ఐకమత్యమే మహాబలం..!

చంపావతి నదిలో చాలా చేపలు ఉండేవి. అందులో ఒకదాని పేరు మీనా. అది రంగురంగులుగా చూడటానికి చాలా బాగుండేది. కానీ, అందంగా ఉంటాననే గర్వంతో మిగతా చేపలతో కలిసేది కాదు. ఆహారం కోసం కూడా ఒంటరిగానే వెళ్లేది.

Updated : 25 Nov 2023 05:29 IST

చంపావతి నదిలో చాలా చేపలు ఉండేవి. అందులో ఒకదాని పేరు మీనా. అది రంగురంగులుగా చూడటానికి చాలా బాగుండేది. కానీ, అందంగా ఉంటాననే గర్వంతో మిగతా చేపలతో కలిసేది కాదు. ఆహారం కోసం కూడా ఒంటరిగానే వెళ్లేది. తోటి చేపలు ‘నువ్వు ఇక్కడున్న అన్ని చేపల కంటే అందంగానే ఉండొచ్చు. కానీ ఎవరితో కలవకుండా గర్వం చూపించడం మంచి పద్ధతి కాదు. పైగా ఒంటరిగా ఉంటే నీ ప్రాణాలకే ప్రమాదం. గుంపులో ఉంటేనే నీకు మంచిది’ అని చాలాసార్లు హెచ్చరించాయి. అయినా అది మాత్రం అస్సలు వినేది కాదు.
మీనా ఎప్పుడూ దాని కంటే పెద్ద చేపలతో అగౌరవంగా మాట్లాడేది. చిన్నవాటిని హేళన చేసేది. దాని మంచికోరి పెద్దవి చెప్పిన ఏ మాటను కూడా లెక్కచేసేది కాదు. దానికితోడు ‘నేను అందంగా ఉంటానని, నా రంగు బాగుంటుందని మీకు అసూయ. అందుకే ఏవేవో కబుర్లు చెబుతున్నారు. అసలు నేను మీరు చెప్పినట్లు ఎందుకు వినాలి? నా ఇష్టం వచ్చినట్లు నేనుంటాను’ అని మొండిగా మాట్లాడేది. దాంతో అవి జాగ్రత్తలు చెప్పడం మానేశాయి.
ఒకరోజు జాలరి వలతో అక్కడికి వచ్చాడు. ఆ నదిలో వల వేసి దానిపై రాయి పెట్టి, మరో చోటకు వెళ్లాడు. ఒక్క మీనా తప్ప మిగిలిన చేపలన్నీ వేటగాడు పన్నిన వలలో చిక్కాయి. అప్పుడే అటుగా వస్తున్న మీనా.. బయటపడేందుకు గిజగిజ కొట్టుకుంటున్న వాటిని చూసి వెటకారంగా నవ్వింది. ‘ఇప్పుడు మీకు అర్థమైందా? గుంపుగా తిరిగితే ఎంత ప్రమాదమో.. నేను మీతో కలిసి లేను కాబట్టే ఎంచక్కా బయట ఉన్నాను. ఇంకాసేపట్లో ఆ జాలరి వచ్చి వలను పైకి లాగుతాడు. రేపు ఈ సమయానికల్లా మీరంతా ఆహారంగా మారతారు’ అని ఎగతాళి చేస్తూ మాట్లాడింది. అసలే వలలో చిక్కుకొని ఆందోళనలో ఉన్న చేపల గుంపుకి, మీనా మాటలు మరింత బాధ కలిగించాయి. ఆ వలలో నుంచి ఎలా తప్పించుకోవాలో వాటికి అర్థం కావడం లేదు. ఇంతలో ఒక ముసలి చేప ‘మనం ఇలా బాధ పడుతూ కూర్చుంటే ఆ మీనా చెప్పినట్లే జరుగుతుంది. ఏదో ఒకటి చేసి వెంటనే ఈ గండం నుంచి బయటపడాలి. నాకు ఓ ఆలోచన వచ్చింది. అది పాటిస్తే మనం ఇక్కడి నుంచి బయటపడొచ్చు’ అంది. అదేంటో చెప్పమన్నాయి మిగతా చేపలు.
‘మనమంతా గుంపుగా ఉన్నాం కదా.. మన బలాన్ని ఉపయోగించి ఒక్కసారిగా ముందుకు కదులుదాం. అప్పుడు ఈ వల నుంచి తప్పించుకోవచ్చు’ అందది. చెప్పినట్లుగానే మొత్తం చేపలన్నీ ఒకేసారి బలంగా ముందుకు ఈదాయి. అంతే.. బరువు కోసం పెట్టిన రాయి.. పక్కకు జరగడంతో వల వదులైంది. క్షణం కూడా ఆలస్యం చేయకుండా అందులోని చేపలన్నీ బయటికి వచ్చేశాయి. ఇదంతా చూస్తున్న మీనా ఆశ్చర్యపోయింది. బయటికి వచ్చాక ఆ చేపలు మీనా వైపు చూస్తూ.. ‘ఇప్పటికయినా అర్థమైందా? కలిసి ఉంటే ఎంత పెద్ద ప్రమాదం నుంచైనా తప్పించుకోవచ్చని.. ఐకమత్యమే మహాబలమని అని పెద్దలు ఊరకనే చెప్పలేదు. ఇప్పటికైనా మాతో కలవడానికి ప్రయత్నించు’ అన్నాయవి.
అయినా మీనాలో మార్పు రాలేదు. మారు మాట్లాడకుండా ముందుకు కదిలింది. అక్కడేదో ఆహారం కనబడగానే తినాలని చూసింది. అది చేపల్ని పట్టడానికి వేటగాడు వేసిన ఎర అని గుర్తించలేకపోయింది.  అది చూసిన చేపలు ‘ఎన్నిసార్లు చెప్పినా మా మాటలు నువ్వు వినలేదు.. ఇప్పుడు ఏమైందో చూడు’ అని అంటుండగానే ఆ ఎర వేసిన జాలరి మీనాను పట్టుకెళ్లిపోయాడు.

ఎన్ రేవతి


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు