చేసిన సాయం.. ఆపద మాయం!

ఒక చెట్టు పైన రామచిలుక ఉండేది. అది పరోపకారి.  సంపాదించుకున్న పండ్లను మిగతా పక్షులకు, వాటి పిల్లలకు పంచుతుండేది. దానికో చిట్టి చిలుక ఉండేది. ఒకసారి తల్లి చిలుకకు జబ్బు చేసింది.

Updated : 01 Nov 2023 04:36 IST

ఒక చెట్టు పైన రామచిలుక ఉండేది. అది పరోపకారి.  సంపాదించుకున్న పండ్లను మిగతా పక్షులకు, వాటి పిల్లలకు పంచుతుండేది. దానికో చిట్టి చిలుక ఉండేది. ఒకసారి తల్లి చిలుకకు జబ్బు చేసింది. అది ఆహారం కోసం ఎక్కడికీ వెళ్లలేకపోయింది. చిట్టి చిలుకకు ఆకలి కావడంతో తల్లి దగ్గరకు వెళ్లి చెప్పింది. అప్పుడా తల్లి, పక్క గూటికెళ్లి.. తినడానికి ఏదైనా ఉంటే పెట్టమని అందులో నివాసం ఉండే పావురాన్ని అడిగింది. ‘అయ్యో మిత్రమా.. నేను, నా పిల్లలు ఇంతకుముందే ఉన్నదంతా తినేశాం. కాస్త ముందు అయితే ఇచ్చేదాన్ని’ అని బదులిచ్చింది.

ఉసూరుమంటూ కాకి వద్దకు వెళ్లిందా తల్లి చిలుక. దాన్నుంచి కూడా అదే సమాధానం వచ్చింది. ‘నాకు బయటికెళ్లి ఆహారం తీసుకొచ్చే ఓపిక ఉంది కానీ, జోరుగా వర్షం పడుతోంది. ఈ వానలో నేను వెళ్లలేను’ అని అప్పుడే అక్కడికి వచ్చిన పిచ్చుక అంది. ఇక తల్లి చిలుకకూ ఓపిక నశించడంతో నిరాశగా గూటికి చేరింది. కాసేపటికి వర్షం తగ్గడం చూసి, ఆ చిట్టి చిలుకే స్వయంగా ఆహారం కోసం బయలుదేరింది. కొంతదూరంలో కనిపించిన ఓ పండ్ల తోటలోకి ప్రవేశించింది. దొరికిన పండ్లను కోసుకొని, గూటికి చేరింది. అప్పుడు తల్లి ‘ఈ పండ్లు ఎక్కడివి?’ అని ప్రశ్నించింది. జొన్నలకొండ వద్దనున్న తోట నుంచి తీసుకొచ్చానని చెప్పిందది.
తల్లి కోపంగా ‘అయ్యో.. అది చాలా ప్రమాదకరమైన చోటు. మన పక్షులేవీ అక్కడికి వెళ్లవు. కోరి ఆపదను కొనితెచ్చుకోవద్దు’ అని హెచ్చరించింది. కానీ, చిట్టి చిలుక ఆ మాటలను పట్టించుకోలేదు. మరుసటి రోజు కూడా అదే తోటలోకి వెళ్లి, పండ్లను కోసుకొచ్చి తల్లికి ఇచ్చింది. తల్లి మళ్లీ కోప్పడినా, ఆ మాటలను చిట్టి చిలుక వినిపించుకోలేదు.
తర్వాతి రోజు కూడా అదే తోటలోకి ప్రవేశించింది. కింద పడిన పండ్లను తినబోయి.. వేటగాడు పన్నిన వలలో చిక్కుకుంది. చీకటి పడుతున్నా బిడ్డ ఇంటికి రాకపోయేసరికి తల్లి చిలుక ఆందోళన పడసాగింది. వలలో చిక్కుకున్న చిట్టి చిలుక ‘అయ్యో.. మా అమ్మ చెప్పిన మాటను వినకపోవడం వల్లే నాకీ సమస్య.. ఇప్పుడా వేటగాడు వచ్చి నన్ను ఏం చేస్తాడో ఏంటో..!’ అని భయపడసాగింది.

ఇంతలో అక్కడికి ఒక వ్యక్తి వచ్చాడు. కొన్ని ఎండు పుల్లలను ఏరి, కుప్పగా పేర్చి నిప్పు పెట్టాడు. ఆ చిట్టి చిలుక భయపడి ‘అమ్మో .. ఇతడే వేటగాడు కావచ్చు..నన్ను ఆ మంటలో వేస్తాడు కాబోలు.. బాబోయ్‌ దేవుడా.. నన్ను కాపాడు. అమ్మా.. అమ్మా!’ అని గట్టిగా అరవసాగిందది. ఇంతలో అతడు కొన్ని మొక్కజొన్న పొత్తులను తీసుకొచ్చి ఆ నిప్పు మీద కాల్చసాగాడు. ‘హమ్మయ్యా!’ అని ఊపిరి పీల్చుకుందది. ఇంతలో ఒక గోరింక అక్కడికి వచ్చి వలలో చిక్కిన చిట్టి చిలుకను చూసింది. అక్కడే చెట్టు తొర్రలో ఉండే తన నేస్తం ఉడుతను పిలిచి ‘ఓ ఉడుతా.. ఈ చిట్టి చిలుక ఎవరనుకున్నావు? నీకు రోజూ పండ్లను ఇచ్చే రామచిలుక బిడ్డే. తెలిసో తెలియకో ఇటువైపు వచ్చి వేటగాళ్ల వలలో చిక్కుకుపోయింది. మనం ఎలాగైనా దీన్ని రక్షించాలి’ అంది.

ఇంతలో ఒక కోతి అక్కడికి వచ్చింది. అప్పుడా ఉడుత..చిట్టి చిలుకను వల నుంచి తప్పించమని దాన్ని కోరింది. తనవల్ల కాదని వెళ్లిపోయింది కోతి. అప్పుడు ఉడుత ‘మిత్రమా.. నువ్వేం భయపడకు.. ఈ దగ్గరలోని మర్రిచెట్టు కన్నంలోనే నా నేస్తమైన ఎలుక ఉంటుంది. అది ఈ వల తాళ్లను కొరికేయగలదు. నేను వెళ్లి దాన్ని తీసుకొస్తా’ అంటూ చెంగుచెంగున వెళ్లింది. ఇంతలో అక్కడికి వచ్చిన తల్లి రామచిలుక.. విషయం తెలుసుకుంది.‘ఈ తోటవైపు వెళ్లవద్దని నేను ఎంతచెప్పినా వినలేదు. ఇప్పుడు దానికే స్వీయ అనుభవమైంది. అందుకే మన మేలు కోరే వారు చెప్పే మాటలను వినాలంటారు. లేకపోతే ఇలాంటి ఆపదలే వస్తాయి’ అంది.  

ఇంతలో గోరింక ‘అదిగో.. ఎవరో వ్యక్తి ఇటువైపే వస్తున్నాడు. నాకు తెలిసి వేటగాడే అనుకుంటా. అయ్యో.. ఇప్పుడెలా?’ అంది ఆందోళనగా. ఇంతలో అక్కడికి ఎలుకను తీసుకొచ్చింది ఉడుత. ‘మిత్రమా.. క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఈ వలను కొరికెయ్యి’ అంది. ‘మిత్రమా.. క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఈ వలను కొరికెయ్యి’ అంది. వెంటనే ఎలుక తన పదునైన దంతాలతో వలను ముక్కలు ముక్కలుగా చేసింది. ఎలాగోలా బయటపడిన చిట్టి చిలుక, తల్లితో కలిసి.. వాటిన్నింటికీ ధన్యవాదాలు తెలిపింది. వేటగాడు సమీపిస్తుండటంతో పక్షులన్నీ అక్కడి నుంచి తుర్రుమని ఎగిరిపోయాయి. ఉడుత, ఎలుక కూడా చెట్టు తొర్రలోకి చేరిపోయాయి. చేసిన సాయం ఎప్పటికైనా, ఏదో ఒక రూపంలో మనకు తిరిగొస్తుందనుకుంది తల్లి చిలుక.  
సంగనభట్ల చిన్న రామకిష్టయ్య


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని