ఆనంద్‌లో మార్పు వచ్చిందోచ్‌!

ఆ రోజు ఆదివారం. పనిమనిషి ఆదిలక్ష్మి ఇల్లు తుడుస్తూ మధ్యలో ఏదో గుర్తువచ్చినట్లు పని ఆపింది. సరళకేసి చూస్తూ.. ‘అమ్మగారూ! మా పిల్లవాడు, ఆనంద్‌ బాబు వయసోడే. బాబు వాడని దుస్తులుంటే మావోడికి ఇవ్వండమ్మా!’ అని అడిగింది.

Updated : 14 Dec 2023 04:10 IST

రోజు ఆదివారం. పనిమనిషి ఆదిలక్ష్మి ఇల్లు తుడుస్తూ మధ్యలో ఏదో గుర్తువచ్చినట్లు పని ఆపింది. సరళకేసి చూస్తూ.. ‘అమ్మగారూ! మా పిల్లవాడు, ఆనంద్‌ బాబు వయసోడే. బాబు వాడని దుస్తులుంటే మావోడికి ఇవ్వండమ్మా!’ అని అడిగింది. ‘దానికేం భాగ్యం.. చూసి ఇస్తాలే’ అంది సరళ. ఆదిలక్ష్మి పని పూర్తిచేసి వెళ్లిపోయింది. ఆ తర్వాత సరళ వంటపని హడావిడిలో ఆదిలక్ష్మి విషయం మర్చిపోయింది.

మధ్యాహ్నం ఉతికిన బట్టలు మడత పెడుతూ ఉంటే ఆదిలక్ష్మి విషయం గుర్తొచ్చింది. బీరువా నుంచి ఆనంద్‌ దుస్తులు తీసి, అంతగా వాడని ఓ రెండు జతలను ఓ సంచిలో పెడుతోంది. ఈలోగా ఆనంద్‌ రానే వచ్చాడు. ‘ఏంటమ్మా.. నా బట్టలు తీశావు’ అని అడిగాడు. ‘ఏం లేదురా.. ఆదిలక్ష్మి వాళ్ల అబ్బాయి కోసమని అడిగింది. ఇవి ఎట్లాగూ నువ్వు వేసుకోవడం లేదుగా.. ఆదిలక్ష్మికి ఇస్తే, వాడైనా వేసుకుంటాడు’ అని చెప్పింది సరళ.

ఆనంద్‌ వెంటనే... ‘ఏంటీ నా దుస్తులు వాడికిస్తావా? నావి వేరే వాళ్లు వేసుకోవడం నాకు ఇష్టం లేదు. నేను వాడకపోయినా సరే’ అంటూ కోపంగా సంచి లాక్కున్నాడు. ఆనంద్‌ ధోరణికి సరళకు కూడా ఆగ్రహం వచ్చింది. తను పట్టించుకోలేదు కానీ, ఇదివరకు కూడా బొమ్మల విషయంలో ఇలాగే చేశాడు. ‘తప్పు నాన్నా, అలా అనకూడదు. బీరువాలో దాచి ఉంచితే ఏమొస్తుంది చెప్పు..’ అని ఇంకా ఏదో చెప్పబోయింది.  

కానీ ఆనంద్‌... ‘ఇలాంటివన్నీ చెప్పకు. నేను ఇవ్వనంటే ఇవ్వను.. అంతే’ అని మొండిగా సమాధానమిచ్చాడు. ఇప్పుడు తనేం చెప్పినా వినిపించుకునేలా లేడని, తర్వాత మెల్లగా నచ్చచెప్పవచ్చని.. ‘సరే.. ఇవ్వనులే..’ అంటూ సంచి తీసుకుని లోపల పెట్టేసింది సరళ. 

మర్నాడు స్కూలుకు వెళ్లాడు ఆనంద్‌. చివరి పీరియడ్‌ సోషల్‌ టీచర్‌ వచ్చారు. పాఠం చెప్పడం పూర్తయ్యాక... ‘పిల్లలూ! మీరంతా కూడా ఎంతో అదృష్టవంతులు. ఎందుకంటే మీ అమ్మానాన్న మీకు కావలసినవన్నీ సమకూరుస్తూ, మీకు చదువు చెప్పిస్తున్నారు. కానీ మన దేశంలో ఎంతోమంది పిల్లలు సరైన తిండి, దుస్తులు లేక, చదువు సరిగా సాగక ఎన్నో అవస్థలు పడుతున్నారు. కొన్ని స్వచ్ఛంద సంస్థలు, అనాథ శరణాలయాలు వారికి సహాయం చేస్తున్నాయి. మరి సంస్థ నిర్వహణ అంటే చాలా డబ్బు కావాలి కదా. అందరూ కూడా తమకు ఉన్నంతలో డబ్బు లేదా ఉపయోగపడే వస్తువులు వారికి విరాళంగా అందిస్తే ఆ సంస్థలు బాగా పని చేయగలుగుతాయి. అందుకే మీరు కూడా మీరు వాడని దుస్తులు, పుస్తకాలు, బొమ్మలు మాత్రమే కాదు.. మీ అమ్మను అడిగి కొద్దిగా బియ్యం, పప్పులు ఇలా నిత్యావసరాలు ఏవైనా సరే తీసుకురండి. అన్నీ సేకరించాక ఒకరోజు మిమ్మల్ని ఓ అనాథ శరణాలయానికి తీసుకువెళతాను. మీరే స్వయంగా ఆ వస్తువుల్ని అక్కడి పిల్లలకు ఇవ్వవచ్చు. ఒకరికి సహాయపడటంలో ఎంత ఆనందం ఉంటుందో మీకే తెలుస్తుంది. సరేనా’ అన్నారు. ‘అలాగే టీచర్‌’ అన్నారంతా, ఒక్క ఆనంద్‌ తప్ప. ఎందుకంటే టీచర్‌ మాటలతో ఆనంద్‌లో ఆలోచన మొదలైంది.

‘నిజంగా సహాయపడటంలో సంతోషం ఉంటుందా?’ అనుకున్నాడు. నిన్న అమ్మ, తన దుస్తులు ఆదిలక్ష్మి కొడుక్కి ఇస్తానంటే తను వద్దని గొడవ చేశాడు. తను అలా చేయడం తప్పు అనిపిస్తోంది ఇప్పుడు. ఇంతలోనే గంట మోగింది. ఆనంద్‌ ఆలోచన ఆగింది. టీచర్‌ వెళ్లిపోయారు.

ఇంటికి చేరాక ఆనంద్‌...  ‘అమ్మా, అమ్మా! నా డ్రెస్సులు ఆదిలక్ష్మి వాళ్ల అబ్బాయికి ఇద్దాం’ అన్నాడు. అమ్మ ఆశ్చర్యంగా చూసింది. ‘అవునమ్మా, ఇవాళ మా టీచర్‌, ఇతరులకు సహాయ పడడంలో సంతోషం ఉంటుందని చెప్పారు. అందుకే ఆదిలక్ష్మిని, వాళ్ల అబ్బాయిని తీసుకు రమ్మను. నేనే ఇస్తాను. అలాగే మరో రెండు జతలు కూడా తీసి విడిగా ఉంచు. మా టీచర్‌ అనాథ శరణాలయం పిల్లలకు ఇద్దామని చెప్పారు’ అన్నాడు. ఆనంద్‌ మాటలు అమ్మకు సంతోషం కలిగించాయి. అన్నట్లుగానే.. రెండు రోజుల తర్వాత సాయంత్రం పూట ఆదిలక్ష్మి, పిల్లవాడిని వెంటబెట్టుకు వచ్చింది. ఆనంద్‌ తనే స్వయంగా దుస్తుల సంచి, ఆ అబ్బాయికి అందించాడు. ఆ పిల్లవాడి కళ్లు ఆనందంతో మెరిశాయి. అది చూసి ఆనంద్‌కు ఎంతో సంతోషం కలిగింది. ఇద్దరూ ఒకరినొకరు స్నేహంగా చూసుకున్నారు.

ఆ తర్వాత ఆదిలక్ష్మి... ‘వస్తానమ్మా’ అంటూ వెళ్లిపోయింది. ‘టీచర్‌ చెప్పింది నిజమే.. తనకు ఇప్పుడు ఎంతో సంతోషంగా ఉంది. ఇలాంటి సంతోషం కలగడం తనకు ఇదే మొదటిసారి..’ అనుకుంటూ,  ‘అమ్మా! అనాథ శరణాలయంలో పిల్లలకు డ్రెస్సులే కాదు, నా దగ్గర ఉన్న బొమ్మలు, కథల పుస్తకాలు కూడా ఇస్తాను’ అన్నాడు ఆనంద్‌. ‘అలాగే’ అంది అమ్మ సంతోషంగా!

జె.శ్యామల


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని