యుద్ధం తప్పింది.. సమస్య తీరింది!

విక్రమపురిని ప్రసేనుడు పాలించేవాడు. అతని మంత్రి సుశర్మ. ప్రసేనుడి కుమారుడు దివ్యదత్తుడు సీతాపురంలోని గురుకులంలో విద్యను అభ్యసిస్తున్నాడు.

Updated : 22 Aug 2023 05:25 IST

విక్రమపురిని ప్రసేనుడు పాలించేవాడు. అతని మంత్రి సుశర్మ. ప్రసేనుడి కుమారుడు దివ్యదత్తుడు సీతాపురంలోని గురుకులంలో విద్యను అభ్యసిస్తున్నాడు. రాజు ఆరోగ్యం సరిగ్గా లేకపోవడంతో కోటకు పిలిపించి, ఒక శుభముహూర్తాన దివ్యదత్తుడికి పట్టాభిషేకం చేయించాడు. కొద్దిరోజుల్లోనే దివ్యదత్తుడు, మంత్రితో సహా వివిధ రంగాల్లో పనిచేసే పెద్దవారిని ఉద్యోగ విరమణ చేయించాడు. వారి స్థానాల్లో గురుకులంలోని మిత్రులతో పాటు, నగరంలోని యువకులను నియమించాడు.

‘అనుభవం లేని వారితో రాజ్యపాలన చేయలేవు. అదను చూసుకుని పొరుగు రాజ్యాల వారు మనతో యుద్ధానికి సిద్ధమవుతారు’ అని తండ్రి ఎంత చెప్పినా ఆ మాటలను యువరాజు పట్టించుకోలేదు.

ఉద్యోగం కోల్పోయిన వారిలో సైన్యాధికారి వీరయ్య కూడా ఉన్నాడు. ఒకసారి యుద్ధరంగంలో రాజును కాపాడబోయి ఒక కాలును కూడా పోగొట్టుకున్నాడు. ‘కనీసం సైన్యాధికారినైనా తొలగించకు’ అన్నాడు రాజు. ‘కాలు పోయింది. పైగా అరవై సంవత్సరాలు నిండాయి’ అని యువరాజు అన్నాడు. ‘కానీ.. వీరయ్యకు పోరాటం చేసే శక్తి మాత్రం తగ్గలేదు’ అన్నాడు రాజు. అయినా యువరాజు ఇవేమీ పట్టించుకోలేదు. ‘ప్రభూ.. ఇంటి దగ్గర యువకులకు కత్తి సాము, విలు విద్య, మల్లయుద్ధంలో ఉచిత శిక్షణ ఇవ్వడానికైనా నాకు అనుమతి ఇవ్వండి’ అని వీరయ్య, యువరాజును కోరాడు. అందుకు మాత్రం యువరాజు అంగీకరించాడు.

ఆ ఏడు వర్షాలు లేక ధాన్యానికి కొరత ఏర్పడింది. యువరాజు.. రాజు అయ్యాక ఇలా అయ్యిందని ప్రజలు చెవులు కొరుక్కున్నారు. ‘గోరు చుట్టుపై రోకటి పోటు’లా పొరుగున ఉన్న ఉదయగిరి రాజు నరేంద్రుడు, విక్రమపురిపై యుద్ధం ప్రకటించాడు. ప్రత్యేక మందిరంలో చికిత్స పొందుతున్న ప్రసేనుడికి, ఉదయగిరి రాజు యుద్ధం ప్రకటించిన విషయం తెలియనివ్వకుండా జాగ్రత్త పడ్డాడు యువరాజు. వీరయ్య పాత మంత్రి సుశర్మను కలిసి విషయం చెప్పాడు.

‘యువరాజా! పెద్దల సలహా తీసుకోండి.. ఉదయగిరితో పోలిస్తే మన సైన్యం నాలుగో వంతు ఉంటుంది. ఒక కాలు లేకపోయినా, వీరయ్య ఎంతో అనుభవం కలిగినవాడు. పదిమందిని ఒకేసారి ఎదుర్కొనే సామర్థ్యం కలిగినవాడు. అతని సహాయం తీసుకోండి’ అన్నాడు సుశర్మ. కానీ ఆ మాటలను కూడా పెడచెవిన పెట్టాడు దివ్యదత్తుడు.

వీరయ్య మరుసటి రోజు గుర్రం మీద ప్రయాణం చేసి ఉదయగిరి రాజ్యం చేరుకున్నాడు. రాజు నరేంద్రుడి అనుమతి పొంది కర్రను ఆసరా చేసుకుని ఒక కాలుతో నడుస్తూ సభలోకి ప్రవేశించాడు. ‘మహారాజా! వందనాలు. నా పేరు వీరయ్య. నాకు కత్తిసాము, విలువిద్య, మల్లయుద్ధంలో ప్రావీణ్యం ఉంది. ఇప్పటి వరకు నన్ను ఓడించిన వారు లేరు. మీ రాజ్యంలోని వీరులతో పోటీ పడడానికి వచ్చాను’ అన్నాడు. నరేంద్రుడు ప్రతి నమస్కారం చేస్తూ ‘కత్తిసాము, విలు విద్యలో సరే.. మల్లయుద్ధంలో కూడా అంటున్నారు!’ అని సందేహం వెలిబుచ్చాడు. ‘మహారాజా! నాకు ఒంటి కాలు అని సందేహపడకండి’ అన్నాడు వీరయ్య. ‘అలాగే... రేపు మా వాళ్లతో మీకు పోటీలు ఉంటాయి. అంతవరకు మీరు ప్రత్యేక మందిరంలో విశ్రాంతి తీసుకోండి’ అని ఏర్పాట్లు చూడమని మంత్రికి చెప్పాడు.

మరుసటి రోజు రాజమందిరాన్ని ఆనుకొని ఉన్న ఉద్యానవనంలో అన్ని పోటీలకు ఏర్పాట్లు జరిగాయి. తిలకించడానికి ప్రజలు వచ్చారు. ఆస్థాన వీరులు కత్తిసాము, విలువిద్యలోనూ వీరయ్యతో పోటీపడి ఓడిపోయారు. తరువాత మల్లయుద్ధం ప్రారంభమైంది. వీరయ్య ఒంటి కాలితోనే పోరాట యోధులందరినీ చిత్తు చేశాడు. ప్రాంగణం మొత్తం కరతాళధ్వనులతో మారు మోగింది. మహారాజు కూడా చప్పట్లు కొట్టి వీరయ్యను అభినందించాడు.

‘వీరయ్యా! మీకు ఏం కావాలో కోరుకోండి’ అన్నాడు నరేంద్రుడు. ‘మహారాజా! మీరు నన్ను ఉరి తీసినా ఫరవాలేదు. మీరు యుద్ధం ప్రకటించిన విక్రమపురి వాసిని నేను’ అన్నాడు వీరయ్య. ‘మీ ధైర్యానికి మెచ్చుకుంటున్నాను. మీకు ఏం కావాలన్నా ఇస్తాను... చెప్పండి’ అన్నాడు రాజు. ‘మహారాజా! మా రాజ్యంలో ఈ ఏడాది వర్షాలు లేక ధాన్యం కొరతతో ఇబ్బంది పడుతున్నాం. అలాంటి తరుణంలో మీరు యుద్ధం ప్రకటించారు. మీతో పోరాడే శక్తి మాకు లేదు. మా రాజ్యం మీద దయచేసి దండెత్తకండి. ఇదే నా విన్నపం’ అని వినమ్రంగా చేతులు జోడించాడు వీరయ్య. ‘మీ కోరిక తప్పక మన్నిస్తాం. అయితే మీరు కత్తిసాము, విలువిద్య, మల్లయుద్ధంలో కిటుకులు మా వాళ్లకు నేర్పాలి’ అన్నాడు నరేంద్రుడు.

‘మహారాజా! నేను విక్రమపురి ఉప్పు తింటున్నాను. యువరాజు దివ్యదత్తుడు అనుమతిస్తే తప్పకుండా మూడు విద్యలూ నేర్పిస్తాను’ అన్నాడు వీరయ్య. ‘మీ దేశభక్తి చాలా గొప్పది’ అని వీరయ్యను మెచ్చుకొని ‘యుద్ధం ఆపేయడంతోపాటు వర్షాలు కురిసి ఆహార కొరత తీరే వరకు మేము ఉచితంగా మీ రాజ్యానికి ధాన్యాన్ని అందిస్తాం. మాది ఒక కోరిక. మీ రాజ్యంలోనే వీరయ్య దగ్గర మా సైన్యంలోని కొందరు శిక్షణ పొందుతారు. అందుకు సమ్మతించండి’ అని రాజపత్రంలో రాసి వీరయ్యకు ఇచ్చాడు నరేంద్రుడు.

ఆ రాజపత్రం తీసుకుని రాజుకు ధన్యవాదాలు చెప్పి, ముందుగా సీతాపురంలోని గురుకుల గురువు సదానందుణ్ని కలిసి జరిగింది చెప్పాడు. సదానందుడు, వీరయ్యతో పాటు కోటకు చేరుకున్నాడు. గురువు సదానందుణ్ని చూడగానే దివ్యదత్తుడు పాదాభివందనం చేశాడు. ‘వీరయ్యా! ఆ రాజపత్రం దివ్యదత్తుడికి ఇవ్వు’ అన్నాడు సదానందుడు. దివ్యదత్తుడు అది తీసుకుని చదువుతుండగా.... ప్రసేనుణ్ని, సుశర్మ తీసుకుని వచ్చాడు. ‘దత్తా! సుశర్మ రహస్యమార్గం గుండా వచ్చి నన్ను కలసి విషయమంతా చెప్పాడు’ అన్నాడు ప్రసేనుడు. ‘ఆ లేఖ పూర్తిగా బయటకు చదువు’ అన్నాడు సదానందుడు. అది చదివిన దివ్యదత్తుడి కళ్లలో నీళ్లు తిరిగాయి. వెంటనే.. ‘వీరయ్యా! మీ అవసరం లేదని అన్నాను. నన్ను క్షమించండి! మన రాజ్యంపై యుద్ధం ఆపడంతో పాటు ధాన్యం కొరతను కూడా తీర్చారు’ అని అతనికి నమస్కరించాడు. ప్రసేనుడు, సుశర్మ కూడా వీరయ్యను అభినందించారు.

‘అన్ని రంగాల్లో పెద్దలను తిరిగి కొలువులోకి తీసుకో. వారు ముఖ్య సలహాదారులుగా ఉంటారు. నీవు ఇచ్చిన కొలువులలో యువకులంతా కొనసాగుతూ.. పెద్దల ద్వారా అనుభవం గడిస్తారు. ఇదే నీవు నాకు ఇచ్చే గురుదక్షిణ’ అని అన్నాడు సదానందుడు. ‘చిత్తం గురువుగారు.. ఈ రోజు నుంచి మీరు చెప్పిన విధంగా నడుచుకుంటాను. అంతే కాదు నేనే స్వయంగా విక్రమపురి వెళ్లి, ఆ మహారాజును కలసి ధన్యవాదాలు చెప్పి, వీరయ్యే మీ రాజ్యం వచ్చి మూడు విద్యల్లో శిక్షణను ఇస్తారని చెబుతాను’ అన్నాడు దివ్యదత్తుడు. సమస్య పరిష్కారమైనందుకు, దివ్యదత్తుడిలో మార్పు వచ్చినందుకు అందరూ సంతోషించారు.

యు.విజయశేఖర రెడ్డి


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని