దతప్పు. ఇప్పుడు అమ్మ అన్నం తినడం మాని నాకోసం ఎంతగా ఏడుస్తుందో!.. ఇంటికి వెళ్లి ఇక ముందు దొంగతనం చేయనని చెప్పి అమ్మ కాళ్లపై పడి క్షమాపణ అడుగుతాను’ అంటూ పరుగుపరుగున ఇంటి బాట పట్టాడు. బాబులో మార్పు చూసి, తమ నాటకం ఫలించినందుకు కుందేలు, కోతి ఆనందించాయి. ఆ బాలుడు క్షేమంగా ఇంటికి వెళ్లాలని దేవుణ్ని వేడుకున్నాయి.  

చెన్నూరి సుదర్శన్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని