గొప్పలు తెచ్చిన తిప్పలు!

రామయ్య వ్యవసాయం చేస్తుంటాడు. ధాన్యం మూటలు మోయడానికి సంత నుంచి ఓ గాడిదను తీసుకొచ్చాడు. ఒకరోజు దాన్ని ఇంటి ముందున్న పాకలో కట్టేశాడు. కానీ, అది తాడు తెంచుకొని పారిపోయింది.

Updated : 14 Nov 2023 05:02 IST

రామయ్య వ్యవసాయం చేస్తుంటాడు. ధాన్యం మూటలు మోయడానికి సంత నుంచి ఓ గాడిదను తీసుకొచ్చాడు. ఒకరోజు దాన్ని ఇంటి ముందున్న పాకలో కట్టేశాడు. కానీ, అది తాడు తెంచుకొని పారిపోయింది. అలా ఊరి చివరకు వెళ్లి అక్కడున్న మైదానంలో ఎంచక్కా గడ్డి మేయసాగింది. కాసేపటి తర్వాత ఏదో అలజడి కావడంతో యజమాని వస్తున్నాడేమోనని చుట్టూ చూడసాగింది. అప్పుడు కొంత దూరంలో గడ్డి మేస్తున్న మరో జంతువు కనిపించింది. అది చూడటానికి కొంచెం దానిలాగే ఉండటంతో ఆశ్చర్యపోయింది. ‘నేనెప్పుడూ దీన్ని చూడలేదే.. అసలు పేరేంటి?’ అని ఆలోచించసాగింది. ఎంత ఆలోచించినా అది ఏ జంతువో గాడిదకు తెలియలేదు.

ఇక లాభం లేదనుకొని.. నేరుగా దాని వద్దకే వెళ్లింది. పరిశీలనగా చూస్తూ.. ‘ఎవరు నువ్వు? ఇక్కడ ఇలా ఒంటరిగా గడ్డి మేస్తున్నావు. నీకు భయంగా లేదా?’ అని ప్రశ్నించింది. ‘నాకెందుకు భయం. నేను రాజు గారి పట్టపు గుర్రాన్ని. ఆయన ఎక్కడికి వెళ్లాలన్నా నేనే తీసుకెళ్తాను. అందుకే భటులంతా నన్ను జాగ్రత్తగా చూసుకుంటారు. మహారాజు ఎప్పుడైనా యుద్ధం చేయాల్సి వస్తే.. అందులో నేను కూడా కీలకంగా వ్యవహరిస్తా. రాజును గెలిపించడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తాను. కాబట్టి నన్ను ఎవరూ ఏమీ అనలేరు’ అని బదులిచ్చిందా గుర్రం. ‘ఇంతకీ నీ పేరేంటి?’ అని అడిగింది గాడిద. ‘నన్ను గుర్రం అంటారు. కొందరు అశ్వం అని కూడా పిలుస్తుంటారు’ బదులిచ్చి, ‘మరి నీ వివరాలేంటి?’ అని ప్రశ్నించింది.

‘ఇది వివరాలు అడుగుతుందంటే, అసలు నా గురించి ఏమీ తెలిసుండదు. నేను గాడిదనని చెబితే పరువు పోతుంది. తక్కువ చేసి చూస్తుంది. అందుకే నేను చాలా గొప్పదాన్ననే చెబుతాను. అబద్ధమని దానికి తెలిసే అవకాశం లేదు’ అని మనసులోనే అనుకోసాగిందా గాడిద. ఇంతలోనే ‘ఏమైంది మౌనంగా ఉన్నావు?’ అంది గుర్రం. అదేం లేదంటూ.. ‘నేను ఆ కనబడుతున్న కొండ గుహలో నివసిస్తాను. ఆ ప్రాంతంలోని సింహాలు, పులులను చంపి తింటుంటాను. వాటిని వేటాడి వేటాడి నా దంతాలు వాడి కోల్పోయాయి. అందుకే వాటికి పదును పెట్టడానికి గడ్డి పరకలు తింటున్నా. నా అరుపులు వింటే అడవి జంతువులన్నీ భయపడి పారిపోతాయి. ఒక విధంగా చెప్పాలంటే సింహాన్ని మించిన జీవిని నేను. నన్ను గార్దభమని పిలుస్తారు’ అంటూ గొప్పలు చెప్పుకొంది.

అది లేని గొప్పలు చెబుతుందని అర్థం చేసుకున్న గుర్రం వెటకారంగా నవ్వింది. అది చూసిన గాడిద ‘నువ్వు నా మాటలు నమ్మడం లేదు కదా.. నేను నీకంటే పెద్దగా అరవగలను. చూడు కావాలంటే.. అప్పుడైనా నేనంటే ఏంటో తెలుస్తుంది’ అంటూ పెద్దగా ఓండ్ర పెట్టింది. అప్పుడే గాడిద కోసం వెతుక్కుంటూ అటుగా వచ్చిన రామయ్య, ఆ అరుపులు విని దాని వద్దకు వెళ్లాడు. ‘కాస్త ఏమరుపాటుగా ఉంటే నువ్వు నా కళ్లు కప్పి పారిపోతావా? ఉండు నీ పని చెప్తా’ అంటూ దానికి నాలుగు తగిలించి ఇంటికి తోలుకెళ్లాడు.  

ఆదిత్య కార్తికేయ


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని