ఓ బల్లి... ఓ మల్లిక!

రాత్రి పూట అమ్మ పక్కనే హాయిగా నిద్ర పోతున్న ఎనిమిదేళ్ల మల్లికకు హఠాత్తుగా మెలకువ వచ్చింది.

Updated : 17 Nov 2023 05:35 IST

రాత్రి పూట అమ్మ పక్కనే హాయిగా నిద్ర పోతున్న ఎనిమిదేళ్ల మల్లికకు హఠాత్తుగా మెలకువ వచ్చింది. తన దృష్టి గోడ పైన తచ్చాడుతున్న బల్లి మీద పడింది. ఈలోగా గోడ మీదున్న పురుగును పట్టుకోవడానికి బల్లి అటువైపే వెళ్లసాగింది. అది గమనించిన మల్లిక.. ‘రాత్రి పడుకునే ముందు తలుపు వేస్తుంటే.. నా మీద ఎందుకు పడ్డావు?’ అని బల్లిని గట్టిగా అడిగింది. అది సమాధానం చెప్పకుండానే పురుగు వెంటే వెళ్లసాగింది.  

అది గమనించిన మల్లిక.. ‘అడిగేది నిన్నే?’ మళ్లీ గట్టిగా అంది. ‘చెబుతున్నా.. ఆగు’ అంటూ బల్లి, మల్లిక వైపు తిరిగే సరికి, పురుగు ఇదే మంచి సమయం అనుకుని తప్పించుకుంది. ‘అబ్బా! నోటికి అందినట్టే అంది త్రుటిలో తప్పించుకుంది. బంగారం లాంటి ఆహారం నాకు అందకుండా చేశావు’ మల్లిక వైపు అసహనంగా చూస్తూ అంది. ‘నా పేరు నీకెలా తెలుసు?’ ఆశ్చర్యపోతూ అడిగింది మల్లిక.

‘‘నేనూ మీతో పాటు ఈ ఇంట్లోనే ఉంటున్నాను. అమ్మ నిన్ను.. ‘మల్లికా..’ అని పిలవడం ఎన్నోసార్లు విన్నాను’’ అంది బల్లి. ‘అవునా... అది సరే గానీ, నా ఆహారం దూరం చేశావు. ఆకలి పెంచావు. నీకిది న్యాయమా?’ అని పొట్టవైపు చూసుకుంటూ అంది బల్లి. ‘నీకో విషయం తెలుసా? చేపలు తింటే మనిషికి మంచిది. కానీ తినకపోతే చేపలకు మంచిది. అలాగే పురుగులను నువ్వు తినకపోతే వాటికే మంచిది’ అని గొప్పగా చెప్పింది మల్లిక.  

‘నేను చేసిన తప్పేంటి?’ చుట్టూ పురుగులేవి కనబడక పోవడంతో దీనంగా అడిగింది బల్లి. ‘రాత్రిపూట పడుకునే ముందు, తలుపు వేస్తుంటే నా మీద ఎందుకు పడ్డావు?’ కొంచెం కోపంగా అడిగింది మల్లిక. ‘పడితే ఏమైంది?’ బల్లి కూడా గట్టిగానే తిరిగి ప్రశ్నించింది. ‘నాకు ఒక్కసారిగా భయం వేసింది. అమ్మ నన్ను గట్టిగా పట్టుకుంది. ఫర్వాలేదంటూ స్నానం చేయించింది. ఇదంతా నువ్వు నా మీద పడినందుకే కదా!’ అంది మల్లిక. ఆ మాటలకు బల్లి గట్టిగా నవ్వింది.

‘నా బాధ నీకు నవ్వులాటగా ఉందా?’ అంది మల్లిక. ‘కోపం వద్దు.. నిన్న నువ్వు అడ్డు రావడంతోనే పురుగు తప్పించుకుంది. ఆకలి తీరనందుకు నాకూ బాధేసింది. అయినా, కుక్కను పెంచుకుంటారు. ముద్దుగా దగ్గరకు తీసుకుంటారు. శ్రద్ధగా స్నానం కూడా చేయిస్తారు. మరి మేం మీ మీద పడితే స్నానం ఎందుకు చేస్తారు? ఎప్పుడైనా ఆలోచించావా?’ అడిగింది బల్లి.

‘నిజమే కదా? ఎందుకలా?’ బుర్ర పట్టుకుంటూ అడిగింది మల్లిక. ‘చెబుతాను విను. మేము ఎప్పుడూ గోడలపైనే ఉంటాం. అక్కడే ఉన్న పురుగులను తింటాం. మా శరీరం కూడా విషపూరితమైనదే. మీ మీద పడితే, దురదలు వంటి శారీరక బాధలు పుడతాయి. వెంటనే స్నానం చేస్తే అవి పోతాయి.. అర్థమైందా?’ అని జవాబిచ్చిందది.  

‘నిజమే. భలేగా చెప్పావు. అటువంటప్పుడు, ఎప్పుడూ పైన సంచరించే మీరు, కిందకు వచ్చి మా మీద ఎందుకు పడటం?’ మల్లిక అమాయకంగా అడిగింది. ‘పైనే ఎప్పుడూ ఆహారం దొరకదు. మా నుంచి తప్పించుకోవడానికి పురుగులు కిందకు వస్తాయి. పురుగులు ఉన్న వైపు పరుగులు పెడతాం. అలా వస్తుంటే నిన్న రాత్రి నీ మీద పడ్డాను. తెలిసిందా’ అంది బల్లి నవ్వుతూ.

‘అంటే.. మీ దారికి నేను అడ్డు వచ్చానా?...’ నవ్వుతూ అంది మల్లిక. ‘లేదు, అప్పుడప్పుడూ కిందికి వస్తామని చెప్పానుగా. అప్పుడు మీరు కొంచెం చూసి నడిస్తే, మీకు అడ్డు రాకుండా ఉంటాం కదా’ అంటూ బల్లి తనను తాను సమర్థించుకుంది.
‘అమ్మ కూడా.. జాగ్రత్తగా నడవాలని చెబుతుంటుంది. నిజమే.. చూసి నడిస్తే ఏ బాధా ఉండదు. అవునూ?! పురుగులను ఎందుకు తినడం?’ అని బల్లిని అడిగిందా పాప. ‘కప్పలను పాములు తింటాయి. పురుగులను కప్పలు తింటాయి. ఆ పురుగులేమో నాచును తింటాయి. ఇది ఆహారపు గొలుసని నీకు తెలుసు కదా.. ఆకలి వేస్తే సింహం మాంసాన్నే తింటుంది కానీ, గడ్డిని తినదు. మేమూ అంతే.. ఎవరి ఆకలి వారిది. ఎవరి ఆహారం వారిది. అయినా పురుగుల్లో కొన్ని చెడ్డవి కూడా ఉంటాయి. వాటిని కూడా తిని మేము మీకు మేలే చేస్తున్నాం. కనుక మాపై చిన్న చూపు వద్దు. మా దారికి అడ్డు రావద్దు. చూడు! నేను లేకపోవడంతో పురుగులన్నీ పైన ఎలా మాట్లాడుకుంటున్నాయో? నేను వెళతాను’ అంటూ బల్లి అటుగా కదిలింది. అంతే మల్లిక, బల్లిని చూసి నవ్వింది. అప్పుడే మెలకువ వచ్చింది.

రాత్రి బల్లి పడిన విషయం తలచుకుంటూ పడుకున్నందుకే అది కలలో వచ్చిందనుకుంది. పైన ఆహారం కోసం అటూ, ఇటూ తిరుగుతున్న బల్లిని చూస్తూ.. ‘మీ దారికి మేమే అడ్డు రాకూడదు’ అంది మల్లిక. తర్వాత అమ్మ చేతిని తన మీద వేసుకుని తిరిగి నిద్రలోకి జారుకుంది.

కె.వి.లక్ష్మణరావు


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు