చీమ సాయం..!

రామాపురం ఊరి చివర ఒక పెద్ద గోదాం ఉంది. ఆ గ్రామంలో పండించిన అన్ని రకాల ఆహారధాన్యాలను అందులోనే  మూటలు కట్టి నిల్వ చేస్తుంటారు. ఆ ధాన్యాల మూటలను అటుఇటూ మారుస్తున్నప్పుడు చాలా గింజలు రాలిపోతుంటాయి.

Updated : 02 Dec 2023 05:37 IST

రామాపురం ఊరి చివర ఒక పెద్ద గోదాం ఉంది. ఆ గ్రామంలో పండించిన అన్ని రకాల ఆహారధాన్యాలను అందులోనే  మూటలు కట్టి నిల్వ చేస్తుంటారు. ఆ ధాన్యాల మూటలను అటుఇటూ మారుస్తున్నప్పుడు చాలా గింజలు రాలిపోతుంటాయి. వాటిని పక్షులు, చిన్నచిన్న కీటకాలు, చీమలు తింటూ ఉంటాయి. అలా ఒకరోజు ఒక చీమ కిందపడిన ధాన్యాలను తినసాగింది. దానికి ఆకలైతే తీరింది కానీ, దాహం వేయడం మొదలైంది. కనుచూపు మేరలో ఎక్కడా నీటి జాడ కనిపించడంలేదు. దానికి ఏం చేయాలో తోచడంలేదు. ఎక్కడికి వెళ్లాలా అని ఆలోచిస్తున్న సమయంలో రెండు నీటి చుక్కలు దాని తల మీద పడ్డాయి. ఎక్కడాలేని ఆనందం వేసింది అప్పుడు చీమకి. తీరిగ్గా ఆ నీటిని తాగేసి.. అసలు ఇక్కడికి నీరు ఎక్కడి నుంచి వచ్చిందబ్బా.. అని ఆలోచించసాగింది.

కానీ ఎంతకు తెలియడంలేదు. అలా ఆలోచిస్తూనే అక్కడి నుంచి మెల్లగా ముందుకు కదిలింది చీమ. అదే చోట మళ్లీ కొన్ని నీటి చుక్కలు పడ్డాయి. బయట చూస్తేనేమో చాలా ఎండగా ఉంది.. వర్షం కూడా రావట్లేదు. అసలు ఈ నీరంతా ఎక్కడి నుంచి వస్తుందని ఒక్కసారిగా తల పైకెత్తి చూసిందది. అక్కడ ఒక అమ్మాయి గుక్కపట్టి ఏడుస్తూ కూర్చుని ఉండటం గమనించింది. ఇప్పటి వరకు ఇక్కడ పడిన నీటి బిందువులన్నీ ఆమె కన్నీరేనని చీమకు అప్పుడు అర్థమైంది. వెంటనే తన దగ్గరకు వెళ్లి ‘నేను చాలాసేపటి నుంచి నీళ్ల కోసం వెతుకుతున్నాను.. కానీ ఎక్కడా దొరకలేదు. నువ్వు బాధతో ఏడుస్తున్నా.. ఆ కన్నీటితో నా దాహాన్ని తీర్చావు. అందుకు నీకు ఎన్ని కృతజ్ఞతలు చెప్పినా తక్కువే’ అని ఆనందంగా చెప్పింది చీమ. కానీ ఆ అమ్మాయి మాత్రం ఏం మాట్లాడకుండా ధాన్యపు గింజలను ఏరుతూ ఉంది. అప్పుడు ‘నేను ఇంత మాట్లాడుతున్నా నువ్వు అసలు బదులుగా ఏ సమాధానం చెప్పడంలేదు. ఏమైంది నీకు? ఎందుకు ఏడుస్తున్నావు? ఎవరైనా ఏమైనా అన్నారా?’ అని కాస్త ఓదార్పుగా అడిగింది చీమ. ‘నాకు రకరకాల పనులు నేర్చుకోవడం అంటే చాలా ఇష్టం. స్కూల్‌కి సెలవులు వచ్చిన ప్రతిసారి ఏదోఒక పని చేస్తూ ఉంటాను. అలాగే ఈసారి ఈ గోదాంలో పని చేయడానికి వచ్చాను. మా యజమాని కొన్ని బియ్యం, గోధుమలు ఇచ్చి వాటిని చిన్నచిన్న మూటలుగా కట్టమన్నారు. అలా కట్టి ఇంకో చోటుకి తీసుకెళ్తుంటే.. నా చేతిలో నుంచి జారిపడి, బియ్యం, గోధుమలు మొత్తం కలిసిపోయాయి. దాంతో యజమాని నన్ను చాలా కోపగించుకున్నారు. రేపు ఉదయానికల్లా వాటిని వేరు చేయాలని చెప్పారు. ఒకవేళ చేయకపోతే రేపటి నుంచి ఇక్కడికి రావొద్దని హెచ్చరించారు. నాకేమో ఇంకా రెండు రోజులు సెలవులు ఉన్నాయి. అవి పూర్తయ్యేదాక ఇక్కడే ఉండి రకరకాల ధాన్యాల గురించి తెలుసుకొని, ఇక్కడ చేసే పనిని నేర్చుకోవాలనుకున్నాను. కానీ ఈ అది పూర్తిగా నేర్చుకోకుండానే వదిలేయాల్సింది. రేపు ఉదయానికల్లా కాదు కదా.. మూడు రోజులు కష్టపడినా నేను వాటిని వేరు చేయలేను.. అందుకే ఏడుస్తున్నా’ అని దిగాలుగా జవాబిచ్చిందా అమ్మాయి.

విషయమంతా తెలుసుకున్న చీమ ఆలోచనలో పడింది. దాని దాహాన్ని తీర్చిన ఆ అమ్మాయికి ఎలాగైనా సహాయం చేయాలని నిర్ణయించుకుంది. వెంటనే ‘నేనేమైనా నీకు సహాయం చేయనా?’ అని అడిగింది చీమ. ‘నువ్వు చాలా చిన్నజీవివి అసలు సాధ్యమవుతుందా?’ అని ప్రశ్నించిందామె. ‘నా స్నేహితుల గుంపు చాలా పెద్దగా ఉంటుంది. వాటి సాయం తీసుకుంటాను. కొంత వరకైనా నీ పనిని పూర్తి చేస్తాము’ బదులిచ్చింది చీమ. అలాగే అంటూ తలూపింది ఆ అమ్మాయి. ఇక చీమ వెంటనే ఒక చీమల గుంపును పిలిచి, వాటిని రెండుగా విడదీసింది. వాటన్నింటికీ అక్కడున్న ధాన్యాలను చూపిస్తూ ‘ఈ కుప్పలో ఉన్న బియ్యం, గోధుమలను మనం రేపు ఉదయానికల్లా వేరు చేసి రెండు కుప్పలుగా పెట్టాలి. ఆమె నా దాహాన్ని తీర్చింది. ఎలాగైనా మనం తనకు వీలైనంత సహాయం చేయాలి’ అని వివరించింది. ఇక రాత్రంతా కష్టపడి ఒక చీమల జట్టు బియ్యాన్ని, మరో జట్టు గోధుమలను వేరు చేశాయి. ఉదయాన్నే గోదాముకి వచ్చిన యజమానికి రెండు ధాన్యాల కుప్పలు చూసి ఆశ్చర్యపోయాడు. ఇదెలా సాధ్యమైందని ప్రశ్నించాడు. దాంతో ఆ అమ్మాయి జరిగిందంతా వివరించింది. అనంతరం ‘నేను మిమ్మల్ని తక్కువ అంచన వేశాను. అయినా మీరంతా ధాన్యాలను వేరుచేసి నాకు సహాయం చేశారు. దానికి మీకు కృతజ్ఞతలు’ అని చీమలకు చెప్పింది ఆ అమ్మాయి.

ఆదిత్య కార్తికేయ


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని