చిట్కాలతో మతిమరపు హుష్‌..!

సూరయ్యకు మతిమరపు ఎక్కువ. దొందూ దొందే అన్నట్టు అతని భార్య కూడా మతిమరపునకు చిరునామాగా మారింది. ఇద్దరి మతిమరపు కారణంగా ఏ వస్తువు ఎక్కడ ఉంచిందీ గుర్తు రాక ఉక్కిరిబిక్కిరి అవుతుండేవారు. వాటికోసం ఇల్లంతా వెతికేవారు.

Updated : 21 Oct 2023 05:08 IST

సూరయ్యకు మతిమరపు ఎక్కువ. దొందూ దొందే అన్నట్టు అతని భార్య కూడా మతిమరపునకు చిరునామాగా మారింది. ఇద్దరి మతిమరపు కారణంగా ఏ వస్తువు ఎక్కడ ఉంచిందీ గుర్తు రాక ఉక్కిరిబిక్కిరి అవుతుండేవారు. వాటికోసం ఇల్లంతా వెతికేవారు. చివరకు విసిగిపోయిన సూరయ్య.. మతిమరపు తగ్గేందుకు ఏదైనా మందు ఉంటే తెలియజేయమని పట్టణంలో ఉండే మిత్రుడు రామయ్యకి ఉత్తరం రాశాడు. వారం రోజులు గడిచాక, సూరయ్యకు ఆ మిత్రుని దగ్గర నుంచి తిరుగు ఉత్తరం వచ్చింది.

‘మిత్రమా.. నీ మతిమరపు ఏ స్థాయిలో ఉందో ఉత్తరం చదివాక తెలిసింది. దానికి సరిపడా స్టాంపులు అతికించకపోవడమే అందుకు నిదర్శనం. ఆ ఉత్తరాన్ని అందజేస్తూ పోస్టుమ్యాన్‌ అపరాధ రుసుం కింద నా దగ్గర డబ్బులు వసూలు చేశాడు. మతిమరపునకు మందు లేదు. చిన్న చిన్న చిట్కాలు పాటిస్తూ.. జ్ఞాపకశక్తి పెంచుకోవడమే ఉత్తమ పద్ధతి. తొందరలోనే మతిమరపును అధిగమిస్తావని ఆశిస్తున్నాను. ఇట్లు.. నీ మిత్రుడు రామయ్య..’ అని రాశాడతను.

తన వల్ల మిత్రుడికి కలిగిన అసౌకర్యాన్ని భార్యతో చెప్పి బాధపడ్డాడు సూరయ్య. ప్రతిరోజూ కనబడేలా ఆ ఉత్తరాన్ని తన పడక గదిలోని ఓ గోడకు తగిలించాడు. ఆ ఉత్తరం చూసినప్పుడల్లా మిత్రుడు రామయ్య గుర్తుకు వచ్చేవాడు. అలా రావడంతో తనలో జ్ఞాపకశక్తి పెరిగిందని భార్యతో చెప్పాడు సూరయ్య. ‘నిత్యం మననం చేసుకుంటే మతిమరపును అధిగమించవచ్చని మనకో దారి దొరికింది’ అంటూ ఆమె కూడా తన సంతోషాన్ని వ్యక్తం చేసింది.

కొద్దిరోజులు గడిచాక ఆ దంపతులు తీర్థయాత్రలకు వెళ్లాలనుకున్నారు. పూర్వీకుల నుంచి వచ్చిన వెండి నాణేల మూటను ఎక్కడ దాచిపెట్టాలో తెలియక మల్లగుల్లాలు పడసాగారు. ఒకవేళ ఇంట్లో దొంగలు పడినా, వాళ్లకు కనిపించకుండా ఉంచాలనుకున్నారు. మతిమరపు వల్ల ఏం చేయాలో వారికి తోచలేదు. చివరకు మిత్రుడు రాసిన ఉత్తరం దగ్గరకు వెళ్లి, దాన్నే ఒకటికి రెండుసార్లు చదివాడు సూరయ్య. ఇంతలో తళుక్కున అతడికో ఆలోచన వచ్చింది. వెంటనే ఓ పెన్ను తీసుకొని వేలాడుతున్న ఉత్తరం పైన ఒక ఇంటిబొమ్మ గీశాడు. అందులో ఉత్తరం, వందనం, వరలక్ష్మి, గోదావరి, దిగుడు బావి అనే పదాలు రాశాడు. ‘ఈ ఉత్తరంలో వరహాల రహస్యం ఉంది. తీర్థయాత్రల నుంచి తిరిగొచ్చాక, ఈ ఉత్తరం సంగతి గుర్తుచెయ్యి’ అంటూ భార్యకు చెప్పాడు. ఆమె సరేనంది.

ఇద్దరూ కలిసి బీరువా ఉన్న గదిలోకి వెళ్లారు. అందులోని వరహాల సంచిని బయటకు తీసి.. అనుకున్న ప్రకారం దాచారు. అప్పుడు దంపతులిద్దరూ నిశ్చింతగా తీర్థయాత్రలకు బయలుదేరారు. వివిధ ప్రదేశాలు చూసి, దాదాపు మూడు నెలల తర్వాత ఇంటికి చేరుకున్నారు. ఉత్తరాన్ని చూసిన వెంటనే.. ఆ ఉత్తరాన్ని భర్త ఎందుకో గుర్తుంచుకోమన్న విషయం భార్యకు గుర్తుకు వచ్చింది. కానీ, ఎందుకా.. అని ఆలోచించసాగింది. కారణమేంటో ఎంతకూ జ్ఞప్తికి రాకపోవడంతో వెంటనే భర్తను పిలిచి.. ‘ఈ ఉత్తరం గురించి మీరు ఏదో చెప్పారు. కానీ, ఇప్పుడు గుర్తుకు రావడం లేదు’ అంది.

ఆ ఉత్తరం వైపు పరిశీలనగా చూశాడు సూరయ్య. అందులో కనిపిస్తున్న ఇంటి బొమ్మలోని అయిదు పదాలను చదివాడు. వెంటనే అతడి ముఖంలో ఆనందం కనిపించింది. కొద్దిక్షణాల తర్వాత నిదానంగా ఇంటి బొమ్మను చూపిస్తూ ‘ఇదేంటి?’ అని భార్యను అడిగాడు. ‘ఇల్లు బొమ్మ’ అని టక్కున జవాబిచ్చిందామె. ‘ఇది మన ఇల్లు’ అంటూ నవ్వాడు. ఆ తరువాత అందులో రాసి ఉన్న పదాలను చదవమన్నాడు. మొదటి పదం ‘ఉత్తరం’ అంది భార్య. ‘అంటే.. ఇంటికి ఉత్తర దిక్కు అన్నమాట’ అన్నాడు సూరయ్య. రెండో పదం ‘వందనం’ అని భార్య అనగానే.. ‘అందులో వంద అనే సంఖ్య ఉంది’ అన్నాడు భర్త. మూడో పదం ‘వరలక్ష్మి’ అందామె. ‘అది వరహాలు గుర్తు చేసే సిరి’ చెప్పాడతను. నాలుగో పదం ‘గోదావరి’ అంది భార్య. ‘గోదావరిలో వరి ఉంది. అంటే.. వరి గడ్డి’ అన్నాడు సూరయ్య. అయిదో పదం ‘దిగుడు బావి’ అని ఆమె అనడంతో ‘దిగువ భాగం అన్నమాట’ చెప్పాడు భర్త.

‘ఇప్పుడర్థమైంది.. ఇంటికి ఉత్తర భాగంలోని గడ్డివాము కింద వంద వరహాలు ఉన్నాయని..’ అంది భార్య. ఇద్దరూ కలిసి పరుగున ఇంటి బయటకు చేరుకున్నారు. ఉత్తర దిశగా వెళ్లి, అక్కడున్న గడ్డివామును పరిశీలనగా చూశారు. గునపం, పార తీసుకొని.. దాని కింద తవ్వి చూడగా.. వరహాల మూట కనిపించింది. లెక్కకు కూడా వంద సరిపోయాయి. భర్త మతిమరపును అధిగమించిన తీరును చూసి భార్య ఆశ్చర్యపోయింది. అప్పటి నుంచి ఇద్దరూ ఇలాంటి చిన్న చిన్న చిట్కాలు పాటిస్తూ మతిమరపు నుంచి బయటపడ్డారు.

బి.వి.పట్నాయక్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని