కళ్లు తెరిపించిన కుందేలు!

అదో చిట్టడవి. అప్పుడే తెల్లవారింది. ‘జనని’ అనే కుందేలు అప్పుడే నిద్ర లేచింది. దాని నివాసం నుంచి బయటకు వచ్చింది. అలవాటులో భాగంగా దగ్గరలో ఉన్న మామిడి చెట్టు వద్దకు వెళ్లింది. దాని స్నేహితులైన కాకి, కొంగలను పిలిచింది. కానీ అవి వినిపించుకోలేదు.

Updated : 19 Aug 2023 06:32 IST

అదో చిట్టడవి. అప్పుడే తెల్లవారింది. ‘జనని’ అనే కుందేలు అప్పుడే నిద్ర లేచింది. దాని నివాసం నుంచి బయటకు వచ్చింది. అలవాటులో భాగంగా దగ్గరలో ఉన్న మామిడి చెట్టు వద్దకు వెళ్లింది. దాని స్నేహితులైన కాకి, కొంగలను పిలిచింది. కానీ అవి వినిపించుకోలేదు. అప్పుడు కుందేలు వాటి వైపు చూస్తూ.. ‘ఆహారం కోసం బయటకు వెళదాం పదండి’ అంది. ‘నేను రాను.. రాలేను’ అంటూ బదులిచ్చింది కాకి. ‘నేను కూడా రానంటే రాను’ అంది కొంగ. ‘మీ ఇద్దరికీ ఏమైంది ఈరోజు. నాతో రానని ఎందుకు అంటున్నారు?’ అని అడిగిందా కుందేలు.

‘ఏముంది.. దాని పిల్లల అల్లరిని కాకి గోలతో పోల్చిందా కొంగ.. కోతులు గోల చేయవా? వాటితో పోలిస్తే మాదీ ఓ అల్లరేనా?’ అని బాధగా విషయం చెప్పి.. ‘అందుకే ఇక కొంగతో మాట్లాడను. దాంతో కలిసి బయటకు రాను’ అంది కాకి. ‘అలా ఎందుకు అన్నావు మిత్రమా?’ అంటూ కొంగ వైపు చూసింది కుందేలు. ‘‘ముందు ఆ కాకే.. నిద్రపోతున్న పిల్లలతో.. ‘కొంగ జపం, దొంగ జపం అంటారు. మీరు నటిస్తున్నారని నాకు తెలుసు.. ఇక లేవండి’ అంది. మాది దొంగ జపమా? ఆహారం కోసం ఆరాటమని తెలియదా.. అది వేటలో భాగం. అంత మాత్రానికే మమ్మల్ని అంత మాట అంటారా? ఆ మాటకొస్తే నక్క జిత్తులతో పోలిస్తే మా జపం ఏపాటిది? ముందుగా కాకి అన్నదనే బాధలో నేనూ అన్నాను. కాకితో నేనూ రాను.. రాలేను’’ అని కచ్చితంగా చెప్పేసింది కొంగ.

మిత్రుల బాధకు కారణం తెలుసుకున్న కుందేలు.. వాటివైపు చూస్తూ గట్టిగా నవ్వింది. దాని నవ్వు వాటిని మరింత బాధ పెట్టింది. ‘మమ్మల్ని ఓదార్చడం పోయి, వెక్కిరింపుగా నవ్వుతావా?’ అంటూ కుందేలు వైపు కోపంగా చూశాయవి. ‘కారణం లేకుండా నవ్వు రాదు. తోరణం లేకుండా పందిరి ఉండదు. మీరిద్దరూ నాతో వస్తే నా నవ్వుకు కారణం చెబుతాను. సరేనా?’ అంది కుందేలు. సరేనంటూ దాని వెంట వెళ్లాయా రెండు. కొంత దూరం వెళ్లిన తరువాత.. ‘ఆగండి’ అన్న కుందేలు పిలుపుతో అవి ఒక్కసారిగా ఆగాయి. ‘మనకు కనిపిస్తున్న ఆ వేప చెట్టు వైపు చూడండి. అక్కడ కోకిల దాని పిల్లలతో చెప్పేది జాగ్రత్తగా వినండి’ అంది కుందేలు.

అక్కడ కోకిల దాని పిల్లలతో.. ‘మీలో ఎవరు ఆహారం సంపాదించినా ఒక్కరే తినకూడదు. కాకిని చూడండి. ఆహారం ఒంటరిగా సంపాదిస్తుంది. కానీ, కావ్‌.. కావ్‌మంటూ తోటి కాకులను పిలుస్తుంది. దాని దగ్గరున్న ఆహారాన్ని మిగతావాటికీ పంచుతుంది. వాటితోపాటే అదీ తింటుంది. అర్థం చేసుకుంటే కాకికున్న ఈ గొప్ప గుణం తెలుస్తుంది. లేకపోతే కాకి గోలగా అనిపిస్తుంది. అర్థమైందా?’ అని తల్లి అడగ్గానే.. ‘అర్థమైందమ్మా..’ అన్నాయా పిల్ల కోకిలలు. కోకిల మాటలు విన్న కాకికి ఎంతో సంతోషమేసింది. కొంగ మాత్రం తలదించుకుంది. అక్కడి నుంచి వాటిని మరికొంత దూరం తీసుకెళ్లింది కుందేలు.

అక్కడే కనిపిస్తున్న నెమలి గుంపును పరిశీలించమని మిత్రులకు చెప్పింది. అక్కడ నెమలి దాని పిల్లలతో.. ‘మీరు నాట్యం చేసేటప్పుడు ఏకాగ్రతగా ఉండాలి. కొంగను చూడండి.. చెరువులో చేపను వేటాడేందుకు ఒంటి కాలి మీద ఎలా నిల్చుంటుందో.. జపం చేస్తూనే, చేపను చూసిన వెంటనే చటుక్కున పట్టుకుంటుంది. కొంగకున్న ఆ సునిశిత పరిశీలనే ఏకాగ్రత అనిపించుకుంటుంది. అర్థం చేసుకోలేని వాళ్లకు దొంగ జపంలా అనిపిస్తుంది. మీరు కొంగలా ఏకాగ్రతతో సాధన చేస్తే బాగా నాట్యం చేయగలరు’ అంది. వెంటనే ‘అలాగేనమ్మా’ అంటూ గంతులేశాయా పిల్ల నెమళ్లు. నెమలి మాటలు కొంగలో ఎంతో సంతోషాన్ని కలిగించాయి. ఇప్పుడు కాకి తలదించుకుంది.

అది గమనించిన కుందేలు.. దాని ఇద్దరి మిత్రులతో.. ‘కోకిల, నెమలి రోజూ వాటి పిల్లలకు మీ గురించి చెబుతాయి. ఆ మాటలు విన్న నేనూ, మీ గొప్ప గుణం తెలుసుకున్నాను. మీలాంటి స్నేహితులున్నందుకు గర్వపడతున్నాను. మీ ప్రతిభను తోటి జీవులు అంత గొప్పగా చెబుతుంటే, మీరు మాత్రం ఒకరినొకరు తిట్టుకుంటున్నారు. అందుకే నేను నవ్వాను. ఇప్పుడు నా నవ్వుకు కారణం తెలిసినట్టేనా?’ అని అడిగింది. ‘మిత్రమా.. నీ నవ్వుకు కారణమేంటో అర్థమైంది. మా తప్పు కూడా తెలిసింది. ఇక నుంచి ఒకరినొకరం తిట్టుకోకుండా, కలసిమెలసి ఉంటాం’ అన్నాయి కాకి, కొంగ. మిత్రుల మాటలతో కుందేలు ఆనందించింది. ఆహారం కోసం వెళ్దామంటూ వాటిని ముందుకు నడిపించింది.

కె.వి.లక్ష్మణరావు


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు