నూతన సంవత్సరం వస్తోంది కదా!

ఆ రోజు మాధురి టీచర్‌కు ఏడో తరగతి పిల్లలంతా రోజూ కంటే ఉత్సాహంగా కనిపించారు. అదేంటో తెలుసుకోవాలని, ‘పిల్లలూ! అంతా చాలా హుషారుగా ఉన్నారు, ఏంటి విశేషం?’ అని నవ్వుతూ అడిగారు. పిల్లలకు ఆమె అంటే చాలా ఇష్టం.  పిల్లలను ఏమాత్రం విసుక్కోకుండా.. ఎంతో ప్రేమగా మాట్లాడతారు. వాళ్లు కూడా భయపడకుండా ఆమెతో అన్ని విషయాలు చెబుతుంటారు.

Updated : 29 Dec 2023 05:46 IST

ఆ రోజు మాధురి టీచర్‌కు ఏడో తరగతి పిల్లలంతా రోజూ కంటే ఉత్సాహంగా కనిపించారు. అదేంటో తెలుసుకోవాలని, ‘పిల్లలూ! అంతా చాలా హుషారుగా ఉన్నారు, ఏంటి విశేషం?’ అని నవ్వుతూ అడిగారు. పిల్లలకు ఆమె అంటే చాలా ఇష్టం.  పిల్లలను ఏమాత్రం విసుక్కోకుండా.. ఎంతో ప్రేమగా మాట్లాడతారు. వాళ్లు కూడా భయపడకుండా ఆమెతో అన్ని విషయాలు చెబుతుంటారు. అందుకే ఇప్పుడు కూడా వినోద్‌.. ‘కొత్త సంవత్సరం వస్తోంది కదా టీచర్‌!’ అన్నాడు. ‘ఓహో.. కొత్త సంవత్సరం సందర్భంగా వినోద కార్యక్రమాల గురించా ఈ హుషారు?’ అన్నారామె. వినోద కార్యక్రమాలు అనే మాటలో తన పేరు ఉండడంతో సిగ్గుపడ్డాడు వినోద్‌.

‘అవునూ, కొత్త సంవత్సరం సందర్భంగా మీరంతా ఏమేం చేస్తారో చెప్పండి’ అని అడిగారు టీచర్‌. ‘కేక్‌ కట్‌ చేస్తాం’ అని అంతా ఒక్కసారే అన్నారు. ‘ఇంకా ఏం చేస్తారు?’ అని అడిగారామె. ‘టీవీలో ప్రత్యేక కార్యక్రమాలు వస్తాయి కదా, ఎంచక్కా చూస్తాం’ అని ప్రసీద బదులిచ్చింది. ‘మా అపార్ట్‌మెంట్‌లో పార్టీ ఏర్పాటు చేస్తారు. సందడే సందడి’ అన్నాడు చందు. ‘కొత్త సంవత్సరం అంటే కేకులు, పార్టీలు, పాటలు మాత్రమే కాదు. ఆ రోజున కొత్త సంవత్సరంలో మీరు ఏం మంచి పనులు చేయాలనుకుంటున్నారో, ఏ చెడు అలవాట్లు మానేయాలనుకుంటున్నారో, ఏం సాధించాలనుకున్నారో.. వాటి గురించి నిర్ణయాలు తీసుకోవాలి. ఎందుకంటే కాలం చాలా విలువైంది. దాన్ని ఒక పద్ధతి ప్రకారం ఉపయోగించుకుంటే మీరెన్నో విజయాలు సాధించవచ్చు. మరి మీరంతా ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో.. రేపు క్లాసులో నాకు చెప్పాలి’ సరేనా అన్నారు టీచర్‌.

‘అలాగే టీచర్‌’ అని బదులిచ్చారు పిల్లలు. ఇంతలో గంట మోగడంతో టీచర్‌ వెళ్లిపోయారు. పిల్లలంతా టీచర్‌ చెప్పిన విషయమే ఆలోచిస్తూ ఇళ్లకు బయలుదేరారు. మర్నాడు మాధురి టీచర్‌ వచ్చేసరికి అంతా నవ్వుల్లో మునిగి ఉన్నారు. ఆమె అలికిడికి నవ్వులు టక్కున ఆపారు. ‘ఎందుకు అంతగా నవ్వుతున్నారు. నాకూ చెప్పండి’ అని చిరునవ్వుతో అడిగారు టీచర్‌. ‘మరి.. మరి...’ అంటూ సందేహంగా ఆగాడు చందు. ‘చెప్పు పర్వాలేదు’ అన్నారు టీచర్‌.

‘నిన్న మీరు కొత్త సంవత్సరం సందర్భంగా నిర్ణయాల గురించి చెప్పారు కదా. అవన్నీ ఇంట్లో చెప్పాను. చెడ్డ అలవాట్లు మానేసే విషయం వినగానే మా చెల్లి నోట్లో వేలు పెట్టుకోవడం మానేస్తానంది. ఆ సంగతి వీళ్లకు చెప్పాను టీచర్‌’ అని నవ్వు ఆపుకుంటూ అన్నాడు చందు. టీచర్‌ కూడా నవ్వేసి.. ‘మీ చెల్లి చిన్నదైనా తెలివైంది. నోట్లో వేలు పెట్టుకోవడం చెడ్డ అలవాటని తెలుసుకుంది. మానేస్తానంటే మంచిదేగా’ అన్నారు. ఆ తర్వాత పాఠం చెప్పటం మొదలుపెట్టారు. అది కాగానే.. ‘ఇప్పుడు చెప్పండి. మీరంతా కొత్త సంవత్సరం సందర్భంగా ఏయే నిర్ణయాలు తీసుకుంటున్నారు?’ అని అన్నారు టీచర్‌.

‘ఏ రోజు పాఠాలు ఆ రోజు చదువుతాను. అమ్మకు పనుల్లో సాయం చేస్తాను. వస్తువులు చిందరవందరగా పడేయడం మానేస్తాను’ అని చెప్పాడు రవికాంత్‌. ‘చాలా బాగుంది.. వినోద్‌ మరి నువ్వు’ అని అడిగారు టీచర్‌. ‘మొబైల్‌తో ఆడటం మానేస్తాను. జంక్‌ ఫుడ్‌ తినడం తగ్గిస్తాను. నా చేతిరాత బాగుండదు.. కాబట్టి మార్చుకునేందుకు సాధన చేస్తాను’ అని వినోద్‌ చెప్పాడు. ‘గుడ్‌’ అంటూ టీచర్‌ ప్రసీద వంక చూశారు.

తను లేచి.. ‘నాకు పొద్దున్నే లేవాలంటే బద్ధకం ఎక్కువ. ఆలస్యంగా లేచి అమ్మను హడావిడి పెడుతుంటాను. అందుకే ఆ దురలవాటు మానుకుని, కొత్త సంవత్సరంలో రోజూ ఉదయాన్నే త్వరగా లేవాలనుకుంటున్నాను. అలాగే కొత్త సంవత్సరంలో కనీసం పన్నెండు మొక్కలు నాటాలనుకుంటున్నాను. లెక్కల్లో మార్కులు పెరగడానికి, వాటి మీద ఎక్కువ శ్రద్ధ పెట్టాలనుకుంటున్నాను’ అని చెప్పింది. ‘మంచి విషయాలే చెప్పావు’ అని మెచ్చుకున్నారు టీచర్‌. వెంటనే వాసు లేచి.. ‘నేను నా పాకెట్‌ మనీని ఖర్చు చేయకుండా దాచి, పేద పిల్లలకు ఇవ్వాలనుకుంటున్నాను. కొత్త సంవత్సరంలో సైకిల్‌ నేర్చుకోవాలనుకుంటున్నాను. సైన్స్‌ ఎగ్జిబిషన్‌లో పాల్గొని, బహుమతి సాధించాలనుకుంటున్నా’ అని చెప్పాడు.
‘చాలా బాగుంది వాసు’ అని టీచర్‌ అంటుండగానే వందన లేచి నిలబడింది. ‘చెప్పమ్మా’ అనగానే... ‘కొత్త సంవత్సరంలో పుస్తక పఠనం అలవాటు చేసుకుంటా. కథలు, మహనీయుల జీవిత చరిత్రలు చదువుతా. అన్ని విషయాల్లో సమయపాలన పాటిస్తా. ఇంకో విషయం..’ అంటూ ఆగింది. ‘ఏంటో చెప్పు వందనా!’ అన్నారు టీచర్‌. ‘అదీ.. ఈ మధ్య మల్లిక మీద కోపం వచ్చి మాట్లాడటం మానేశా. ఇక నుంచి తనతో కూడా స్నేహంగా ఉంటా’ అని మల్లిక వైపు చూస్తూ అంది. ‘వందనా చాలా మంచి మాట చెప్పావు. అందరూ, అందరితో స్నేహంగా ఉండాలి. ఇక గంట కొట్టే సమయం అవుతోంది. ఒక మాట గుర్తుపెట్టుకోండి.. నిర్ణయాలు తీసుకుని, ఒకటి, రెండు రోజులు మాత్రమే పాటించి వదిలేయకూడదు. వాటిని ఎప్పటికీ అమలు పరిస్తేనే మంచి ఫలితం ఉంటుంది. మీ లోటుపాట్లు ఏమిటో మీకు బాగా తెలుసు. వాటిని దిద్దుకోవడం మీ చేతుల్లో,  చేతల్లో ఉంది. మీరు చెప్పినవన్నీ పాటించాలి... సరేనా’ అన్నారు టీచర్‌. ‘తప్పకుండా పాటిస్తాం టీచర్‌’ అని అంతా అంటూ ఉండగానే ఇంటి గంట మోగింది.      

జె.శ్యామల


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని