మృగరాజు నేర్పిన గుణపాఠం..!

అనగనగా ఒక అడవి. దానికి సింహం మృగరాజుగా ఉండేది. దాని దగ్గర గాడిద పని చేస్తుండేది. ప్రతి చిన్న అవసరానికి మృగరాజు దాన్నే పిలిచేది. అందువల్ల గాడిద ఎప్పుడూ సింహం వెనకాలే ఉండేది.

Updated : 07 Jan 2024 05:00 IST

అనగనగా ఒక అడవి. దానికి సింహం మృగరాజుగా ఉండేది. దాని దగ్గర గాడిద పని చేస్తుండేది. ప్రతి చిన్న అవసరానికి మృగరాజు దాన్నే పిలిచేది. అందువల్ల గాడిద ఎప్పుడూ సింహం వెనకాలే ఉండేది. దానికి కూడా మనసులో గాడిదపై అభిమానం ఉండేది. అందుకే వెనకాల వస్తే.. ఇతర జంతువులు దాని మీద దాడి చేస్తాయేమోనని.. ఎక్కడికి వెళ్లినా గాడిదనే ముందు నడవమని చెప్పేది సింహం. ఆ రెండూ అడవిలో నడుచుకుంటూ వెళ్తుంటే.. మిగతా జీవులన్నీ భయపడి దూరంగా వెళ్లేవి. కొన్నేమో.. వినయంగా పక్కకు తప్పుకునేవి. ఇదంతా చూస్తున్న గాడిద అన్ని ప్రాణులూ.. తన రూపాన్ని చూసి భయపడుతున్నాయని భ్రమ పడేది.

ఎప్పటిలాగే రెండూ కలిసి అడవిలో వెళ్తుండగా.. వాటికి తోడేళ్ల గుంపు కనిపించింది. అవి వాటి పనిలో పడి సింహం, గాడిదల రాకను గమనించలేదు. కానీ.. అవి దాన్ని చూసి కూడా భయపడలేదని అనుకున్న గాడిదకు ఒక్కసారిగా కోపం వచ్చింది. ఎలాగైనా వాటి సంగతి తేల్చేయాలని నిర్ణయించుకుంది. కావాలని తోడేళ్లకు వినిపించేలా.. గట్టిగా ఓండ్ర పెట్టింది. ఆ అరుపులు విన్న తోడేళ్లు ఇటువైపు చూసి, వెంటనే అక్కడి నుంచి పారిపోయాయి. అప్పుడు గానీ గాడిదకు మనసు కుదుటపడలేదు. అది చూసిన సింహం, ‘ఎందుకంత గట్టిగా అరుస్తున్నావు? ఏం జరిగింది?’ అని అడిగింది. ఆ మాటలకు.. ‘మీరు నా ధైర్యాన్ని చూడలేదు కదూ... నేను ఒక్క అరుపు అరిచేసరికి, భయంతో తోడేళ్ల గుంపు ఇక్కడి నుంచి దూరంగా పారిపోయింది. లేకపోతే.. నేను వాటిని తినేసేదాన్ని’ అని గర్వంగా అంది. దాని మాటలు విన్న సింహం చిన్నగా నవ్వి.. ‘అయ్యో..! ఇది ఇంత అమాయకురాలా? అది ముందు నడవడం వల్ల ఇన్ని రోజులు జంతువులన్నీ దాన్ని చూసే భయపడి పారిపోయాయని అనుకుంటోంది. ఈ రోజు తోడేళ్ల గుంపు కూడా అందుకే వెళ్లిపోయిందని అపోహపడుతుంది. దాని వెనక ఉన్న నన్ను చూసి అవి పరుగులు తీస్తున్నాయని ఇంకా తెలియనట్లుంది. ఇప్పుడే దానికి విషయం చెబితే బాధ పడుతుంది. కాబట్టి సమయం చూసుకొని అర్థమయ్యే విధంగా చెప్పాలి’ అని మనసులోనే అనుకుంది.

 మరుసటిరోజు సింహం, గాడిద అడవిలో నడుచుకుంటూ వెళ్తున్నాయి. కొంతదూరంలో సింహానికి నక్కల గుంపు కనిపించింది. గాడిదకు విషయం తెలియజేయడానికి ఇదే సరైన సమయం అనుకుందా.. మృగరాజు. నక్కల గుంపు వాటిని చూడకముందే.. సింహం మెల్లగా నడుస్తూ.. పొద చాటుకు వెళ్లి దాక్కుంది. అది గమనించని గాడిద ముందు నడుస్తూ.. దాని ఉనికి తెలియాలని గట్టిగా ఓండ్ర పెట్టింది. ఆ అరుపులు విన్న నక్కల గుంపు ముందు భయపడింది. కానీ దాని వెనక సింహం లేకపోవడంతో.. ఇన్నాళ్లు వాటిని కావాలని భయపెడుతున్న గాడిదకు బుద్ధి చెప్పాలనుకున్నాయి. అన్నీ కలిసి ఒక్కసారిగా గాడిద మీద దాడి చేశాయి. ఊహించని ఆ పరిణామంతో బెదిరిపోయిన గాడిద భయంతో ఓండ్ర పెట్టసాగింది. ఒక్క క్షణం ఆలస్యమైతే అవి దాన్ని చీల్చేసేవే. పరిస్థితిని గమనించిన సింహం పొదల చాటు నుంచి బయటకు వచ్చింది. దాన్ని చూసి భయపడిన నక్కలు పరుగులు తీశాయి.

 హమ్మయ్యా..! బతికిపోయాను అనుకుంటూ.. గాడిద మృగరాజు దగ్గరకు వచ్చి కూలబడింది. అది కాస్త స్థిమిత పడ్డాక.. సింహం దాన్ని లేపి ‘నేను వచ్చాను కదా ఇక నీకు ఏ భయం లేదులే. కానీ, ఒక విషయం చెబుతాను విను. ఇన్ని రోజులు అడవి జంతువులు నీకు భయపడి పారిపోతున్నాయని, అపోహపడ్డావు. నిజానికి అవి నీ వెనక ఉన్న నన్ను చూసి తప్పుకునేవి. నిన్న తోడేళ్లు కూడా వాటి పనిలో అవి ఉన్నాయి.. నువ్వు రెచ్చగొడితే నన్ను చూసి పారిపోయాయి. అది చూసి వాటి వెంట పడబోయావు. నీకు ఈ విషయం చెప్పాలనే నక్కల గుంపు దగ్గరకు నిన్ను ఒంటరిగా వదిలాను. అవే.. తోడేళ్లయితే ఈ పాటికి నిన్ను చీల్చుకు తినేసేవి. నేను నీ మంచి కోరేదానిగా ఒక సలహా ఇస్తున్నాను విను. అనవసరంగా ఏ జీవుల్నీ భయపెట్టకూడదు. అవి మన చెప్పుచేతల్లో ఉండాలని కోరుకోకూడదు. ఇకనైనా జాగ్రత్తగా ఉండు. నీకు ఏ ఆపదా రాకుండా కాపాడే పూచీ నాది’ అంది. ఆ మాటలకు సరేనంటూ తలూపిన గాడిద.. ఆ రోజు నుంచి ముందు నడుస్తున్నా, వెనకాల సింహం ఉందా లేదా అని ఒకటికి రెండుసార్లు చూసుకుంటూ ఉండేది.
- ఆదిత్య కార్తికేయ


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని