ఇంతకీ ఎవరు గెలిచారంటే...!

ఓ అడవిలో ఉన్న చెరువులో అన్ని రకాల జలచరాలు నివసిస్తూ ఉండేవి. చెరువుకు దగ్గర్లోనే నత్తలు, కప్పలు కూడా ఉండేవి.

Updated : 05 Sep 2023 04:59 IST

ఓ అడవిలో ఉన్న చెరువులో అన్ని రకాల జలచరాలు నివసిస్తూ ఉండేవి. చెరువుకు దగ్గర్లోనే నత్తలు, కప్పలు కూడా ఉండేవి. నెమ్మదిగా నడిచే నత్తలను చూసి చేపలు, కప్పలు, ఎండ్రకాయలు నవ్వుతూ ఉండేవి. అవి ఎదురు పడితే ఎగతాళి చేస్తూ ఉండేవి. తాబేళ్లు మాత్రం అలా ఎగతాళి చేయడం మంచిది కాదని చేపలకు హితబోధ చేస్తుండేవి. తాబేళ్ల మాటలను పట్టించుకోని చేపలు.. నత్తలను హేళన చేయడం మానుకోకపోగా, మరింతగా అవమానపరుస్తూ ఉండేవి.

నత్తలకు అక్కడ ఉండటం కష్టంగా అనిపించేది. కానీ, దగ్గర్లో మరో చెరువు లేకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లోనే అవి అక్కడ ఉండసాగాయి. నత్తల సమూహంలో తెలివైనది ఒకటుంది. అది చేపలు, కప్పలు, ఎండ్ర కాయలకు బుద్ధి చెప్పాలనుకుంది. ఓ రోజు తెలివైన నత్త చెరువులో నాచు తినడానికి వెళ్లింది.

అక్కడే ఉన్న ఓ చేప.. ‘ఏయ్‌ నత్తా! ఏంటి సంగతి? ఇక్కడకు రావడానికి నీకు ఎన్ని రోజులు పట్టింది?! తిరిగి నీ స్థావరానికి వెళ్లడానికి ఓ సంవత్సరం పడుతుందా?!’ అంటూ ఎగతాళిగా నవ్వింది. సందర్భం కోసమే ఎదురుచూస్తున్న ఆ నత్త... ‘ఓయ్‌ చేపా.. అంతలా మిడిసిపడకు.. ఎగతాళి నేనూ చేయగలను. చెరువు దాటి బయటకు వస్తేనే.. ఊపిరి ఆడక చచ్చే నువ్వు కూడా నా గురించి అవహేళనగా మాట్లాడతావా?! మేం నీటిలోనైనా, నేల మీదనైనా హాయిగా బతకగలం. కావాలంటే మా గొప్ప గురించి తాబేళ్లు, మొసళ్లను అడుగు...!’ అంటూ ఘాటుగా బదులిచ్చింది.
చేపకు కోపం వచ్చి.. ‘ఈ చెరువు మా సామ్రాజ్యం. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్లిపో!’ అంది. వీటి గొడవను చూసి మిగతా చేపలు, కప్పలు, ఎండ్రకాయలు, తాబేళ్లు వచ్చాయి. అవి విషయం తెలుసుకొని నత్తపై ఆగ్రహం వ్యక్తం చేశాయి.
ఇంతలో ఓ తాబేలు ముందుకు వచ్చి... ‘మిత్రులారా.. కోపం వద్దు. మీరంతా నత్తల నడకను అపహాస్యం చేశారు. అందుకు దీటుగా బదులిచ్చిన ఈ నత్తను నేను సమర్థిస్తున్నాను. గతంలో మాకు, కుందేలు జాతికి మధ్య ఇలాంటి తగాదానే వచ్చిందట. అప్పుడు పరుగుపందెంలో మా జాతి గెలిచిందని మా పెద్దోళ్లు చెబితే విన్నాను. మరోసారి అలాంటి ఘటనను పునరావృతం చేద్దాం అనుకుంటున్నారా! నత్తకు, మీకు మధ్య పరుగు పందేనికి మీరు సిద్ధమేనా?’అని అంది.

చేపలు, కప్పలు, ఎండ్రకాయలు సై అన్నాయి. నత్త కూడా సిద్ధమేనని బదులిచ్చింది. మరుసటి రోజు పరుగు పందేనికి అన్ని ఏర్పాట్లు చేసింది తాబేలు. ఆ పోటీని చూడటానికి అక్కడే ఉన్న కాకులు, కొంగలు కూడా వచ్చాయి. చెరువు ఒడ్డు నుంచి కాస్త దూరంగా ఉన్న మామిడి చెట్టును తాకి తిరిగి రావడమే పందెం.

పోటీ మొదలయ్యే ప్రాంతంలో ఒక గీత గీసింది తాబేలు. ఆ గీత మీద నత్త, కప్ప, ఎండ్రకాయ నిలిచి ఉన్నాయి. పందెంలో పాల్గొనడానికి చేపలు సంశయిస్తున్నాయి. పోటీలో లేకపోతే పరువు పోతుందని ఓ భారీ చేపను రంగంలోకి దింపాయి మిగతా చేపలు. పోటీ ప్రారంభమైంది. భారీ చేపకు ఊపిరి ఆడటం లేదంటూ చెరువులోకి తిరిగి వెళ్లింది. కప్ప గెంతుతూ ఉంటే తాబేలు వచ్చి కప్పను ఆపింది. ఇక్కడ గెంతడం కుదరదని, పరుగు, నడక మాత్రమే పోటీలో భాగమని చెప్పింది. కప్ప తన పోటీని విరమించుకుంది. ఎండ్రకాయ ఎక్కడా... అని అందరూ చూస్తుంటే అది మామిడి చెట్టు వైపు వెళ్లకుండా చెరువు ఒడ్డు వెంబడి వెళుతూ కనిపించింది. అందరూ నవ్వారు. ‘నాకు తిన్నగా నడవడం రాదు కదా.. పక్కగా నడుస్తాను!’ అంది ఎండ్రకాయ. ‘అయితే నువ్వు ఎప్పటికీ లక్ష్యాన్ని చేరుకోలేవు’ అని పోటీ నుంచి ఎండ్రకాయను విరమింపజేసింది తాబేలు. ఈ లోపల నత్త మామిడి చెట్టును తాకి తిరిగి వచ్చేసింది. మిగతా నత్తలన్నీ కేరింతలు కొట్టాయి. నత్త గెలిచినట్టుగా తాబేలు ప్రకటించింది. తీవ్ర ఉత్కంఠగా ఎదురు చూస్తున్న చెరువులోని చేపలు నిరుత్సాహపడ్డాయి. కప్పలు, ఎండ్రకాయలు తలలు వంచుకున్నాయి. సృష్టిలో అందరూ సమానమేనని తాబేలు చేపలకు చెప్పింది. వాటి తప్పు తెలుసుకున్న చేపలు, కప్పలు, ఎండ్రకాయలు.. నత్తలను క్షమించమని కోరాయి.

 వడ్డేపల్లి వెంకటేష్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని