నెమలి నిజాయతీ!

పూర్వం చిత్రవనానికి కేసరి అనే సింహం రాజుగా ఉండేది. ఉపాయశాలి అనే నక్క మంత్రిగా పనిచేసేది. ఆ అడవిలో చాలారకాల జంతువులు, పక్షులు జీవించేవి. అయితే వాటి మధ్య ఏనాడూ సఖ్యత ఉండేది కాదు. చిన్న చిన్న విషయాలకు కూడా తగాదాలు పడి, తీర్పు కోసం సింహం దగ్గరకు వెళ్లేవి.

Updated : 15 Nov 2023 04:07 IST

పూర్వం చిత్రవనానికి కేసరి అనే సింహం రాజుగా ఉండేది. ఉపాయశాలి అనే నక్క మంత్రిగా పనిచేసేది. ఆ అడవిలో చాలారకాల జంతువులు, పక్షులు జీవించేవి. అయితే వాటి మధ్య ఏనాడూ సఖ్యత ఉండేది కాదు. చిన్న చిన్న విషయాలకు కూడా తగాదాలు పడి, తీర్పు కోసం సింహం దగ్గరకు వెళ్లేవి.

సింహానికి పనుల ఒత్తిడి వల్ల అన్ని గొడవలనూ పరిష్కరించడానికి సమయం ఉండేది కాదు. ఆ విధంగా న్యాయనిర్ణయానికి చాలాకాలం పట్టేది. ఇదంతా గమనించిన నక్క.. సింహానికో సలహా ఇచ్చింది.

‘ప్రభూ...! మనం ఎవరినైనా న్యాయశాస్త్రం తెలిసిన వారిని, న్యాయాధికారిగా నియమిస్తే సరిపోతుంది’ అంది. అందుకు సింహం.. ‘ఉపాయం బాగానే ఉంది, కానీ మన అరణ్యంలో న్యాయశాస్త్రం తెలిసిన వారు ఎవరున్నారు?’ అంది.
‘లేకేం ప్రభూ! ఈ మధ్యనే మయూరి అనే నెమలి, ఆసక్తి కొద్దీ.. పొరుగు అరణ్యంలో న్యాయశాస్త్రాన్ని బాగా చదివిన హరిణకం అనే జింక దగ్గర, విద్య నేర్చుకుని వచ్చింది’ అంటూ దాన్ని సింహం వద్దకు రప్పించింది. నెమలి సంతోషంగా రాచకొలువులో పని చేయడానికి ఒప్పుకొంది.

మరుసటి రోజే ఎలుగుబంటి, తోడేలు గొడవ పడి నెమలి దగ్గరకు వెళ్లాయి. వాటి తగాదాకు కారణం అడిగి, తరచి తరచి ప్రశ్నలు వేసి తప్పంతా ఎలుగుబంటిదేనని తేల్చి, కఠినమైన శిక్ష విధించింది నెమలి. లబోదిబోమంటూ సింహం దగ్గరకు వెళ్లి మొరపెట్టుకుందది. సింహం, నెమలి వైపు తిరిగి.. ‘పేనుకు పెత్తనం ఇస్తే... తలంతా కొరికిందన్నట్టుంది నీ తీరు. ఎలుగుబంటితో నాకు చాలాకాలంగా మంచి స్నేహం ఉంది. ఇది అడవిలో అందరికీ తెలిసిందే. నువ్వు నాతో మాట కూడా చెప్పకుండా దానికి కఠిన శిక్ష విధించడం ఏంటి?’ అంటూ కోప్పడింది. అంతేగాక.. ‘ఇక మీదట తీర్పు ఇచ్చేటప్పుడు ముందుగా నాతో ఒక మాట చెప్పి, అనుమతి తీసుకో. తొందరపడి సొంత నిర్ణయాలు తీసుకోకు’ అంటూ హెచ్చరించింది. నెమలి అప్పటికి మౌనంగా ఉండి, తర్వాత మంత్రి నక్కతో.. ‘మీరు ఉద్యోగం ఇస్తారని ఆనందంగా వచ్చాను. కానీ రాజుగారి ఇష్టానుసారం తీర్పులు ఇవ్వలేను. మొహమాటాలకు పోయి న్యాయశాస్త్రానికి అపవాదు తేలేను. మన్నించండి.. నాకు సెలవిప్పించండి’ అంది.

నెమలి వైపు అభినందనపూర్వకంగా చూస్తూ... ‘‘భేష్‌...! న్యాయవాది అంటే ఇలా ఉండాలి. నువ్వు ఎక్కడికీ వెళ్లాల్సిన అవసరం లేదు. శాస్త్రజ్ఞానం ఒక్కటే న్యాయవాది పదవికి చాలదు. నిజాయతీ, నిబద్ధత, విషయ పరిజ్ఞానం.. ఎంతో అవసరమని మృగరాజు అభిప్రాయం. ఆ విషయాన్నే నాతో అంటే.. ‘దాన్ని నాకు వదిలేయండి’ అని నీకు ఈ పరీక్ష పెట్టాను. తోడేలు, ఎలుగుబంటి, మృగరాజు ఈ విషయంలో నాకు సహకరించాయి. నువ్వు నీ నిజాయతీని రుజువు చేసుకున్నావు. నిబద్ధతతోపాటు తెలివితేటలు కలిగిన నీలాంటి దాన్ని రాజుకు పరిచయం చేశానన్న తృప్తిని అందించావు. ఇక్కడ ఎలాంటి ఒత్తిడి లేకుండా నీ ధర్మాన్ని నువ్వు పాటించవచ్చు’’ అంది నక్క. సింహం ఆనందంగా అవునన్నట్లు తలూపుతూ... పరీక్షలో నెగ్గినందుకు నెమలిని అభినందించింది. ఆ తర్వాత ధర్మబద్ధంగా తీర్పులిస్తూ.. అడవిలో మంచి పేరు సంపాదించింది నెమలి.

గంగిశెట్టి శివకుమార్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు