నొప్పింపక.. తానొవ్వక..!

అనగనగా ఒక అడవి. అందులో నివసించే ఓ కోతి.. ఆహార సంపాదన కోసం తన పిల్లతో కలిసి బయలుదేరింది.

Updated : 31 Oct 2023 05:29 IST

నగనగా ఒక అడవి. అందులో నివసించే ఓ కోతి.. ఆహార సంపాదన కోసం తన పిల్లతో కలిసి బయలుదేరింది. కొంతదూరం వెళ్లాక ఓ నక్క పరుగు పరుగున రావడం కోతి పిల్ల గమనించింది. ‘అమ్మో.. నక్క ఇటువైపే వస్తుంది’ అంటూ భయపడుతూ చెప్పింది. ‘నేనిక్కడే ఉన్నాను కదా.. భయపడకు..’ అంటూ ధైర్యం చెప్పిన తల్లి కోతి, నక్కను తప్పించుకొని పక్కకు వెళ్లబోయింది. నక్క మాత్రం ఎదురుగా వచ్చి ‘కోతి అత్తా.. ఆ దరిద్రపుగొట్టు ఎలుగుబంటి ఇటు వస్తుంది. దాని పిల్ల మంచి కోరి నేనో సలహా ఇస్తే, నాపైనే దాడికి దిగిందది’ అంటూ తిట్లదండకం అందుకుంది. ‘సలహా ఇచ్చినప్పుడు నచ్చితే పాటించాలి.. లేకపోతే వదిలేయాలి కానీ ఇలా దాడి చేయడం సరికాదు’ అంది తల్లి కోతి.

ఆ మాటలు నక్క చెవికి ఇంపుగా వినిపించడంతో ‘బంగారంలాంటి మాట అన్నావు. ఆపాటి జ్ఞానం కూడా ఆ ఎలుగుబంటికి లేదు’ అని తల్లి కోతిని మెచ్చుకుంటూ వెళ్లిపోయింది. ‘నక్క ఏదో చేస్తుందని భయపడ్డాను. హమ్మయ్యా.. ఏమీ చేయలేదు’ సంతోషంగా చెప్పిందా పిల్ల కోతి. ‘నోరుమంచిదైతే ఊరు మంచిదవుతుంది’ అని పెద్దలు ఊరికే అనలేదంటూ ముందుకు నడిచింది తల్లి. ఇంతలో ఎలుగు, దాని పిల్ల ఎదురయ్యాయి. ‘ఆ నంగనాచి నక్క ఇటువైపు వచ్చిందా?’ అని తల్లి కోతిని అడిగింది ఎలుగుబంటి. ‘ఇప్పుడే ఇలా వచ్చాం. నక్క ఏమైనా చేసిందా?’ అడిగింది తల్లి కోతి. ‘నా పిల్ల ఎలా ఉంటే దానికి ఎందుకు? దిబ్బ రొట్టెలా ఉంది.. వ్యాయామం చేయించు. లేకపోతే చచ్చిపోగలదంటూ సలహా ఇస్తుందా?’ అని అగ్గి మీద గుగ్గిలం అయ్యిందది.

‘ఇంత ముద్దొచ్చే పిల్లని నక్క అలా అనడం బాగోలేదు. ఇలాంటి పిల్లలు ఈత నేర్చుకుంటే ఇంకా బాగుంటుంది. నీ పిల్లకు ఈత నేర్పించి ఆ ముచ్చట తీర్చుకోవచ్చు కదా..’ అంటూ ఎలుగుకు సలహా ఇచ్చింది తల్లి కోతి. ఆ మాటలు దానికి నచ్చడంతో ‘నేర్చుకున్న విద్య ఎప్పటికీ వృథాగా పోదు. నువ్వు బంగారంలాంటి సలహా ఇచ్చావు. ఈత నేర్పించి అందరితో శెభాష్‌ అనిపిస్తాను’ అంటూ పిల్లను కొలను వైపు తీసుకెళ్లింది తల్లి ఎలుగు. ‘అంత బరువు ఉన్న పిల్ల ఎలుగుకు వ్యాయామం అవసరం. నక్క చెప్పింది అదే.. కానీ, దాన్ని తిడుతూ.. ఈత నేర్చుకోమని సలహా ఇచ్చిన నిన్నేమో పొగిడిందేంటి?’ అని తల్లిని అడిగింది పిల్ల కోతి.

‘మాట మధురంగా ఉండాలి గానీ, కోపమొచ్చేలా కాదు. శరీర బరువు పెరుగుతున్న కొద్దీ ప్రాణాలకు ప్రమాదమన్న మాట నిజం. కానీ, సలహా ఇచ్చినప్పుడు మనం వాడే పదాల ఎంపిక సరిగ్గా ఉండాలి. అదీకాకుండా.. వ్యాయామం చేయమంటే తన బిడ్డను ఎగతాళి చేసినట్లు తల్లి ఎలుగుబంటి అనుకొని ఉంటుంది. వ్యాయామాలన్నింటిలోనూ ఈతకు ప్రత్యేక స్థానం ఉంది. అది బరువును నియంత్రణలో ఉంచి, చలాకీతనాన్ని పెంచుతుంది. నేను వ్యాయామం అనే విషయం ప్రస్తావించకుండా ఇచ్చిన సలహా అది’ అంటూ వివరించింది తల్లి కోతి.
కొద్దిరోజులు గడిచాక.. పిల్లతో కలిసి తల్లి ఎలుగుబంటి హుషారుగా నడుచుకుంటూ వస్తుంది. వాటికి తోడేలు ఎదురైంది. ‘ఎలుగు అత్తా.. ఇంతకు ముందు గుమ్మడికాయలా ఉండే నీ పిల్ల, ఇప్పుడు పొట్లకాయలా అయిందేంటి? ఏమైనా జబ్బు చేసిందా?’ అని అడిగింది. తల్లికి కోపం ముంచుకొచ్చింది. ‘జబ్బు, గిబ్బు అంటున్నావు. తిక్కతిక్కగా ఉందా?’ అంటూ కసురుకుంది. అప్పుడే అటువైపు వచ్చిన తల్లి, పిల్ల కోతిని ఆపింది తోడేలు. ‘కోతి పిన్నీ.. నువ్వే చెప్పు.. ఉన్న మాటంటే ఎలుగుబంటికి అంత ఉలుకెందుకో?’ అంటూ అక్కడి నుంచి వెళ్లిపోయింది.

విషయం తెలియక అయోమయంగా చూసింది తల్లి కోతి. తోడేలు వెటకారపు మాటలు చెప్పి బాధ పడింది తల్లి ఎలుగు. ‘తోడేలు మాటలు పట్టించుకోకు. నిజానికి ఒకప్పటి మీద ఇప్పుడు నీ పిల్ల పొడుగైంది’ అంది తల్లి కోతి. ఆ మాటలకు తల్లి ఎలుగు సంతృప్తి చెందింది. ‘అంతా నీ చలవే.. నువ్వు చెప్పినట్టు నా పిల్లకు ఈత నేర్పించాను. శరీర బరువు తగ్గింది. చలాకీతనం పెరిగింది’ అంటూ తల్లి కోతికి కృతజ్ఞతలు చెబుతూ తన దగ్గరున్న అరటిపండ్లు ఇచ్చింది.

ఎంచక్కా ఆ అరటి పండ్లు తింటూ ముందుకు అడుగులు వేశాయవి. దారిలో నడుస్తూ.. ‘నొప్పింపక, తానొవ్వక మాట్లాడడమే లౌక్యమని అర్థమైంది. లౌక్యం తెలిసినవారికి శత్రువులుండరన్న సత్యం రుజువైంది’ అంటూ తాను నేర్చుకున్న పాఠాన్ని తల్లికి అప్పజెప్పింది పిల్ల కోతి.

 బి.వి.పట్నాయక్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని