విజయం గెలిచిందోచ్‌!!

ఒకప్పుడు హేలాపురి రాజ్యాన్ని రాజశేఖరవర్మ జనరంజకంగా పరిపాలించేవాడు. పాడిపంటలు, భోగభాగ్యాలు, అష్టైశ్వర్యాలతో కరవు కాటకాలు లేకుండా.. దేశం సుభిక్షంగా ఉండేది.

Updated : 26 Sep 2023 05:33 IST

ఒకప్పుడు హేలాపురి రాజ్యాన్ని రాజశేఖరవర్మ జనరంజకంగా పరిపాలించేవాడు. పాడిపంటలు, భోగభాగ్యాలు, అష్టైశ్వర్యాలతో కరవు కాటకాలు లేకుండా.. దేశం సుభిక్షంగా ఉండేది. కోశాగారం ఎల్లప్పుడూ రాజ్య అవసరాలకు సరిపడా ధనం, బంగారం, వజ్ర వైఢూర్యాలతో నిండి ఉండేది. రాజుకు రాజ్య విస్తరణ కాంక్ష లేకపోవడంతో యుద్ధ భయం లేకుండా, రాజ్యంలోని ప్రజలంతా సుఖశాంతులతో జీవించేవారు. తీరిక సమయాల్లో కాలక్షేపం చేసేవారు. ఒకరి కష్టసుఖాలను మరొకరితో పంచుకునే వారు. కానీ ఇలా సిరిసంపదలతో విలసిల్లుతున్న హేలాపురి రాజ్య వైభవాన్ని సహించలేని ఇరుగు పొరుగు దేశాల రాజులు అదను కోసం ఎదురు చూడసాగారు. అటువంటి ప్రమాదాలను ఎదుర్కొనేందుకు హేలాపురి రాజ్య సైన్యం ఎల్లవేళలా సర్వసన్నద్ధంగా ఉండేది.
హేలాపురికి పొరుగు రాజ్యమైన సుగంధపురిని పరిపాలించే కేశవదత్తుడికి రాజ్య విస్తరణ కాంక్ష ఎక్కువ. అతని కన్ను ఎప్పటి నుంచో హేలాపురిపై ఉంది. తమ సైనిక బలం ఎక్కువగా ఉండడంతో కేశవదత్తుడు, హేలాపురిని సులభంగా కైవసం చేసుకుని ఆ రాజ్య సంపద అంతా అనుభవించాలనే దుర్బుద్ధితో ఉండేవాడు. ఆ తర్వాత తనకిక ఎదురు ఉండదనీ భావించేవాడు. ఇలాంటి దురాలోచనతో కేశవదత్తుడు, హఠాత్తుగా పొరుగు రాజ్యం మీద యుద్ధం ప్రకటించాడు.
ఈ విషయం తెలిసిన రాజశేఖరవర్మకు అకారణంగా తమపై దండెత్తడానికి పూనుకున్న కేశవదత్తుడిపై ఆగ్రహం కలిగింది. వెంటనే తన సైన్యాన్ని అప్రమత్తం చేసి తమపై కాలు దువ్వే సుగంధపురి సైనికులపై విరుచుకుపడడానికి సమాయత్తం కావాలని ఆదేశించాడు. అనుకున్నట్టుగానే కేశవదత్తుడు హేలాపురిపై దండెత్తాడు. హేలాపురి సైనిక బలం తక్కువే అయినా యుద్ధ వ్యూహాల్లో ఆరితేరిన వారు కావడంతో సుగంధపురి సైన్యాన్ని సులువుగా అణిచి వేయగలిగారు. కొద్ది రోజుల్లోనే యుద్ధం ముగిసింది. 
సుగంధపురి సైన్యం కకావికలమైంది. సైనికులు ప్రాణాలు అరచేత పట్టుకుని చెల్లాచెదురై పోయారు. ఓటమి పాలైన సుగంధపురి రాజు కేశవదత్తుడు అడవుల్లోకి పారిపోయాడు. అయితే సులభంగా సుగంధపురిని చేజిక్కించుకున్నామన్న అహంకారం, అత్యుత్సాహంతో హేలాపురి సైనికులు సుగంధపురి ప్రజల ధనాన్ని కొల్లగొట్టారు. అందమైన భవనాలను తగలబెట్టారు. నిలువ నీడ లేక అక్కడి ప్రజలంతా రాజశేఖరవర్మపైన కోపం పెంచుకున్నారు.  
సుగంధపురి తన కైవసమైందన్న వార్త తెలిసిన వెంటనే రాజశేఖరవర్మ తన మంత్రితో... ‘చూశారా మంత్రివర్యా! మనం విజయం సాధించాం’ అన్నాడు కాస్త గర్వంగా. ‘లేదు ప్రభూ! మనం సాధించింది విజయం కాదు. ఆ రాజ్యంపై గెలుపు మాత్రమే’ అని దిగాలుగా అన్నాడు మంత్రి. ‘విజయం అన్నా, గెలుపు అన్నా... రెండూ ఒకటే కదా మంత్రివర్యా...’ అని ఆశ్చర్యంగా అడిగాడు రాజు. ‘రెండూ ఒకటి కాదు ప్రభూ. సుగంధపురి రాజు కేశవదత్తుడు యుద్ధంలో ఓడిపోయాడు కాబట్టి మనం గెలిచాం అంతే. విజయం అంటే ఎవరికీ కష్టం, నష్టం కలిగించనిది కదా..!’ అన్నాడు మంత్రి.
‘మీ మాటల్లో నాకు తెలియని మర్మమేదో ఉన్నట్టు తోస్తోంది. అదేమిటో వివరంగా తెలియజేయండి అమాత్యా..’ అన్నాడు రాజశేఖరవర్మ. యుద్ధంలో గెలిచిన తర్వాత మన సైనికులు కనికరం లేకుండా సుగంధపురి ప్రజలను హింసించిన తీరు వివరించి చెప్పాడు మహామంత్రి. ఈ విషయాలు తెలిసిన మహారాజు కలత చెందాడు. మంత్రి ఆంతర్యాన్ని అర్థం చేసుకున్నాడు. వెంటనే రాజశేఖరవర్మ సుగంధపురి ప్రజలను అన్ని విధాలా ఆదుకోవాలని ఆదేశాలు జారీ చేశాడు. తమ సైనికులు ధ్వంసం చేసిన భవనాలనూ పునర్నిర్మింప జేసి, వాళ్ల ఆస్తిపాస్తులకూ రక్షణ కల్పించాడు. ఇప్పుడు తన రాజ్యంలో ఒక భాగమైన సుగంధపురి ప్రజలను కూడా కన్నబిడ్డల మాదిరి ఆదరించి జనరంజకమైన పరిపాలనను అందించసాగాడు. ఇప్పుడు సుగంధపురి ప్రజలు తమను ఆపదలో ఆదుకున్న రాజశేఖరవర్మను దేవుడిలా కొలవసాగారు. ‘ఇప్పుడు మనం విజయం సాధించాం ప్రభూ. ఇదే అసలైన విజయం అంటే’ అన్నాడు మహామంత్రి ఆనందంగా. ఆయన మాటలతో ఏకీభవిస్తూ.. ‘మీరు అన్నది నిజమే.. ప్రజల మనసు గెలవడమే అసలైన విజయమని ఇప్పుడు గ్రహించాను’ అన్నాడు రాజశేఖరవర్మ నవ్వుతూ..
కోనే నాగ వెంకట ఆంజనేయులు

 


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు