ఎలుగుబంటి వైద్యం!

అనగనగా ఓ అడవి. అందులో అన్ని రకాల క్రూర, సాధు జంతువులు, పక్షులు కలసిమెలసి ఉంటున్నాయి. అడవికి రాజు పులి. మంత్రిగా అంజి అనే కోతి ఉండేది.

Updated : 31 Aug 2023 04:40 IST

అనగనగా ఓ అడవి. అందులో అన్ని రకాల క్రూర, సాధు జంతువులు, పక్షులు కలసిమెలసి ఉంటున్నాయి. అడవికి రాజు పులి. మంత్రిగా అంజి అనే కోతి ఉండేది. జంతువులు, పక్షులకు ఎలాంటి జబ్బు చేసినా ఎలుగుబంటి ఆకు పసర్లతో చక్కని వైద్యం చేసేది.
ఒకరోజు... ‘ఎలుగుబంటి మామా! నీ తరువాత వైద్యం అందించే నేస్తం ఉండాలి కదా? నాకూ ఆ విద్య నేర్చుకోవాలని ఆసక్తిగా ఉంది. నేర్పుతావా?’ అని అడిగింది అంజి. ‘నా తరువాత అని అంటున్నావు.. అంటే, నాకు మరణం ఉందనుకుంటున్నావా? నేను చావురాని మందు తిన్నాను.. తెలుసా!’ అని గర్వంగా అంది ఎలుగుబంటి.

‘మామా! చావు పుట్టుకలు మన చేతిలో లేవు. ఏ జీవి అయినా ఏదో ఒకనాటికి చనిపోవాల్సిందే’ అంది అంజి. ‘చెప్పాగా.. నాకు ఏ జబ్బూ చేయదు. చావు రాదు అని..’ మరోసారి గర్వంగా అంది ఎలుగుబంటి. రాజు దగ్గరకు వెళ్లి జరిగింది చెప్పింది అంజి.
పులి, ఎలుగుబంటిని రమ్మని కబురు పెట్టింది. ‘ఎలుగుబంటి మామా! అంజి చెప్పింది సబబుగా ఉంది. దానికి వైద్యం నేర్పించవచ్చు కదా?!’ అంది పులి. ‘రాజా! మీరు కూడా అదే మాట అంటున్నారు. నేనుండగా ఎవ్వరికీ వైద్యం నేర్పను. మీరు గట్టిగా మాట్లాడితే నేను ఈ అడవిలో ఉండను గాక ఉండను. చక్కగా పక్క అడవికి వెళ్లిపోతాను. మీ ఇష్టం’ అని అంది.
‘సరేలే! ఇంతటితో ఈ విషయం వదిలేద్దాం. నువ్వు వైద్యం ఎవ్వరికీ నేర్పనక్కర్లేదు’ అంది పులి. ఎలుగుబంటి అక్కడి నుంచి వెళ్లాక... ‘మనకు వైద్యం అవసరం. దాన్ని ఇంతకంటే బలవంతపెట్టలేం’ అని పులి అంజితో చెప్పింది. ‘అలాగే రాజా!’ అంది అంజి. కానీ అంజికి మనసులో వైద్యం ఎలాగైనా నేర్చుకోవాలన్న కుతూహలం పెరిగింది.
ఒకరోజు జింకకు బాగా తలనొప్పి వచ్చి ఎలుగుబంటి వద్దకు వెళ్లింది. ‘నాకు తలనొప్పిగా ఉంది. మందు కావాలి మామా!’ అని అంది. ‘నువ్వు వెళ్లు.. నేను కాసేపటికి తెచ్చిస్తాను’ అని జింకను పంపించింది. ఇదంతా ఒక చిలుక గమనించింది. ఎలుగుబంటి ఎవ్వరూ చూడకుండా కొద్ది దూరంలో ఉన్న మొక్కల వైపు వెళ్లసాగింది. ఆ చిలుక ఏ మాత్రం చప్పుడు కాకుండా ఎగురుతూ ఎలుగుబంటిని వెంబడించింది. అది ఒక మొక్క వద్దకు వెళ్లి, నాలుగు ఆకులు కోసుకొని ఇంటి బాట పట్టింది.
చిలుక ఆ మొక్కను గుర్తు పెట్టుకుని ఎగురుతూ దగ్గరలో ఉన్న అంజికి చెప్పి, అక్కడకు తీసుకు వచ్చింది. ‘తలనొప్పికి ఈ మొక్క ఆకులు వాడాలన్న మాట’ అని అంజి ఆ మొక్కకు ఒక గుర్తు పెట్టింది. ఎలుగుబంటి బాగా నూరిన ఆకుల ముద్దను జింక నోట్లో పెట్టి, కాస్త విశ్రాంతి తీసుకో అని చెప్పింది. ఒక పూటలో జింక తల నొప్పి తగ్గింది. అది మొదలు రకరకాల జబ్బు పడ్డ జంతువులు, పక్షులు ఎలుగుబంటికి చెప్పడం, అది మొక్కల వైపు వెళ్లడం, చిలుక వెంబడించి ఆ మొక్కలను చూసి అంజికి చెప్పడం, అంజి వాటిని గుర్తుపెట్టుకోవడం చేసింది.
జంతువులకైతే నాలుగు, పక్షులకైతే రెండేసి ఆకుల చొప్పున ఎలుగుబంటి వాడేది. కొంతకాలం తర్వాత, ఒకరోజు ఎలుగుబంటికి బాగా నీరసం వచ్చి నడవలేని స్థితికి చేరింది. కాసేపటికే జ్వరంతో మూలగసాగింది. అటుగా వచ్చిన కుందేలు... ‘ఏం మామా! ఆరోగ్యం బాగాలేదా... అలా మూలుగుతున్నావు?’ అంది. కళ్లు పూర్తిగా తెరవకుండానే... ‘అవును.. కాళ్లు అస్సలు కదపలేకున్నాను. ఒళ్లు పులిసిపోయినట్టుంది’ అని సమాధానం ఇచ్చింది. ‘అయ్యో! అలాగా మరి ఆకు పసరు వాడకపోయావా?’ అంది కుందేలు. ‘నిలువ మందు పనికి రాదు. ఎప్పటికప్పుడు చేసుకోవాలి. మొక్కల వద్దకు వెళ్లాలి. కానీ వెళ్లే పరిస్థితి లేదు’ అంది ఎలుగుబంటి.
కుందేలు ఈ విషయాన్ని అంజికి చెప్పింది. అంజి వెళ్లి నొప్పులు, జ్వరానికి ఆకులు తెంపి, బాగా నూరి అరటిపండులో పెట్టి ఎలుగుబంటి నోటికి అందించింది. అది మెల్లగా కళ్లు తెరిచి ఆ పండును తినేసింది. ‘ఏంటి.. రుచి అదోలా ఉంది?’ అంటూనే నిద్రలోకి జారుకుంది.
సాయంత్రానికల్లా ఎలుగుబంటి కోలుకుని జంతువుల వద్దకు వచ్చింది. ‘చూశారా? నేను ఏ మందు వాడకుండానే నా ఒంటి నొప్పులూ, జ్వరం ఎలా తగ్గిపోయాయో’ అని అంది.
‘మామా! నువ్వు వైద్యం చేసే ఆకులనే ముద్దగా చేసి అరటిపండులో పెట్టి అంజి నీకు తినిపించింది’ అని చిలుక చెప్పింది. ‘ఆకుల వైద్యం అంజికెలా తెలుసు?’ అంది ఎలుగుబంటి. చిలుక మొత్తం విషయం చెప్పింది. ‘నీకు తెలియకుండా వైద్యం నేర్చుకున్నందుకు నన్ను క్షమించు’ అని అంది అంజి. అదే సమయానికి పులి రాజు అక్కడకు వచ్చి ‘ఎలుగుబంటి మామా... ఇప్పుడిప్పుడే నేర్చుకున్న వైద్యంతో అంజి నిన్ను కోలుకునేలా చేసింది’ అని అంది. ‘అంజీ!... నాకు వైద్యం చేసినందుకు ధన్యవాదాలు... నాకు జబ్బులు రావు... మరణం లేదు అని అహంకారంతో మాట్లాడాను. నిజానికి పక్క అడవిలో ఉన్నప్పుడు, నాకు ఈ ఆకు పసర్ల వైద్యాన్ని ఒక కోతి నేర్పింది. నేను మాత్రం ఎవ్వరికీ నేర్పనని మూర్ఖంగా వాదించాను. ఇందుకు మీరు నన్ను క్షమించాలి’ అని బాధపడింది ఎలుగుబంటి.
‘వీలు చిక్కినప్పుడల్లా ఆయా జబ్బులకు వైద్యం అన్ని జంతువులకు, పక్షులకు నేర్పించు. అంజి నీకు సాయపడుతుంది’ అంది పులి. ‘అలాగే రాజా!’ అంది ఎలుగుబంటి. నేస్తాలన్నీ సంతోషించాయి.

యు. విజయ శేఖరరెడ్డి 


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని