శాంతి సందేశం..!

విజయవనాన్ని సువర్ణముఖి అనే సింహం పరిపాలిస్తోంది. ఒకరోజు అడవిలోని జీవులన్నింటితో అత్యవసర సమావేశం ఏర్పాటు చేసింది. మృగరాజు పిలుపుతో అక్కడ జీవించే.. నక్క, తోడేలు, ఏనుగు, దుప్పి, జింక, ఎలుగుబంటి, కుందేలు మొదలైన జీవులన్నీ వచ్చాయి.

Updated : 03 Jan 2024 05:38 IST

విజయవనాన్ని సువర్ణముఖి అనే సింహం పరిపాలిస్తోంది. ఒకరోజు అడవిలోని జీవులన్నింటితో అత్యవసర సమావేశం ఏర్పాటు చేసింది. మృగరాజు పిలుపుతో అక్కడ జీవించే.. నక్క, తోడేలు, ఏనుగు, దుప్పి, జింక, ఎలుగుబంటి, కుందేలు మొదలైన జీవులన్నీ వచ్చాయి. ఈ అత్యవసర సమావేశానికి కారణం తెలియక.. జంతువులన్నీ కంగారుపడుతూ గుసగుసలాడసాగాయి.

అప్పుడే మృగరాజు రావడంతో అవన్నీ మాటలు ఆపేసి, దానివైపు చూశాయి. ‘సమావేశానికి వచ్చిన జీవులన్నింటికీ స్వాగతం. కూర్చోండి’ అని చెప్పిందది. దాంతో అవన్నీ అక్కడున్న రాళ్ల మీద కూర్చున్నాయి. ఇక మృగరాజు ఆ జంతువుల వైపు చూస్తూ.. ‘నెల రోజులకొకసారి మనమంతా కలుస్తామని అందరికీ తెలిసిందే. కానీ, అనుకోని సమస్య వచ్చినందుకు, ఇలా అత్యవసర సమావేశం పెట్టాల్సి వచ్చింది’ అని అంది.

 దాంతో భయంగా ‘ఏంటా సమస్య.. మృగరాజా?’ అని అడిగింది నక్క. ‘మన పక్క అడవికి రాజైన వికాలుడు, మన మీదకు యుద్ధానికి వచ్చేలా ఉన్నాడని తెలిసింది’ అని చెప్పిందది. ‘అదేంటి? మీకు, వికాలునికి మధ్య మంచి స్నేహం ఉంది కదా.. మృగరాజా!’ అని శాంతి అనే కుందేలు ఆశ్చర్యంగా చూస్తూ ప్రశ్నించింది.

 ‘అది నిజమే.. కానీ యుద్ధం అంటూ ప్రకటించాక, శతృత్వమే తప్ప స్నేహం ఉండదుగా. సమస్య మీ ముందు ఉంచాను. దీనిపై మీ అభిప్రాయం ఏంటి? ఎలా స్పందిస్తే బాగుంటుందో మీరూ చెప్పండి’ అని అంది మృగరాజు. ‘ఏముంది? యుద్ధానికి సిద్ధం అవ్వడమే.. పక్క అడవి రాజుతో పోరాటానికి దిగుదాం. గెలిచి చూపిద్దాం’ అంటూ నక్క తన ఆలోచన తెలియజేసింది. ‘నువ్వేమంటావు?’ అని ఎలుగుబంటిని అడగగానే.. ‘నక్క మాటే, నా మాట’ అని గర్వంగా బదులిచ్చింది. ‘నా కొమ్ముల వాడి చూపిస్తాను’ అని హుషారుగా చెప్పింది దుప్పి. ‘నా తొండాన్ని ఆయుధంగా చేస్తాను. ప్రత్యర్థులను భయపెడతాను’ అని ఏనుగు దాని తొండం తిప్పుతూ అంది. ఇలా అన్నీ జంతువులు వాటి అభిప్రాయాలు చెబుతున్నాయి.
మృగరాజు ఏమీ మాట్లాడకుండా మౌనంగా కూర్చున్న శాంతిని ‘ఇక్కడున్న జీవులన్నీ వాటికి అనిపించింది చెబుతుంటే, నువ్వు మాత్రం ఏం చెప్పడం లేదేంటి?’ అని ఆశ్చర్యంగా అడిగింది. అప్పుడు అది బదులిస్తూ.. ‘నిన్నమొన్నటి వరకూ మీతో స్నేహంగా ఉన్న వికాలుడు, ఒక్కసారిగా యుద్ధం ప్రకటించాడంటే.. ఆ అడవిలో జీవుల కంటే బలహీనంగా ఉన్నామని గ్రహించినట్లు అనిపిస్తోంది. మన బలహీనతలు బాగా తెలుసని అనుమానంగా ఉంది. మృగరాజా! బలహీనులకు బంధువులుండరు. మనం ఇప్పుడు యుద్ధానికి దిగితే గెలవడం అంత సులభం కాదు. అయినా, కయ్యానికి కాలు దువ్వితే.. ఎవరు గెలిచినా.. ఇరువైపులా ప్రాణ నష్టం తప్పదు. అదే ఈ ఆలోచన విరమించుకొని చేయీ, చేయీ కలిపితే స్నేహం బలపడుతుంది. శత్రువు నుంచి కూడా సహకారం లభిస్తుంది. మీరు అనుమతిస్తే వికాలుడి దగ్గరకు వెళ్లి, యుద్ధం వల్ల వచ్చే నష్టాలను వివరిస్తాను. మంచి మాటలు శత్రువును కూడా మార్చగలవు’ అని వివరించింది.
శాంతి మాటలు విన్న మృగరాజు వెంటనే లేచి నిలబడి.. ‘మన అడవికి మంత్రిగా ఉన్న కోతికి వయసు మీద పడటంతో ఆ పదవి నుంచి తప్పుకుంటానని చెప్పింది. పిలిచి పదవి ఇస్తానంటే.. అన్నీ జంతువులు ముందుకొస్తారు. కానీ పరీక్ష పెడితే అర్హత ఉన్నవాళ్లే విజయం సాధిస్తారు. రాజు కంటే.. ముందు చూపుతో మంత్రి ఆలోచించగలగాలి. అవసరమైతే, ఎత్తుకు పై ఎత్తులు వేయాలి. అందుకే మీ అందరికీ ఈ పరీక్ష పెట్టాను. మీ ఆలోచనలు తెలుసుకోవడానికి యుద్ధం జరగబోతుందని హెచ్చరించాను. ఇంకో విషయం ఏంటంటే.. వికాలుడికి, నాకు స్నేహం ఇప్పటికీ అలాగే ఉంది. యుద్ధం వద్దని, శాంతంగా ఉండడమే మంచిదని శాంతి చెప్పిన సందేశం నాకు బాగా నచ్చింది. అడవికి ఎలాంటి ప్రమాదం జరగకుండా ఉండాలంటే.. ఇలాంటి ఆలోచనలు ఉన్న కుందేలు మంత్రి పదవిలో ఉండటం ఎంతో అవసరం. నేను పెట్టిన పరీక్షలో ఈ శాంతి నెగ్గింది. అందుకే ఈ రోజు నుంచి మన అడవికి మంత్రిగా శాంతిని ప్రకటిస్తున్నాను’ అంది. ఆ మాటతో, మంత్రి కోతితో సహా అక్కడున్న జీవులన్నీ కుందేలు వైపు మెచ్చుకోలుగా చూస్తూ.. దాన్ని అభినందిస్తూ చప్పట్లు కొట్టాయి.  
కె.వి. లక్ష్మణరావు


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని