నేనంతే.. అందంగా ఉంటా..!

హాయ్‌ నేస్తాలూ..! ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా..! ఏంటి నేను మాట్లాడుతుంటే, అలా ఆశ్చర్యంగా చూస్తున్నారు? అందంగా చెక్కి, రంగులు వేసినట్లు.. భలే ఉందే అనుకుంటున్నారా.. ఇంతకీ నేనెవరో మీకు తెలియదు కదా.. అందుకే మీకు ఒకసారి పరిచయం చేసుకొని వెళ్దామని ఇలా వచ్చాను.

Published : 18 Dec 2023 00:28 IST

హాయ్‌ నేస్తాలూ..! ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా..! ఏంటి నేను మాట్లాడుతుంటే, అలా ఆశ్చర్యంగా చూస్తున్నారు? అందంగా చెక్కి, రంగులు వేసినట్లు.. భలే ఉందే అనుకుంటున్నారా.. ఇంతకీ నేనెవరో మీకు తెలియదు కదా.. అందుకే మీకు ఒకసారి పరిచయం చేసుకొని వెళ్దామని ఇలా వచ్చాను. వెంటనే వివరాలన్నీ తెలుసుకోవాలనుందా? ఈ కథనం చదివేయండి మరి..!

న్ను ‘వుడ్‌ డక్‌’ అని పిలుస్తారు. నా ఆకారం చెక్కినట్లుగా, అందంగా ఉండటం వల్ల నాకు ఆ పేరు వచ్చింది. నేను ఉత్తర అమెరికాలో పుట్టాను. నా తల మీద ఆకుపచ్చ, నలుపు రంగులు ఉంటాయి. మెడ కింది భాగంలో తెలుపు, బ్రౌన్‌.. రెక్కలు పర్పుల్‌, నలుపు రంగులతో చూపరులను ఆకట్టుకుంటాయి. మొదటిసారి నన్ను చూసిన వాళ్లయితే.. నిజంగానే ఎవరైనా రంగులు వేశారేమో అనుకుంటారు. నా కళ్లు ఎరుపు రంగులో ఉంటాయి. కెనడా, మెక్సికో వంటి దేశాల్లో కూడా కనిపిస్తాను. మీకో విషయం తెలుసా! సముద్ర పక్షుల్లో నేనే అందమైన జీవిని. నేల మీద కూడా ఉంటాను కానీ, సముద్రతీర ప్రాంతాల్లో, చల్లని ప్రదేశాల్లో ఉండటం నాకు బాగా నచ్చుతుంది.

నీటి మీద కూడా నిద్ర..

నేను సముద్రంలో దొరికే చేపలు, ఇతర చిన్నచిన్న జీవులతో పాటు కీటకాలు, విత్తనాలు, పండ్లు కూడా ఇష్టంగా తింటాను. ఇంకో విషయం ఏంటంటే.. నేను నీటి మీద కూడా హాయిగా నిద్రపోగలను. పుట్టినప్పుడు నా రంగు సాధారణంగానే ఉంటుంది. పెరిగే క్రమంలోనే శరీరం రంగుల్లోకి మారుతుంది. నేను జన్మించాక 56 నుంచి 70 రోజుల్లోనే గూడు నుంచి బయటికి వచ్చేస్తాను. ఎవరి మీద ఆధారపడకుండా నా ఆహారాన్ని నేనే సొంతంగా వెతుక్కుంటాను.  

వేగం ఎక్కువే!

మా గుంపుని ‘ఫ్లష్‌ ఆఫ్‌ డక్స్‌’ అని పిలుస్తారు. నేను 50 మీటర్ల ఎత్తు నుంచి కిందకు దూకినా, ఎలాంటి గాయాలు అవ్వవు. ఎందుకంటే.. నా శరీర నిర్మాణం అలాంటిది. గంటకు 89 కిలో మీటర్ల వేగంతో సముద్రంలో ప్రయాణించగలను. నా పొడవు 47 నుంచి 54 సెంటీ మీటర్ల వరకు పెరుగుతుంది. బరువు సుమారు 635 నుంచి 681 గ్రాములు ఉంటుంది. సాధారణంగా అయితే 3 ఏళ్లు, పరిస్థితులన్నీ అనుకూలిస్తే.. 15 సంవత్సరాల వరకు జీవిస్తాను. ఇవీ ఫ్రెండ్స్‌ నా విశేషాలు మీకు నచ్చాయి కదూ..!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు