తుంటరి కోణంగి!

అనగనగా ఒక అడవి. అందులో కోణంగి అనే కోతి పిల్ల ఒకటి ఉండేది. జాతి స్వభావానికి, పేరుకు తగ్గట్టుగానే అది చాలా అల్లరిది. ఒకసారి చిటారు కొమ్మన కూర్చొని సీతాఫలం తినసాగింది. అప్పుడే అటుగా వచ్చిన దుప్పిని ఆపి.. ‘అత్తా.. నీకు విషయం తెలుసా?’ అని అడిగింది.

Published : 06 Nov 2023 00:03 IST

నగనగా ఒక అడవి. అందులో కోణంగి అనే కోతి పిల్ల ఒకటి ఉండేది. జాతి స్వభావానికి, పేరుకు తగ్గట్టుగానే అది చాలా అల్లరిది. ఒకసారి చిటారు కొమ్మన కూర్చొని సీతాఫలం తినసాగింది. అప్పుడే అటుగా వచ్చిన దుప్పిని ఆపి.. ‘అత్తా.. నీకు విషయం తెలుసా?’ అని అడిగింది. దాని సంగతి తెలిసినా, అది మాట్లాడిన తీరు చూసి.. ‘ఏంటది?’ అంది. ‘ఇంకా ఏమిటనే దగ్గరే ఉన్నావా? ఓ భారీ జంతువు మన అడవిలోకి ప్రవేశించింది. రెండు పెద్ద కొమ్ములు, బారెడు నోటితో కనిపించిన వాటన్నింటినీ తినేసేలా ఉందది. ఎందుకైనా మంచిది.. కాస్త జాగ్రత్తగా ఉండు’ అని ఉచిత సలహా ఇచ్చింది. దాని మాటలకు దుప్పి కాస్త భయపడింది. వెంటనే మిగిలిన జంతువులకు విషయం చెప్పింది.

‘ఉదయం నుంచి అడవిలోనే తిరుగుతున్నా.. నాకు అటువంటి జంతువేదీ కనిపించలేదు. అయినా ఈ విషయం నీకెవరు చెప్పారు?’ అని ఏనుగు ప్రశ్నించింది. కోణంగి పేరు చెప్పింది దుప్పి. ‘దానికి బుద్ధి లేదు. నీకు తెలివి అంతకంటే లేదు. ఖాళీగా తిని కూర్చుని అది చెప్పే మాటలు నమ్మి, మమల్ని అందరినీ ఆందోళనకు గురిచేశావు’ అని జంతువులన్నీ తిట్టాయి. ఇక దాని మాటలు నమ్మకూడదని దుప్పి గట్టిగా అనుకుంది.

ఇంకోరోజు అటుగా వెళ్తున్న కుందేలుని చూసి.. ‘అన్నా.. ఇక్కడెక్కడో నా కంకణం పడిపోయింది. కాస్త వెతికి పెట్టవా? అది చాలా మహిమగలది. అది పెట్టుకుంటే తిండికి లోటుండదు. ఎక్కడ పారేసుకున్నానో ఏమిటో.. నువ్వు ఇంతకు ముందు చూశావు కూడా..’ అంది కోణంగి. ఆ కంకణాన్ని ఎప్పుడూ చూడకపోయినా, అది ఉంటే తిండికి లోటుండదనే మాట కుందేలుకు బాగా నచ్చింది. దాంతో అది వెతకడం మొదలుపెట్టింది. దాన్ని చూసి.. అటుగా వచ్చిన ఏనుగు గున్న, ఉడుత, నక్క కూడా వెతకసాగాయి. ఎగురుకుంటూ రివ్వున వచ్చిన కాకి.. ‘అందరూ దేని గురించో వెతుకుతున్నట్టుంది?’ అని ఆత్రుతగా అడిగింది. ఆ తర్వాత విషయం తెలుసుకున్న కాకి ‘మీకు ఏమైనా మతి పోయిందా? కోణంగికి కంకణం ఏంటి? దానికి మహిమలు ఉండటం ఏంటి? అసలు దానికి కంకణం ఎక్కడి నుంచి వచ్చింది?’ అంది. ఆ  మాటలు విని నవ్వింది కోణంగి. ‘అంటే.. కంకణం మాట అబద్ధమన్నమాట’ అంటూ జంతువులన్నీ దాన్ని తిట్టుకుంటూ వెళ్లిపోయాయి. అప్పుడే అక్కడికి వచ్చిన లేడి ‘చూడు కోణంగి.. జంతువులన్నింటినీ ఇలా ఇబ్బంది పెట్టడం సరికాదు. అంతగా కావాలంటే వాటికి ఏదైనా సహాయం చేసి చూడు. అప్పుడు వచ్చే సంతోషం వెలకట్టలేనిది. అంతేకానీ.. ఇలా అల్లరి పనులు చేస్తే నీతో మాట్లాడటానికి, స్నేహం చేయడానికి ఏదీ ఇష్టపడదు. ఎప్పటికీ ఒంటరిగా జీవించాల్సి వస్తుంది’ అని హెచ్చరించింది. ఆ మాటలు విన్న కోణంగి.. ఆలోచనలో పడింది. అప్పటివరకూ తాను చేసిన తప్పేంటో తెలుసుకుంది. అల్లరి పనులు చేయడం మానుకోవాలని నిర్ణయించుకుంది.

ఒకరోజు ఉదయాన్నే జామకాయ తింటూ చెట్టు మీద కూర్చుంది కోణంగి. అప్పుడే పక్క చెట్టు మీదున్న కాకి గూడు దగ్గరకు పాము వెళ్లడాన్ని గమనించింది. తల్లి కాకేమో ఆహారం కోసం బయటకు వెళ్లింది. గూడులో పిల్ల కాకులు మాత్రమే ఉన్నాయి. వాటిని ఎలాగైనా రక్షించాలనుకున్న కోణంగి ‘నాగరాజా.. ఎక్కడికి వెళ్తున్నావు.. ఆ గూటిలో ఉండే పెద్ద కాకి ఎవరో కాదు.. ఈ అడవిలో ఉన్న పెద్ద ముంగిసకు స్నేహితురాలు. నువ్వు ఇక్కడకి వచ్చావని తెలిసినా చాలు.. ఆ ముంగిస నిన్ను ముక్కలు ముక్కలుగా చేసేస్తుంది’ అని భయపెట్టింది. ఆ మాటలకు ఉలిక్కిపడిన పాముకు.. అప్పుడే దూరంగా ఒక ముంగిస కనిపించడంతో వచ్చిన దారినే పారిపోయింది.

సాయంత్రం తల్లి కాకి గూటికి రాగానే విషయం మొత్తం వివరించింది కోణంగి. తన పిల్లల్ని కాపాడిన కోతికి కృతజ్ఞతలు తెలిపింది. మొదటిసారిగా మెప్పు లభించడంతో దానికి చాలా సంతోషం వేసింది. ఇంకోరోజు కొందరు వేటగాళ్లు అడవిలోకి రావడాన్ని కోణంగి చూసింది. పరుగున వెళ్లి దుప్పి, ఏనుగుకు విషయం చెప్పింది. కానీ, అవి దాని మాటలు నమ్మలేదు. ఇక లాభం లేదనుకొని, మృగరాజు వద్దకే వెళ్లింది. కోతి పిల్ల వచ్చిన తీరు, దాని కళ్లలో భయం చూసి.. అది చెప్పిన వైపుగా వెళ్లిన మృగరాజు గట్టిగా గర్జించింది. ఆ శబ్దం విని వేటగాళ్లు భయంతో పారిపోయారు. సింహం చెప్పడంతో అసలు విషయం తెలుసుకున్న అడవి జంతువులన్నీ కోణంగిని అభినందించాయి.

కూచిమంచి నాగేంద్ర


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని