తప్పు తెలిసింది!

సరీన్‌ నాలుగో తరగతి చదువుతున్నాడు. వాళ్ల నాన్న ఆఫీసుకు వెళ్లడం కోసం సైకిల్‌ కొనుక్కున్నారు. దాన్ని చూసిన ఆ అబ్బాయి ‘నాన్నా! సైకిల్‌ నడపాలనుంది, నేర్పించవా?’ అని అడిగాడు గోముగా.

Updated : 17 Dec 2023 06:23 IST

రీన్‌ నాలుగో తరగతి చదువుతున్నాడు. వాళ్ల నాన్న ఆఫీసుకు వెళ్లడం కోసం సైకిల్‌ కొనుక్కున్నారు. దాన్ని చూసిన ఆ అబ్బాయి ‘నాన్నా! సైకిల్‌ నడపాలనుంది, నేర్పించవా?’ అని అడిగాడు గోముగా. అలాగేనంటూ.. ‘సైకిల్‌ నడపడమే కాదు. కుక్కలు, వాహనాలు ఏవైనా ఎదురొస్తే కంగారు పడకుండా జాగ్రత్తగా తప్పించడం కూడా రావాలి. అప్పుడే ప్రమాదాలు జరగవు’ అని జాగ్రత్తలు చెబుతూ తనని సైకిల్‌ ఎక్కించారాయన. అలా కాసేపు ఇంటి ముందున్న ఆట స్థలంలో సరీన్‌తో సైకిల్‌ తొక్కించారు. నాన్న సాయంతో సైకిల్‌ తొక్కడం సరీన్‌కు చాలా ఆనందంగా అనిపించింది.

అప్పటి నుంచి ప్రతిరోజు సాయంత్రం స్కూల్‌ నుంచి రాగానే ‘నాన్న ఆఫీసు నుంచి ఎప్పుడొస్తారా?’ అని ఎదురుచూస్తూ ఉండేవాడు. ఆయన రాగానే కాసేపు సైకిల్‌ నడపడం తనకు దినచర్యగా మారిపోయింది. ఒకరోజు స్కూల్‌కి వెళ్లాక ‘నేను మా నాన్న సాయంతో సైకిల్‌ నడపడం నేర్చుకుంటున్నానోచ్‌’ అని తన స్నేహితుడు రాజుతో అన్నాడు సరీన్‌. ‘ఎవరి సాయం లేకుండా సైకిల్‌ నడపాలి. అప్పుడే నీకు వచ్చినట్లు.. నేను అలా సైకిల్‌ నడపగలను తెలుసా!’ అన్నాడు రాజు. దాంతో తను కూడా తండ్రి సాయం లేకుండానే సైకిల్‌ తొక్కాలని నిర్ణయించుకున్నాడు. ఇంటికి వెళ్లాక ‘నాన్నా.. ఈరోజు నేను ఒక్కడినే నడుపుతాను’ అంటూ సైకిల్‌ బయటికి తీశాడు. ‘ఏ పనీ పూర్తిగా రానిదే తొందరపడకూడదు. సాధన చేయగా చేయగా.. బాగా వస్తుంది. ఇప్పుడు నువ్వు సైకిల్‌ పూర్తిగా రాకుండా తొక్కితే ప్రమాదం’ అంటూ నాన్న సర్దిచెప్పేసరికి సరేనంటూ.. ఆరోజుకు ఆయన సాయంతోనే సైకిల్‌ నడిపాడు.

ఆ రోజు ఆదివారం.. సరీన్‌, వాళ్ల నాన్న కంటే ముందుగానే నిద్ర లేచాడు. ఇదే మంచి సమయం అనుకుని, మెల్లగా వెళ్లి సైకిల్‌ తీశాడు. ఎప్పుడూ నడిపే చోట కాకుండా, రోడ్డు మీదకు సైకిల్‌ తీసుకెళ్లి వేగంగా తొక్కసాగాడు. తిరిగి వచ్చేటప్పుడు, ఒక కుక్కపిల్ల ఎదురుగా పరిగెత్తుకుంటూ వస్తోంది. వేగంగా సైకిల్‌ నడుపుతున్న సరీన్‌కి ఏం చేయాలో అర్థం కాలేదు. జాగ్రత్తగా దాన్ని తప్పించాలనుకున్నాడు. కానీ సైకిల్‌ వెనక చక్రం కుక్కపిల్ల ముందు కాలును రాసుకుంటూ వెళ్లింది. దాంతో అది గట్టిగా అరవసాగింది. తనకు బాధగా అనిపించినా.. దాని వెనకాలే ఎవరో పరిగెత్తుకుంటూ రావడం చూసి భయపడ్డాడు. ఆగితే, వాళ్లేమైనా అంటారేమోనని అక్కడి నుంచి వచ్చేశాడు.

కంగారుగా ఇంట్లోకి వెళ్తున్న సరీన్‌ని చూసి ‘ఎందుకలా కంగారు పడుతున్నావు?’ అని అడిగారు వాళ్ల నాన్న. కానీ తను ఏ సమాధానం చెప్పకుండా అలాగే నిలబడిపోయాడు. దాంతో ఆయన ‘కుక్కపిల్ల కాలికి దెబ్బ తగిలిందని భయపడుతున్నావా?’ అన్నారు. ఆశ్చర్యపోయిన సరీన్‌ ‘ఈ విషయం మీకెలా తెలుసు నాన్నా?’ అని అడిగాడు. ‘ఆ కుక్కపిల్ల నా స్నేహితుడు రాముది. అక్కడ నిన్ను చూసి, ఇప్పుడే నాకు ఫోన్‌ చేసి చెప్పాడు’ అని అన్నారు వాళ్ల నాన్న. ‘నన్ను క్షమించండి నాన్నా! ఇంకెప్పుడూ ఒక్కడినే బయటకు వెళ్లను’ దీనంగా అన్నాడు సరీన్‌. ‘ఇప్పటికైనా తప్పేంటో తెలుసుకున్నావు కదా. ఇక జాగ్రత్తగా ఉండు’ అని చెప్పారాయన. ‘నాకు కుక్కపిల్లని చూడాలని ఉంది నాన్నా.. వెళదాం!’ అన్నాడా అబ్బాయి. ‘గాయం చిన్నదే.. కట్టు కట్టించానని రాము అన్నాడు. అయినా సరే వెళ్లి చూసొద్దాం పద’ అని నాన్న అనడంతో ఇద్దరూ కలిసి బయలుదేరారు. 

కె.వి.లక్ష్మణరావు


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు