ఆ మెలిక.. గోపీని మార్చేసింది!

ఏడో తరగతి చదువుతున్నాడు గోపి. ఎప్పుడూ అబద్ధాలే చెబుతుండేవాడు. చదువుపైన అస్సలు ఆసక్తి ఉండేది కాదు. పరీక్షలంటే గజగజ వణికిపోయేవాడు. ఒక ఆదివారం ఉదయాన్నే ఇంటి నుంచి బయలుదేరాడు. కొంత దూరం వెళ్లాక.. ఒక దగ్గర జనం గుమిగూడి కనిపించడంతో అక్కడ ఆగి చూశాడు. ఓ వ్యక్తి గారడీ చేస్తూ, తనకొచ్చిన విద్యలను ప్రదర్శిస్తూ..

Published : 07 Oct 2023 00:34 IST

డో తరగతి చదువుతున్నాడు గోపి. ఎప్పుడూ అబద్ధాలే చెబుతుండేవాడు. చదువుపైన అస్సలు ఆసక్తి ఉండేది కాదు. పరీక్షలంటే గజగజ వణికిపోయేవాడు. ఒక ఆదివారం ఉదయాన్నే ఇంటి నుంచి బయలుదేరాడు. కొంత దూరం వెళ్లాక.. ఒక దగ్గర జనం గుమిగూడి కనిపించడంతో అక్కడ ఆగి చూశాడు. ఓ వ్యక్తి గారడీ చేస్తూ, తనకొచ్చిన విద్యలను ప్రదర్శిస్తూ.. అందరినీ ఆకట్టుకుంటున్నాడు. అవి చూసిన వాళ్లంతా చప్పట్లు కొడుతూ ఆనందిస్తున్నారు. గోపి కూడా వాళ్ల మధ్యలోకి వెళ్లి, ఆ గారడీలను గమనించసాగాడు. అతడు తెల్ల కాగితాలను వంద, రెండొందలు, అయిదు వందల కరెన్సీ నోట్లుగా మార్చేస్తున్నాడు. ఏదో మంత్రం వేసినట్లు, వస్తువులను మాయం చేస్తున్నాడు. అవన్నీ గోపీని అవాక్కయ్యేలా చేశాయి.

ప్రదర్శన పూర్తయ్యాక, ఆ గారడీలు చేసే వ్యక్తి.. జనం దగ్గర డబ్బులు అడగసాగాడు. అలా వరసలో గోపి ముందుకు వచ్చి చేయి చాపాడు. ‘నీకు డబ్బుతో పనేంటి? ఇందాక తెల్ల కాగితాలను కరెన్సీ నోట్లుగా మార్చావు కదా.. ఆ డబ్బు చాలదా?’ అని తెలివిగా ప్రశ్నించాడు. ‘కష్టార్జితంతో బతికితేనే ఈ విద్య నిలుస్తుందని మా గురువు చెప్పారు. అందుకే ఈ సంపాదన..’ అంటూ ముందుకు వెళ్లాడతను. అప్పుడే గోపి మెదడులో తళుక్కున ఓ ఆలోచన మెరిసింది. తట్టా బుట్టా సర్దుకుంటున్న గారడీ వ్యక్తి దగ్గరకు వెళ్లి.. ‘నాకు ఈ విద్యలు నేర్పిస్తావా?’ అని అడిగాడు. అతడు గోపిని ఎగాదిగా చూస్తూ.. ‘నీది చదువుకునే వయసు.. బుద్ధిగా బడికెళ్లు’ అన్నాడు. ‘అస్సలు చదవలేకపోతున్నాను. మార్కులు రావడం లేదని అందరూ తిడుతున్నారు’ అంటూ వాపోయాడు గోపి.

‘అయితే.. ఇకనుంచైనా పట్టుదలతో చదువు. బాగా సాధన చేస్తే, సాధించలేదని ఏదీ లేదు’ చెప్పాడతను. ‘అలా కాదు కానీ..’ అంటూ నసిగాడు గోపి. ‘అయితే, నీకో మంత్రించిన పెన్ను ఇస్తాను. పరీక్షలప్పుడు అది ఉపయోగిస్తే, అన్ని ప్రశ్నలకూ అదే టకటకా సమాధానం రాసుకెళ్తుంది’ అన్నాడు. ఆ మాటలతో గోపి ముఖం ఒక్కసారిగా వెలిగిపోయింది. ‘పెన్ను ఖరీదెంత?’ అంటూ సంతోషంగా అడిగాడు. ‘డబ్బులేమీ అవసరం లేదు.. నువ్వు బాగా చదువుకుంటే చాలు..’ అన్నాడా గారడీ వ్యక్తి. సరేనన్నట్లు తలూపాడు గోపి. ‘ఆ పెన్నును పరీక్షలప్పుడు మాత్రమే ఉపయోగించాలి. ఇప్పటి నుంచి నువ్వు నిజాలే మాట్లాడాలి. అబద్ధమాడితే పెన్ను మహిమ పోతుంది’ అంటూ మెలిక పెట్టాడతను. అలాగేనంటూ ఆ పెన్నును అపురూపంగా అందుకున్నాడు గోపి.

ఆ పెన్నునే చూసుకుంటూ హుషారుగా ఇంటికి చేరుకున్నాడు. కొడుకు ఆనందం చూసిన తల్లి.. ‘ఎప్పుడూ లేనిది ఇంత సంతోషంగా ఉన్నావు. ఏంటి సంగతి?’ అని ఆశ్చర్యంగా అడిగింది. ‘నా మనసులోని కోరిక ఇప్పటికి తీరిందమ్మా’ సమాధానమిచ్చాడు గోపి. ‘ఏమిటా కోరిక?’ అంటూ ఆసక్తిగా అడిగిందామె. ‘పరీక్షల్లో మంచి మార్కులు సాధించి, మీ అందరితో శెభాష్‌ అనిపించుకోవాలని..’ పెన్నును తన పుస్తకాల సంచిలో పెడుతూ అన్నాడు గోపి. ‘నీలో మార్పు నాకు ఆనందాన్నిస్తుంది. ఇంతకీ స్కూల్‌లో ఇచ్చిన హోంవర్క్‌ చేసేశావా?’ అని అడిగిందామె. ఎప్పటిలాగే చేసేశానని అబద్ధం చెప్పాలనుకున్నాడు కానీ, అబద్ధాలు చెబితే పెన్ను మహిమ పోతుందని గారడీ వ్యక్తి చెప్పిన మాటలు గుర్తొచ్చాయి. దాంతో ‘హోంవర్క్‌ ఉందమ్మా.. ఇప్పుడు చేసుకుంటాను’ అని జవాబిచ్చాడు. ‘మా మంచి గోపి’ అంటూ తల్లి దగ్గరికి తీసుకుంది.

మరింత ఉత్సాహంతో బ్యాగులోంచి పుస్తకాలు బయటకు తీశాడు. హోంవర్క్‌ మొదలుపెట్టాడు. మొదట్లో కాస్త కష్టమనిపించింది. కొద్దిసేపు గడిచాక.. చకచకా వేగం పెరిగింది. త్వరగానే పని పూర్తి చేశాడు. తర్వాత అన్నం తినేసి ఎంచక్కా నిద్రపోయాడు. మరుసటి రోజు పాఠశాలకు వెళ్లాడు గోపి. హోంవర్క్‌ను ఉపాధ్యాయులకు చూపించాడు. అందరూ మెచ్చుకున్నారు. హోంవర్క్‌ చేయడంతో ఆరోజు బడిలో చెప్పిన పాఠాలు గోపికి బాగా అర్థం కాసాగాయి. తన మీద తనకు నమ్మకం ఏర్పడింది. తల్లిదండ్రుల పర్యవేక్షణలో.. ఉపాధ్యాయులు ఇచ్చే హోంవర్క్‌తో సాధన మెరుగుపడింది.

ఒకరోజు పాఠశాల నుంచి ఇంటికి తిరిగి వెళ్తుండగా.. గారడీలు చేసే వ్యక్తి ప్రదర్శనలిస్తూ కనిపించాడు. గోపి పరుగెత్తుకుంటూ దగ్గరకు వెళ్లి, తన పాకెట్‌ మనీ నుంచి పది రూపాయలు ఇచ్చాడు. గోపిని గుర్తుపట్టిన అతడు.. ‘పెన్ను ఎలా పనిచేస్తుంది?’ అని నవ్వుతూ అడిగాడు. ఇంకా పరీక్షలు రాలేదని చెప్పాడు. ‘ఆరోజు నీలో అసంతృప్తిని చూసి, నీ మనసు మార్చేందుకే ఆ పెన్నును బహుమతిగా ఇచ్చాను. కానీ, నిజానికి అందులో ఏ మహిమా లేదు’ అని అసలు విషయం చెప్పాడతను. ‘నిజమా?’ అంటూ నోరెళ్లబెట్టాడు గోపి. ‘ఈ గారడీ ప్రదర్శన ఇచ్చే ముందు నేను బోలెడు హోంవర్క్‌ చేస్తాను. మీకు కనిపించని చోట కరెన్సీ నోట్లను అమర్చుకోవాలి. రకరకాల జిమ్మిక్కులు చేయాలి. ఇవన్నీ చేస్తేనే మీ నుంచి చప్పట్లు, డబ్బులు అందుతాయి. ఏ విద్యకైనా సాధన అవసరమన్న సత్యం గుర్తిస్తే చాలు’ అన్నాడతను. ‘సాధన గొప్పతనం తెలిసింది. అబద్ధం ఆడొద్దని పెట్టిన మెలిక నన్ను మార్చింది’ అంటూ గారడీ వ్యక్తికి కృతజ్ఞతలు చెప్పాడు గోపి.

బి.వి.పట్నాయక్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని