అపకారికి ఉపకారం!!

వెంకయ్య, సుబ్బయ్య ఇద్దరు స్నేహితులు. వీరు ఒకే ఊరిలో ఉండేవారు. చేసే వ్యాపారం కూడా ఒకటే! పట్నం నుంచి రకరకాల పండ్లను తెచ్చి, ఊరి మధ్యలో ఉన్న మర్రి చెట్టు దగ్గర ఎదురెదురుగా ఉన్న చెక్క బడ్డీ కొట్లలో అమ్ముతూ జీవనం సాగిస్తూ ఉండేవారు

Published : 22 Nov 2023 00:56 IST

వెంకయ్య, సుబ్బయ్య ఇద్దరు స్నేహితులు. వీరు ఒకే ఊరిలో ఉండేవారు. చేసే వ్యాపారం కూడా ఒకటే! పట్నం నుంచి రకరకాల పండ్లను తెచ్చి, ఊరి మధ్యలో ఉన్న మర్రి చెట్టు దగ్గర ఎదురెదురుగా ఉన్న చెక్క బడ్డీ కొట్లలో అమ్ముతూ జీవనం సాగిస్తూ ఉండేవారు. సుబ్బయ్య ఎప్పుడూ తాజాగా ఉండే పండ్లను అమ్ముతూ.. అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ ఉండేవాడు. వెంకయ్య మాత్రం పండ్ల నాణ్యతను అసలు పట్టించుకునే వాడే కాదు. పైగా ఎక్కువ ధరకు అమ్మేవాడు. అందర్నీ విసుక్కుంటూ ఉండేవాడు. దాంతో అతని వద్దకు వెళ్లే వారి సంఖ్య క్రమక్రమంగా తగ్గిపోసాగింది.
కొంతకాలం బాగానే గడిచినా రాను రాను బేరాలు మరింతగా పడిపోవడంతో వెంకయ్యలో అసూయ పెరిగింది. ఎలాగైనా సుబ్బయ్య వ్యాపారానికి నష్టం కలిగించి, అతన్ని ఇక్కడ లేకుండా చేస్తే తన వ్యాపారానికి అడ్డు ఉండదు అనుకున్నాడు. ఒకరోజు సుబ్బయ్య పని మీద పక్క ఊర్లో బంధువుల ఇంటికి భార్యతో సహా వెళ్లాడు. అతను తిరిగి వచ్చేసరికి కొట్టు పూర్తిగా పాడైపోయి ఉంది. ముక్కలు ముక్కలుగా విరిగిపోయి ఉన్న కొట్టును చూసి లబోదిబోమన్నాడు! అసలు ఇలా ఎందుకు జరిగిందో... ఎవరు చేశారో అతనికి అర్థం కాలేదు. కొట్టు బాగు చేసుకునేందుకు సుబ్బయ్య దగ్గర సరిపడా ధనం లేదు. దీంతో తన స్నేహితుడైన వెంకయ్య దగ్గరకు వెళ్లి తన కొట్టు బాగు చేయించుకోవడానికి ధన సహాయం చేయమని అడిగాడు. తన దగ్గర డబ్బు లేదని చెప్పి, పంపించేశాడు వెంకయ్య. చేసేదేమీలేక సుబ్బయ్య ఇంటి దారి పట్టాడు. ఎప్పుడైతే సుబ్బయ్య కొట్టు అక్కడ లేకుండాపోయిందో.. అప్పుడిక వెంకయ్య వ్యాపారం బాగా సాగింది! సుబ్బయ్య మాత్రం నిరుత్సాహపడకుండా తన ఇంటి నుంచే పండ్ల వ్యాపారం ప్రారంభించాడు. ఈ విషయం తెలిసి, అందరూ అతని ఇంటి దగ్గరికే వెళ్లి కొనుక్కోసాగారు.
అది చూసిన వెంకయ్యకు ఏం చేయాలో అర్థం కాలేదు. ‘ఇతని కొట్టు పాడు చేసినా.. మళ్లీ జోరుగా వ్యాపారం చేస్తున్నాడు. ఇక లాభం లేదు. ఇతణ్ని ఊరు నుంచి పంపించాలి’ అనుకున్నాడు. వర్షాకాలం కావడంతో మూడు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు ఊరంతా మునిగిపోయింది. వెంకయ్య కొట్టు కూడా నీటిలో మునిగి కొట్టుకుపోయింది. అది చూసిన వెంకయ్య లబోదిబోమంటూ బాధపడ్డాడు. అంత బాధలోనూ సుబ్బయ్య గుర్తుకొచ్చాడు!
‘ఎలాగైనా సరే.. ఈరోజు రాత్రికి సుబ్బయ్య ఇంటికి వెళ్లి, అతని ఇంట్లో ఉన్న పండ్లను దొంగిలించి, వాటిని అమ్మి, ఎంతో కొంత నష్టాన్ని భర్తీ చేసుకోవచ్చు’ అనుకున్నాడు వెంకయ్య. ఆ రోజు రాత్రి చీకటి పడ్డాక దొంగతనానికి సుబ్బయ్య ఇంటికి వెంకయ్య వెళ్లాడు. అప్పుడే లోపలి నుంచి వస్తున్న మాటలు విని, ఒక్క నిముషం ఆగిపోయాడు. సుబ్బయ్య, తన భార్యతో.. ‘నా మిత్రుడు వెంకయ్య కొట్టు  నీటిలో కొట్టుకుపోయింది. పాపం అతను ఇబ్బందుల్లో ఉన్నాడు. ఎంతో కొంత సహాయం చేయాలి’ అన్నాడు.
‘మీరు భలేవారే! మీ కొట్టు పాడైనప్పుడు వెళ్లి అతణ్ని సహాయం అడగ్గా ఏమాత్రం చేయూత అందివ్వలేదు. అతనికి మీరు ఉపకారం ఎందుకు చేయడం?’ అందామె. ‘మనం కూడా అలా చేస్తే అతనికి, మనకు తేడా ఏముంది? అసలు మన కొట్టును పాడు చేయించింది కూడా అతనే. ఆ విషయమూ నాకు తెలిసింది! మనం కూడా వెంకయ్యలాగా ప్రవర్తించకూడదు. అతనిలో మార్పు ఎలాగైనా తీసుకురావాలి. రేపు ఉదయం అతని దగ్గరికి వెళ్లి చేతనైన సాయం చేస్తా’ అన్నాడు.
ఆ మాటలు వింటున్న వెంకయ్య నోట మాట రాలేదు. చప్పుడు చేయక అక్కడి నుంచి ఇంటి దారి పట్టాడు. మనసు నిండా ఒకటే బాధ. ‘ఇంత మంచి వాడినా నేను మోసం చేసింది. ఇప్పుడు కూడా వర్షం వల్ల నా కొట్టు పాడై, పండ్లు నీటిలో కొట్టుకుపోయినా.. అతని దగ్గర దొంగతనం చేసి, నేను నా నష్టాన్ని ఎంతో కొంత భర్తీ చేసుకోవాలి అనుకున్నాను. కానీ అతను నాకు సహాయం చేయాలనుకుంటున్నాడు. నేను చాలా దుర్మార్గుణ్ని. అంత మంచి వ్యక్తిని ఇబ్బంది పెట్టాను’ అనుకుంటూ ఇంటికి చేరుకున్నాడే కానీ, మనసు మనసులో లేదు. మర్నాడు ఉదయం సుబ్బయ్య, వెంకయ్య దగ్గరకు వచ్చి.. ‘ఎంత పని జరిగింది. నీ కొట్టు వర్షంలో కొట్టుకుపోయింది అని తెలిసింది. నీకు ఏదైనా సహాయం కావాలంటే అడుగు, మొహమాట పడకు. నాకు చేతనైన సహాయం చేస్తాను’ అన్నాడు సుబ్బయ్య.
ఆ మాటలు విన్న వెంకయ్య కంటిలో నీళ్లు తిరిగాయి. నోట మాట రాలేదు. ఒక క్షణంలో తేరుకుని... ‘నాకు తగిన శాస్తి వర్షం రూపంలో జరిగింది. నన్ను క్షమించు సుబ్బయ్యా. నువ్వు ఊరు వెళ్లినప్పుడు, నీ కొట్టును పాడు చేయించింది నేనే. ఆ విషయం నీకు తెలిసిందని, కూడా నాకు తెలుసు.. కానీ నువ్వు నన్నేమీ అనకుండా, నేను ఇప్పుడు ఆపదలో ఉంటే సహాయం చేస్తానన్నావు. నువ్వు నిజమైన స్నేహితుడివి. నేను దుర్మార్గుణ్ని. నన్ను క్షమించు’ అన్నాడు. ‘చూడు వెంకయ్యా.. పుట్టుకతోనే ఎవరూ చెడ్డవారు కాదు. పరిస్థితులు ఎలా ఉన్నా సరే.. మనం మన నీతి, నియమాన్ని తప్పకూడదు. ఇతరులు మనకంటే ఉన్నతంగా ఉన్నప్పుడు.. మనం వారిలోని మంచిని గ్రహించాలి. మనం కూడా వారిలా గొప్పగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. అంతేకానీ, వారిని అడ్డగించడం సరికాదు. వారు మనకంటే గొప్పవారిగా ఉన్నందుకు వారికి కీడు చేయడం వంటివీ చేయకూడదు. ఇకనైనా నువ్వు మారు. మంచిని గ్రహించు. అందరికీ నీ చేతనైన సహాయం చేయి. ఎవరికీ అపకారం చేయకు’ అన్నాడు సుబ్బయ్య.
అప్పటి నుంచి వెంకయ్య కూడా నీతిగా, నిజాయతీగా వ్యాపారం చేస్తూ.. ఇతరులకు తనకు తోచినంత సహాయం చేయసాగాడు. వెంకయ్యలో వచ్చిన మార్పునకు ఎంతగానో సంతోషించాడు సుబ్బయ్య.
ఏడుకొండలు కళ్లేపల్లి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని