చిన్ని పక్షులు.. తల్లి కాకులు!

అనగనగా ఒక పెద్ద మర్రిచెట్టు. అది ఊరికి చాలా దూరంగా ఉంది. కాకులు గూళ్లు కట్టుకుని దాన్ని నివాసంగా చేసుకున్నాయి. ‘కావ్‌.. కావ్‌’ అరుపులతో ఆ ప్రాంతమంతా ప్రతిధ్వనించేది. ఆ చెట్టుపై కాకులు తప్ప, వేరే పక్షులు గూడు కట్టుకునే సాహసం చేయలేదు.

Updated : 03 Nov 2023 04:34 IST

అనగనగా ఒక పెద్ద మర్రిచెట్టు. అది ఊరికి చాలా దూరంగా ఉంది. కాకులు గూళ్లు కట్టుకుని దాన్ని నివాసంగా చేసుకున్నాయి. ‘కావ్‌.. కావ్‌’ అరుపులతో ఆ ప్రాంతమంతా ప్రతిధ్వనించేది. ఆ చెట్టుపై కాకులు తప్ప, వేరే పక్షులు గూడు కట్టుకునే సాహసం చేయలేదు. ఒకటీ రెండూ ప్రయత్నించినా, కాకుల అరుపులకు భయపడి పారిపోయాయి. దాంతో వేరే పక్షులన్నీ ఆ మర్రిచెట్టును కాకుల సామ్రాజ్యంగా పిలిచేవి.

ఒకరోజు పెద్ద కాకులు ఆహారం కోసం బయటకు వెళ్లాయి. పిల్ల కాకులు ‘కావ్‌.. కావ్‌’మని అరుస్తూ సరదాగా ఆడుకోసాగాయి. ఇంతలో రెండు బుజ్జి పక్షులు ఎగురుకుంటూ వచ్చి, మర్రి చెట్టు మీద వాలాయి. వాటిని చూసిన పిల్లకాకులు భయంతో గట్టిగా అరిచాయి. దాంతో బుజ్జి పక్షులు కూడా కిచకిచమని శబ్దాలు చేశాయి. పిల్లకాకులు వాటి దగ్గరకెళ్లి ‘మీరు ఎక్కడ నుంచి వచ్చారు? మీ పేర్లేంటి?’ అని ప్రశ్నించాయి. ‘మా పేర్లు తెలియదు. ఆహారం కోసం వెళ్లిన మా అమ్మ ఇంకా తిరిగి రాలేదు. తన కోసం వెతుక్కుంటూ ఇలా వచ్చాం. ఎండ వేడి తట్టుకోలేక ఈ చెట్టు మీద వాలాం’ అని బదులిచ్చాయవి. ‘అయ్యో.. మీకు అమ్మ లేదా! చూడటానికి మాలాగే ముద్దుగా ఉన్నారు. చాలా దూరం నుంచి వచ్చినట్టున్నారు. నీరసంగా కనపడుతున్నారు. ముందు ఈ ఆహారం తినండి’ అంటూ బుజ్జి పక్షులకు పండ్లను అందించాయి పిల్ల కాకులు.

ఆహారం తిన్నాక.. బుజ్జి పక్షులు ‘మీ గొంతు చాలా బాగుంది. మీలో ఒకటి అరిస్తే మిగతావి కూడా అరుస్తున్నాయి. ఇలా అరవటం వల్ల క్షేమ సమాచారం తెలియడంతోపాటు ప్రమాదాలనూ ముందే పసిగట్టవచ్చు. మీరంతా కలిసికట్టుగా ఉన్నట్లు శత్రువులు గ్రహిస్తారు. ఆ లక్షణం మాకు నచ్చింది. మా జాతి పక్షుల్లో కూడా ఇలాగే ఉండుంటే మా అమ్మ కోసం మేమింత శ్రమ పడాల్సిన అవసరం ఉండేది కాదు’ అని వాపోయాయి. ‘మా గొంతు బాగుంటుందా? అందరూ మా అరుపు కర్ణకఠోరంగా ఉంటుందంటారు. ఏ ఇంటి మీదైనా వాలి అరిస్తే చాలు.. వారు తరిమేస్తారని మా అమ్మ చెప్పేది. మొదటిసారిగా మీ నోటి నుంచే.. మా గొంతు బాగుంటుందని వింటున్నాం. అందుకు ధన్యవాదాలు’ అని బదులిచ్చాయి పిల్లకాకులు.

ఇంతలోనే చీకటి పడసాగింది. బుజ్జి పక్షులు అక్కడి నుంచి బయలుదేరేందుకు సిద్ధమయ్యాయి. ‘మాకు ఈ చెట్టుపై సేద తీరే అవకాశం ఇచ్చి, మా ఆకలి తీర్చారు. మీకే మేం ధన్యవాదాలు చెప్పాలి’ అన్నాయవి. దానికి పిల్లకాకులు ‘ఆహారం కోసం వెళ్లిన మా తల్లులు తిరిగొచ్చే వేళైంది. ఈ సమయంలో మీరు బయటకు వెళ్తే మళ్లీ దారి తప్పొచ్చు’ అన్నాయి. అన్నట్టుగానే బయటకు వెళ్లిన తల్లి కాకులు వచ్చేశాయి. వాటిని చూడగానే పిల్లవి అరుస్తూ దగ్గరకు వెళ్లాయి. బిడ్డలను తల్లి కాకులు ముద్దు చేస్తూ.. తీసుకొచ్చిన ఆహారాన్ని వాటి నోటికి అందించాయి.
వాటిని చూసి బాధపడుతూ.. ‘పిల్లకాకులు అదృష్టవంతులు. హాయిగా అమ్మ పెట్టిన ఆహారాన్ని తింటూ, ఆనందంగా గడుపుతున్నాయి. మనకా అదృష్టం లేదు. పేర్లు కూడా తెలియకుండా జీవిస్తున్నాం. మనలాంటి పరిస్థితి మరే పక్షికీ రాకూడదు’ అని మాట్లాడుకోసాగాయి. ఆ మాటలు విన్న పిల్లకాకులు.. వాటి తల్లులకు చెప్పాయి. అవి బుజ్జి పక్షులను చూసి దగ్గరకు రమ్మన్నాయి. కానీ, భయంతో అవి వెళ్లలేదు. పిల్లకాకులు ‘కావ్‌..కావ్‌’మని అరిచి పిలిచాయి. ఆ అరుపులకు స్పందించిన బుజ్జి పక్షులు ధైర్యంగా కాకుల వద్దకు వచ్చాయి. కాకులు వాటిని పరిశీలనగా చూసి, వాటిలో అవి చర్చించుకోసాగాయి.

‘ఈ బుజ్జి పక్షులు పిచ్చుక జాతికి చెందినవి. ఒకప్పుడు ఎక్కడ చూసినా ఇవే కనపడేవి. జనావాసాల్లో ధైర్యంగా తిరిగేవి. వారి ఇళ్లలోనే గూళ్లు కూడా కట్టుకునేవి. ప్రస్తుతం పిచ్చుక జాతి అంతరించిపోతుంది. దానికి మనమూ ఓ కారణం. చిన్న జాతి కావటంతో మనం వాటిని ఆహారంగా భావించాం. మనకంటే చిన్నజాతి జీవులను ఇప్పుడు మనం చంపి తింటే.. రేపు మనల్ని కూడా మనకంటే పెద్ద జాతి పక్షులు మింగేయాలని చూస్తాయి. అప్పుడు మన గతేంటి? ఈ పిచ్చుకల పరిస్థితే రేపు మన పిల్లలకు ఎదురైతే? అన్ని రకాల జీవాలను ప్రకృతిలో బతకనివ్వాలి. ఈ బుజ్జి పక్షులకు న్యాయం చేయాలి. అవి పెద్దవై స్వేచ్ఛగా ఎగిరేంత వరకు మన సంరక్షణ అవసరం. వాటి బాధ్యత మనం తీసుకుందాం’ అని నిర్ణయించుకున్నాయా తల్లికాకులు. వెంటనే అవి బుజ్జి పిచ్చుకలను ఆప్యాయంగా దగ్గరకు తీసుకొని.. ‘ఇకనుంచి మీ బాధ్యత మాదే. మీరూ మా పిల్లలతోపాటు ఇక్కడే ఉండండి’ అన్నాయి. తల్లి కాకులు దగ్గరకు తీసుకోవటంతో ఆనందంతో పొంగిపోయాయవి.

తమ్మవరపు వెంకట సాయి సుచిత్ర


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని