ఇరవై నాలుగు గంటలు..!

పల్లవ దేశాన్ని విజయసింహుడు పాలించేవాడు. అక్కడ మంత్రి కేశవుడు. రాజు విందులు, వినోదాల మీద పెట్టినంత శ్రద్ధ పరిపాలన మీద పెట్టేవాడు కాదు. ఆయనకు చదరంగం అంటే చాలా ఇష్టం. ఆటలో మంచి ప్రావీణ్యం సంపాదించాడు

Updated : 10 Dec 2023 06:56 IST

పల్లవ దేశాన్ని విజయసింహుడు పాలించేవాడు. అక్కడ మంత్రి కేశవుడు. రాజు విందులు, వినోదాల మీద పెట్టినంత శ్రద్ధ పరిపాలన మీద పెట్టేవాడు కాదు. ఆయనకు చదరంగం అంటే చాలా ఇష్టం. ఆటలో మంచి ప్రావీణ్యం సంపాదించాడు. ఒకసారి రాజు తన పుట్టినరోజు సందర్భంగా ఒక ప్రకటన చేశాడు. చదరంగంలో ఆయన్ను ఓడించిన వారికి వంద బంగారు నాణేలు బహుమతిగా ఇస్తానని చెప్పాడు. ఆ రాజ్యంలోని పార్వతీపురంలో ఉండే రైతు రామయ్య మంచి తెలివితేటలు కలిగినవాడు. రాజుగారి ప్రకటన విన్న అతని స్నేహితులు, అప్పుడే పొలం నుంచి వస్తున్న రామయ్యను పిలిచి.. ప్రకటన గురించి వివరించారు. ‘నువ్వు అందులో పాల్గొనొచ్చు కదా’ అన్నారు. ‘పాల్గొంటే బాగానే ఉంటుంది కానీ.. నాకు ఆ ఆట రాదు’ అని బదులిచ్చి అక్కడి నుంచి వెళ్లిపోయాడతను. రామయ్య కూతురు సుమిత్ర మాత్రం ఆటలు చాలా బాగా ఆడుతుంది. ఇంటికి వెళ్లిన రామయ్య, ప్రకటన గురించి కూతురికి వివరించాడు. అప్పుడు ఆమె.. ‘నాన్న అదేం బ్రహ్మ విద్య కాదు. నాకు చదరంగం ఆడటం వచ్చు. ఒక వారంలో నువ్వు నాకంటే బాగా ఆడేలా చేస్తాను’ అంది. దానికి సరేనన్నాడు ఆ తండ్రి.

అలా వారంరోజుల పాటు పొలం నుంచి వచ్చాక తన కూతురి దగ్గర చదరంగం ఆడటం నేర్చుకున్నాడు రామయ్య. ఇంతలో రాజు పుట్టినరోజు రానే వచ్చింది. ఆ రోజు కోటకు వెళ్లి ‘మహారాజా! నేను మీతో చదరంగం ఆడడానికి సిద్ధం’ అన్నాడు రామయ్య. ‘ప్రకటన చేసి ఇన్నిరోజులైనా ఎవరూ పోటీకి రాలేదు. కనీసం నువ్వు అయినా వచ్చావు. నాకు చాలా ఆనందంగా ఉంది’ అన్నాడు రాజు. కాసేపటికి ఆట నిర్వహించే వ్యక్తి వచ్చి.. ‘ఈ చదరంగంలో ఐదు ఆటలు ఉంటాయి. ఎవరైతే మూడు ఆటలు గెలుస్తారో వారే విజేత’ అని నియమాలను వివరించాడు. ఆట ప్రారంభమైంది.. మొదటి ఆటలో రాజు గెలుపొందాడు. తరువాత మూడు ఆటలు రామయ్య గెలిచాడు. చివరి ఆటలో మళ్లీ రాజే విజయం సాధించాడు. ఈ పోటీలో రామయ్య విజేతగా నిలిచాడని ఆట నిర్వహించిన వ్యక్తి తెలిపాడు. అప్పుడు రాజు, రామయ్యను మెచ్చుకోలుగా చూస్తూ.. ‘మొదటి, చివరి ఆటలో నువ్వు కావాలనే ఓడిపోయావు కదా?’ అన్నాడు. ‘అవును మహారాజా! మీరు ఆగ్రహం చెందకూడదని అలా చేశాను’ అని బదులిచ్చాడతను. రైతుగా ఉండి, చదరంగం ఆటలో ఇంతటి ప్రావీణ్యం సాధించడం చాలా గొప్ప విషయం’ అంటూ వంద బంగారు నాణేలను అందివ్వబోయాడు రాజు. ‘క్షమించండి మహారాజా! నాకు ఇవి వద్దు’ అన్నాడు రామయ్య. ఆశ్చర్యపోయిన మహారాజు.. ‘అయితే.. ఏం కావాలో చెప్పు’ అన్నాడు. అప్పుడు ఆ రైతు బదులిస్తూ.. ‘ఇరవై నాలుగు గంటలు రాజ్యపాలన చేయాలనుంది’ అన్నాడు. ‘అంటే ఒకరోజు అని అర్థం. అతని విన్నపాన్ని ఒప్పుకోండి మహారాజా!’ అన్నాడు మంత్రి. అలాగేనంటూ.. రాజు పత్రం రాసిచ్చాడు.

 అక్కడి నుంచి బయటికి వెళ్లిన రామయ్య.. మిత్రులతో సమావేశమై రాజ్యంలో ఎక్కడెక్కడ ఏ సమస్యలు ఉన్నాయో తెలుసుకున్నాడు. మరుసటిరోజు ఆ సమాచారంతో కోటకు చేరుకున్నాడు. ‘రామయ్యా! నువ్వు అడిగిన ఒకరోజు ముగిసింది’ అన్నాడు రాజు. ‘లేదు మహారాజా! మీరు పొరబడుతున్నారు. నేను ఒక రోజు అనలేదు. ఇరవై నాలుగు గంటలు అని అడిగా’ అన్నాడు. ఆ మాటలు విన్న రాజు, మంత్రి ఆశ్చర్యపోయారు.

 ఆ తర్వాత రామయ్య ఆ ప్రాంతంలో నిత్యావసరాల ధరల మీద నియంత్రణ విధించాడు. విజయసింహుడు ఆమోద ముద్ర వేశాడు. అనంతరం సభ నుంచి రామయ్య వెళ్లిపోయాడు. ‘మహారాజా! ఇప్పుడతను మనతో ఉన్న సమయం ఒక గంట. ఇంకా ఇరవై మూడు గంటల సమయం తనకు ఉంది’ అన్నాడు మంత్రి. ‘ఇచ్చిన మాట వెనక్కి తీసుకోలేం కదా.. అలాగే కానీ’ అని బదులిచ్చాడు రాజు. ఇలా మిగతా ఇరవై మూడు గంటలను కూడా ఉపయోగించుకొని.. ఆ రాజ్యంలో ఉన్న సమస్యలను రాజు దృష్టికి తీసుకెళ్లి పరిష్కారమయ్యేలా చేశాడు రామయ్య. ‘నేను ఎంతోకాలంగా చేయలేని పనులను నువ్వు కొన్ని వారాల్లోనే పూర్తి చేయించగలిగావు. నేను కూడా ఇప్పటి నుంచి క్షేత్రస్థాయిలో పరిశీలించి.. ప్రజల సమస్యలను వీలైనంత తొందరగా తీరుస్తానని మాటిస్తున్నాను’ అన్నాడు రాజు. రామయ్య తెలివితేటలకు మెచ్చిన మహారాజు అతనికి సన్మానం చేశాడు. అక్కడి నుంచి బయటకు వెళుతున్న రామయ్యను సభలోని వారంతా కరతాళ ధ్వనులతో అభినందనలు తెలిపారు.  
యు.విజయశేఖర రెడ్డి


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని