నేనే బొమ్మనైతే...!

హరి, రమ అన్నాచెల్లెళ్లు. హరి ఆరో తరగతి, రమ నాలుగో తరగతి చదువుతున్నారు. ప్రతిరోజూ బడి నుంచి ఇంటికి రాగానే పాలు తాగి, హోంవర్క్‌ చేసుకున్న తర్వాత కాసేపు ఆడుకునేవారు.

Published : 12 Aug 2023 00:09 IST

రి, రమ అన్నాచెల్లెళ్లు. హరి ఆరో తరగతి, రమ నాలుగో తరగతి చదువుతున్నారు. ప్రతిరోజూ బడి నుంచి ఇంటికి రాగానే పాలు తాగి, హోంవర్క్‌ చేసుకున్న తర్వాత కాసేపు ఆడుకునేవారు. ఒకరోజు సాయంత్రం అలాగే పెరట్లో జామచెట్టు కింద ఆడుకుంటుండగా రమ తలెత్తి చూసింది. ‘అన్నయ్యా.. చిలుక కొట్టిన జామకాయ.. అదిగో.. ఎండ పడి భలే మెరుస్తోంది. నాకు అది తినాలని ఉంది. కాస్త కోసి పెట్టవా?’ అని అడిగింది గారంగా.

చెల్లి అంటే హరికి ఎంతో ప్రేమ. దాంతో అమ్మ ఎప్పుడూ కాయలు కోసే కర్రతో ప్రయత్నించాడు. అమ్మ లాగితే తేలికగా ఆ కర్ర చివరనున్న బుట్టలో పడేవి. కానీ, హరి ఎంత ప్రయత్నించినా ఆ దోరమగ్గిన జామకాయ కర్రకు అందలేదు. అమ్మను పిలుద్దామంటే ఇంట్లో పనిలో ఉంది. ఇక లాభం లేదనుకొని మెల్లిగా చెట్టు ఎక్కాడు. అతికష్టంగా చెయ్యి చాచి, కాయ కోయబోయే సమయానికి పట్టు తప్పి కింద పడిపోయాడు. బరువు మొత్తం చేతి మీద పడడంతో ‘అమ్మా!’ అంటూ అరిచాడు. రమ కంగారుగా తల్లిని పిలిచే లోపు.. ఇంట్లో నుంచి అమ్మ, వరండాలో ఏదో రాసుకుంటున్న నాన్న.. పరుగున అక్కడికి వచ్చారు. నొప్పితో విలవిల్లాడుతున్న హరిని ఆసుపత్రికి తీసుకువెళ్లారు. తన వల్లే అన్నకు దెబ్బ తగిలిందని ఏడుస్తూ నాన్నతో అంది రమ.
మోచేతి కండరాలపైన ఒత్తిడి పడిందని, పదిహేను రోజులపాటు ఉంచుకోమని ఒక కట్టు కట్టారు డాక్టర్‌. చేతిని పరీక్షించే సమయంలో భయం, బాధతో అన్న వేసిన కేకలు విని రమ మరింత బాధపడింది. ఇంటికి వచ్చాక హరి నీరసంగా పడుకున్నాడు. ఏడుస్తున్న రమను ఊరడించడానికి వాళ్ల నాన్న కొత్త బొమ్మ ఒకటి తీసుకొచ్చి ఇచ్చారు. లేత గులాబీ రంగు గౌనుతో కీ ఇస్తే నడుం కదుపుతూ, చప్పట్లు కొడుతూ ముందుకు నడిచే ఆ బార్బీ బొమ్మ తనకు బాగా నచ్చింది. తన దుఃఖం మొత్తం మర్చిపోయి బొమ్మతో ఆడుకోసాగింది. రెండుసార్లు కీ ఇచ్చి ఆడింది. మూడోసారి ఏమాత్రం కదల్లేదు.
బొమ్మకేమైందోనని రమ గాబరా పడింది. కంగారుగా తండ్రిని పిలిచి.. ‘నాన్నా.. నా బొమ్మ నడవడం లేదు. ఒకసారి చూడు’ అంది ఏడుపు ముఖంతో. నాన్న వచ్చి బొమ్మని పరిశీలించారు. బొమ్మ చేతిని ఊడదీసి, లోపల ఏదో సరిజేశారు. ‘అరె.. చెయ్యి తీసేసినా బొమ్మ కొంచెం కూడా అరవలేదు.. కుయ్‌మనలేదు.. ఏమాత్రం గోల చేయలేదు. అద్భుతం’ అని మనసులోనే అనుకుందా పాప. ఇంతలో నాన్న కీ ఇవ్వడంతో మళ్లీ మామూలుగా పనిచేయసాగింది.
‘చెట్టు మీది నుంచి పడటంతో అన్నయ్య చెయ్యి ఎంత నలిగిందో.. డాక్టర్‌ పట్టుకుంటేనే ఏడ్చేశాడు.. కానీ, బొమ్మకు ఏ నొప్పీ లేదు. నేను కూడా బొమ్మనైతే ఎంత బాగుండేదో..!’ అనే ఆలోచన ఆ పాపలో కలిగింది. అది సాధ్యం కాదని తెలుసుకున్నాక.. మరింత బాధపడసాగింది. కాసేపు అలాగే దిగాలుగా కూర్చున్న రమ, మెల్లగా నిద్రలోకి జారుకుంది.
మర్నాడు కూడా అదే ధ్యాసలో ఉన్న తను.. అమ్మ కోసం చూసింది. అన్నయ్యకు ప్రేమగా ఇడ్లీ తినిపిస్తుండటం చూసి, వెళ్లి పక్కనే కూర్చుంది. ‘నీకూ పెట్టనా తల్లీ’ అంటూ ఆప్యాయంగా తినిపించసాగింది. నాన్న వచ్చి హరికి మందులు వేసి మంచినీళ్లు తాగించారు. కాసేపు ఇద్దరికీ కథలు చెప్పారు. అమ్మ కూడా అక్కడే ఉండి ఆ కబుర్లు వింటూ తన పని చేసుకోసాగింది. తల్లిదండ్రుల కళ్లలో ప్రేమ, గాయపడిన అన్న పట్ల వారు చూపించే శ్రద్ధ రమకు ఎంతో సంతోషం కలిగించాయి. మాత్రల ప్రభావంతో కాసేపటికి నిద్రలోకి జారుకున్నాడు హరి. నాన్న వరండాలోకి వెళ్లి ఏదో రాయసాగారు.
ఆ రోజు ఆదివారం కావడంతో ఏమీ తోచని రమ.. తనకిష్టమైన ఆ బార్బీ బొమ్మను బయటకు తీసింది. కీ ఇచ్చి ఆడుకోబోయింది. కానీ ఎంతకూ కదల్లేదు. నాన్నకి చూపించినా, ఎంత ప్రయత్నించినా ఫలితం లేకపోవడంతో.. ‘ఇది పాడైపోయిందమ్మా.. నీకు ఇంతకంటే మంచి బొమ్మ కొనిస్తాలే.. ఈరోజుకి వేరే బొమ్మలతో ఆడుకో.. లేకపోతే కథల పుస్తకాలు చదువుకో. సరేనా?’ అన్నారు ప్రేమగా. రమ కూడా సరేనంటూ తలూపింది. నాన్న వెంటనే ఆ బొమ్మను ఇంటి బయట చెత్తకుండీలో పడేశారు. ఇంతలో కొడుకు గది నుంచి శబ్దం వినిపించడంతో వెళ్లి చూశారు. తన చెయ్యి పట్టుకుని దగ్గరగా కూర్చున్నారు.
‘కాసేపు ఆడుకోవడం, పాడైతే మరమ్మతు చేసుకోవడం, కుదరకపోతే పారేయడం తప్ప బొమ్మల పట్ల ఎలాంటి ఆప్యాయతా చూపించం. ఒకవేళ కొద్దిరోజులు ఇష్టంగా దాచుకున్నా.. ఏదో ఒకరోజు వాటిని బయట పడేయాల్సిందే. నొప్పే కాదు.. ప్రేమ, బంధాల గురించి కూడా బొమ్మలకు తెలియదు.. అమ్మానాన్నల ప్రేమలో, అన్నయ్య స్నేహంలో గారాబంగా పెరిగే అమ్మాయిగా ఉండడమే ఎంతో అదృష్టం’ అని రమకు అర్థమైంది. దాంతో బొమ్మగా మారాలనుకున్న తన ఆలోచనను మనసులోంచి తీసేసింది. ఆనందంతో మబ్బులు తొలగిన సూర్యుడిలా ముఖం వెలిగిపోయింది.

 గుడిపూడి రాధికారాణి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని