సింహం.. ఓ బుజ్జిమేక..!

ఒకరోజు బుజ్జిమేక పచ్చటి ఆకులు మేస్తూ.. మేస్తూ.. భువనగిరి గుట్ట పైకి ఎక్కింది. మేఘాలు దాన్ని తాకుతూ వెళ్లడంతో చాలా సంతోషించింది. ఎంచక్కా మేఘాలతో ఆడుతూ, గంతులేస్తూ అక్కడే ఉండిపోయింది.

Updated : 31 Dec 2023 05:44 IST

ఒకరోజు బుజ్జిమేక పచ్చటి ఆకులు మేస్తూ.. మేస్తూ.. భువనగిరి గుట్ట పైకి ఎక్కింది. మేఘాలు దాన్ని తాకుతూ వెళ్లడంతో చాలా సంతోషించింది. ఎంచక్కా మేఘాలతో ఆడుతూ, గంతులేస్తూ అక్కడే ఉండిపోయింది. కొద్దిసేపటి తర్వాత చుట్టూరా చూసింది. దానితో కలిసి వచ్చిన మేకలేవీ కనిపించలేదు. దాంతో ‘మే.. మే..’ అంటూ భయం భయంగా అరవసాగిందా బుజ్జిమేక.

అక్కడి నుంచి కిందకు దిగేందుకు వెనకకు తిరిగింది. కానీ ఎటువైపు వెళ్లాలో దానికి తెలియలేదు. చుట్టుపక్కల అన్నీ చెట్లు, గుట్టలే ఉండటంతో వచ్చిన దారి కూడా మర్చిపోయింది. అలా నడుస్తూ.. నడుస్తూ అడవి మధ్యలోకి చేరుకుంది. అప్పటికే చీకటి పడింది. అక్కడ చెట్ల మీద ఉండే పక్షులన్నీ నిద్రలోకి జారుకున్నాయి. ఆ బుజ్జిమేక అరుపులకు, వెంటనే వాటికి మెలకువ వచ్చింది.

 ఏంటా అని ఓ చిలుక మెల్లగా గూటిలో నుంచి లేచి చూసింది. అప్పుడు దానికి భయంతో వణికిపోతున్న బుజ్జిమేక కనిపించింది. రివ్వున ఎగురుతూ.. కిందికి వచ్చి దాని ఎదురుగా వాలింది. దీంతో బుజ్జిమేక మరింత భయపడింది. ‘భయపడకు మిత్రమా! నిన్నేమీ అనను. ఇంతకీ ఎవరు నువ్వు? ఇక్కడికి ఎలా వచ్చావు?’ అని ఆరా తీస్తూ అడిగింది చిలుక.

 ‘మేత కోసం మా అమ్మ, ఇంకా నా స్నేహితులతో కలిసి వచ్చాను. మేఘాలు అందంగా కనిపించడంతో వాటిని చూస్తూ.. గుట్ట పైకి ఎక్కాను. కాసేపటికి వెనక్కి తిరిగి చూస్తే కానీ అర్థం కాలేదు నేను తప్పిపోయానని. తిరిగి వెళ్లడానికి దారి వెతుక్కుంటూ ఇలా వచ్చాను’ అని విషయమంతా వివరించిందా మేక.
అవునా..! నువ్వేం భయపడకులే. ఈ అడవిలో నీకు ఎలాంటి ప్రమాదం ఉండదు. ఈ రాత్రి నేను నీకు తోడుగా ఉంటాను’ అని ధైర్యం చెప్పింది చిలుక. దాంతో బుజ్జిమేక మనసు కాస్త కుదుటపడింది. అక్కడే పొదల మాటున ఉన్న నక్క దాన్ని చూసింది. వెంటనే పరుగున మృగరాజు సింహం వద్దకు వెళ్లింది. ఆయాసపడుతూ.. వచ్చిన నక్కను చూసిన సింహం.. ‘ఎందుకంతలా పరిగెత్తుకుంటూ వస్తున్నావు’ అని అడిగింది. ‘మృగరాజా..! చిలుక ఉండే మర్రిచెట్టు కింద ఒక బుజ్జిమేక ఉంది. ఈరోజు మీకు లేలేత ఆహారం దొరికినట్లే!’ అని ఉత్సాహంగా చెప్పింది నక్క. అలాగా.. అడవిలోకి ఏ కొత్త జంతువు వచ్చినా నాకు తెలియజేయాలని అన్ని జీవులకు చెప్పాను కదా.. మరి చిలుక మర్చిపోయిందా? వెంటనే వెళ్లి, ఆ మేకతో పాటు చిలుకను కూడా నా దగ్గరకు తీసుకురా’ అని చెప్పింది సింహం.
అది చెప్పినట్లుగానే కొద్దిసేపటి తర్వాత బుజ్జిమేక, చిలుకను వెంటబెట్టుకుని వచ్చింది నక్క. గుహ బయట నిలబడి కోపంగా చూస్తున్న.. సింహాన్ని చూసి గజగజా వణికిపోయింది మేక. నక్క మాత్రం ఇప్పుడు మృగరాజు దీన్ని తినేస్తుంది. మిగిలిన మాంసం నేను తినేయొచ్చు. ఈరోజు నాకు కమ్మని విందు దొరికింది’ అని మనసులోనే సంబర పడిపోయింది.
ఆ మృగరాజు నక్క వైపు తిరిగి ‘చూడు.. ఈ రాత్రికి ఇక్కడే కాపలాగా ఉండు. ఉదయాన్నే చిలుకతో కలిసి వెళ్లి, బుజ్జిమేకను భువనగిరి గుట్ట వద్ద వదిలిపెట్టిరా!’ అంది. ‘అదేంటి మృగరాజా!’ అని ఆశ్చర్యపోతూ అడిగింది నక్క. ‘అసహాయతతో, ఒంటరిగా ఉన్న వాటిని వేటాడటం ధర్మం కాదు. పైగా అది చిన్నపిల్ల. ఎక్కడి నుంచో తప్పిపోయి వచ్చింది. ఆపదలో ఉన్న దానికి ప్రస్తుతం ఆశ్రయం ఇవ్వాలి. ఇది మన అడవిలో పెట్టుకున్న నియమం.. మర్చిపోయావా?’ అంది సింహం. ‘క్షమించండి మృగరాజా! నాకు ఆ విషయం గుర్తులేదు’ అని బదులిచ్చిన నక్క.. ఆ రాత్రి బుజ్జిమేకకు కాపలా కాసింది. తెల్లవారగానే.. నక్క, చిలుక రెండు బుజ్జిమేకను తీసుకెళ్లి, భువనగిరి గుట్ట దగ్గర ఉన్న మేకల గుంపులో వదిలిపెట్టాయి. రాత్రి నుంచి బుజ్జిమేక కోసం వెతుకుతున్న తల్లిమేక.. దాన్ని చూసి చాలా సంతోషించింది. జరిగిన సంగతినంతా తల్లికి వివరించింది బుజ్జిమేక. దాని బిడ్డను క్షేమంగా పంపించిన మృగరాజుకు మనసులోనే కృతజ్ఞతలు చెప్పుకుందా తల్లిమేక.
ముక్కామల జానకీరామ్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని