పర్యావరణ హితమే.. పండగ పరమార్థం

రమణి చాలా హుషారుగా పాఠశాల నుంచి వచ్చింది. పుస్తకాల సంచిని చక్కగా టేబుల్‌పైన పెట్టింది. రమణి ఆనందంగా ఉండడం చూసిన తాతయ్య పరబ్రహ్మం.. ‘ఏంటమ్మా.. ఈరోజు చాలా సంతోషంగా ఉన్నావు.

Published : 14 Sep 2023 00:00 IST

మణి చాలా హుషారుగా పాఠశాల నుంచి వచ్చింది. పుస్తకాల సంచిని చక్కగా టేబుల్‌పైన పెట్టింది. రమణి ఆనందంగా ఉండడం చూసిన తాతయ్య పరబ్రహ్మం.. ‘ఏంటమ్మా.. ఈరోజు చాలా సంతోషంగా ఉన్నావు. ఏంటి సంగతి?’ అని అడిగారు. ‘తాతయ్యా.. ఇంకో మూడ్రోజుల్లో వినాయక చవితి ఉంది కదా.. స్నేహితులమంతా కలిసి చందాలు వేసుకుని, మన వీధిలో గణపతి విగ్రహం పెట్టాలని అనుకున్నాం. నువ్వు మాకు సహాయం చేయాలి’ అని అడిగింది. ‘అలాగేనమ్మా..’ అన్నారు తాతయ్య. ‘మేము ఇప్పటికే రూ.3000 జమ చేశాం. ఆ డబ్బులతో మంచి రంగురంగుల గణపతి విగ్రహాన్ని కొనుక్కురావాలి’ అందామె. ‘బయట కొనడం ఎందుకు? నేనే మీకోసం మంచి మట్టి గణపతి విగ్రహాన్ని తయారు చేసి ఇస్తాను’ అన్నారాయన.

‘బజార్లో రకరకాల ఆకారాలతో బోలెడు విగ్రహాలు దొరుకుతాయి. వాటిలో నచ్చింది చూసి తీసుకుంటే సరిపోతుంది. మీకెందుకు శ్రమ?’ అంది రమణి. ‘బయట అమ్మేవన్నీ ప్లాస్టర్‌ ఆఫ్‌ పారిస్‌తో తయారు చేస్తారు. అవి పర్యావరణానికి మంచివి కాదు. మట్టి విగ్రహాలే పర్యావరణహితం’ అని బదులిచ్చారు తాతయ్య. ‘అంటే..?’ అని సందేహంగా అడిగింది రమణి. మనవరాలి ఆసక్తిని గమనించిన ఆయన.. ‘ప్లాస్టర్‌ ఆఫ్‌ పారిస్‌ నీటిలో కరిగిపోదు. భూమిలోనూ కలిసిపోదు. వాటిల్లోని రసాయనాలు అన్నింటినీ కలుషితం చేస్తాయి. మట్టి అయితే నీటిలో కరిగిపోతుంది. అంతేకాదు.. ఆ విగ్రహాల్లోని మట్టిలో ఉండే సూక్ష్మక్రిములూ నీళ్లలో ఉండే ప్రాణులకు ఆహారంగా ఉపయోగపడతాయి. అందుకే మట్టి విగ్రహాలనే మనం పూజకు వాడాలి’ అని వివరించారు తాతయ్య.

‘అలాగా.. అయితే మట్టి విగ్రహాన్ని తయారు చేసి ఇస్తామంటే మాకేం అభ్యంతరం లేదు. నేను కూడా పక్కనే కూర్చొని నేర్చుకుంటాను. ఇంకా మూడ్రోజులే సమయం ఉంది. ఎప్పుడు ప్రారంభిస్తారు?’ తాతయ్యను అడిగింది మనవరాలు. ‘రేపు పొలం నుంచి వచ్చేటప్పుడు మీ నాయనమ్మను బంక మట్టి తీసుకొని రమ్మని చెప్పు. అది వచ్చాక పని ప్రారంభిద్దాం’ అన్నారాయన. మరుసటి రోజు ఉదయమే నాయనమ్మ పొలానికి వెళ్లి మట్టి తెచ్చింది. రెండు రోజులు సెలవు కావడంతో విగ్రహం తయారీని చూసేందుకు స్నేహితులంతా రమణి ఇంటికి వచ్చారు. తాతయ్య మట్టిని చక్కగా ముద్దగా చేసి.. గణపతి ఆకారం తీసుకొచ్చారు.

ఇంతలో మనవరాలు.. ‘తాతయ్యా.. వినాయక చవితి రోజు రాత్రి చందమామను చూస్తే మనపైన అపనిందలు పడతాయని అంటారు కదా.. అది నిజమేనా?’ అని అడిగింది. పిల్లలందరూ తాతయ్య ఏం చెబుతారోనని ఆసక్తిగా వింటున్నారు. ‘ఏ తల్లికైనా పిల్లలంటే చాలా ప్రేమ. ఒకరోజు వినాయకుడు చక్కగా కుడుములు, ఉండ్రాళ్లు తిని, తల్లిదండ్రులు పార్వతీపరమేశ్వరుల దగ్గరకు వెళ్లాడు. వారి ఆశీర్వాదం కోసం కాళ్ల మీద పడి దండం పెట్టడానికి ప్రయత్నం చేశాడు. బొజ్జ అడ్డుపడటంతో ఆ పని చేయలేకపోయాడు. వినాయకుడి అవస్థలు చూసి శివుడి తలపై ఉన్న నెలవంక నవ్వింది. అప్పుడు పార్వతీదేవికి కోపం వచ్చి, తన కుమారుడిని ఎగతాళి చేసిన చందమామను చూసిన వారికి అపనిందలు కలుగుతాయని శపించింది.

ఆ తర్వాత ఇతర దేవతల కోరిక మేరకు, వినాయక చవితి నాడు గణపతిని పూజించి అక్షింతలు తలపైన వేసుకుంటే ఎటువంటి అపనిందలు కలగవని శాప పరిహారం కూడా చెప్పింది. ఇందులో మనం గ్రహించాల్సిందేంటంటే.. ఎవరినీ ఎగతాళి చేయకూడదని.. ఇతరుల్లో ఉన్న లోపాలను చూసి అవహేళన చేయరాదన్నమాట’ అని వివరంగా చెప్పారాయన.

‘భలే తాతయ్యా.. చాలా మంచి విషయాలు చెప్పారు. మేమెప్పుడూ ఎవరినీ ఎగతాళి చేయం’ అంటూ అక్కడి పిల్లలంతా మాటిచ్చారు. ఆ రోజు సాయంత్రానికల్లా మట్టి గణపతి విగ్రహం పూర్తయింది. అది చూసి పిల్లలు చాలా సరదా పడ్డారు. ‘తాతయ్యా.. విగ్రహానికి మంచి రంగులు వేయాలి’ అని రమణి అడిగింది. ‘రసాయన రంగులు వాడకూడదు. ప్రకృతి సిద్ధమైన వాటితోనే నేను విగ్రహాన్ని అందంగా అలంకరిస్తాను. మీరు చూస్తూ ఉండండి’ అని చెప్పారాయన. వెంటనే ఒక సంచి తీసుకొని, బయటకు వెళ్లి వచ్చారు తాతయ్య. సంచిలోంచి కొన్ని రకాల పువ్వులను, చెట్ల బెరడులను, పెద్ద పెద్ద ఆకులను తీశారు. వాటిని శుభ్రం చేసి, సహజసిద్ధంగా రంగులు తయారు చేశారు. వాటితో గణపతి విగ్రహాన్ని చూడముచ్చటగా తీర్చిదిద్దారు. అది చూసి పిల్లలు చాలా ఆశ్చర్యపోయారు.

‘సూపర్‌ తాతయ్యా.. రూపాయి ఖర్చు లేకుండా, దేవుడి బొమ్మను చేసేశారు. చాలా బాగుంది’ అన్నారంతా. ‘మీ అందరికీ నేను చెప్పేదేమిటంటే.. మనం ఈ నేలను, గాలిని, నీళ్లను ఎంత బాగా ఉంచితే.. మనకు అంత మంచిది. అదంతా మీ చేతుల్లోనే ఉంది. భవిష్యత్తులోనూ ఇలా మట్టి విగ్రహాలతోనే పూజలు చేద్దాం. పర్యావరణహితమే పండగ పరమార్థమని అందరికీ చాటి చెబుదాం’ అని తాతయ్య అనగానే.. సరేనంటూ పిల్లలంతా కేరింతలు కొట్టారు.  

మొర్రి గోపి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని