వసంతోత్సవాలు ఎందుకు జరపలేదంటే..!

కౌశంబీని పాలించే కీర్తిసేనుడికి ఏటా వసంతోత్సవాలు జరిపించి, అందులో భాగంగా కవిపండితులను సత్కరించడం అలవాటు. అది ఆనవాయితీగా వస్తోంది. అతడు కూడా స్వయంగా కవి పండితుడే.

Updated : 09 Jan 2024 04:51 IST

కౌశంబీని పాలించే కీర్తిసేనుడికి ఏటా వసంతోత్సవాలు జరిపించి, అందులో భాగంగా కవిపండితులను సత్కరించడం అలవాటు. అది ఆనవాయితీగా వస్తోంది. అతడు కూడా స్వయంగా కవి పండితుడే. అయితే ఆ సంవత్సరం ఆయన ఎందుకనో వసంతోత్సవాలు జరపలేదు. కవి పండితులనూ సత్కరించలేదు. ఇందుకు సంబంధించిన జాబితా ఎప్పుడు విడుదలవుతుందా అని ఎదురుచూస్తున్న కవిపండితులకు నిరాశే మిగిలింది.

రాజు ఆ సంవత్సరం వసంతోత్సవాలు ఏ కారణం వల్ల జరుపలేదో, ఎందుకు తమను సత్కరించడం లేదన్న దానిపై పండితులలో చర్చ మొదలైంది. కొందరు రాణి గారికి అనారోగ్యంగా ఉందేమోనని భావించారు. మరికొందరు రాజుగారికి కవిత్వంపైన ఆసక్తి సన్నగిల్లిందేమోనని అనుకున్నారు. ఇంకొందరు ఏకంగా ఆస్థాన పండితుడి ఇంటికి వెళ్లి.. అందుకు కారణాలను తెలుసుకొని రమ్మని, ఆయన్ను రాజాస్థానానికి పంపించారు.

 వారి ఒత్తిడి భరించలేక ఆ ఆస్థాన పండితుడు రాజాస్థానానికి బయలుదేరాడు. మొట్టమొదట అతడు మంత్రిని కలిసి అందుకు కారణాన్ని అడిగాడు. మంత్రి ఆ విషయం తనకు తెలియదని కవి పండితులైన మీకే తెలియాలని అన్నాడు. అంతేకాదు ఆ సంగతి నేరుగా రాజునే అడగమన్నాడు.

 చేసేది లేక ఆ ఆస్థాన పండితుడు రాజు గారి దగ్గరకు వెళ్లాడు. రాజు అతడిని చూడగానే... ‘పండిత వరేణ్యా! మీరు ఎందుకు వచ్చారో నాకు తెలుసు. దయచేసి ఈ సమయంలో నన్ను విసిగించకండి. నేను ఈ సంవత్సరం వసంతోత్సవాలు నిర్వహించదలుచుకోలేదు. ఎవరినీ కూడా సత్కరించదలుచుకోలేదు. అందుకు కారణం మాత్రం నన్ను అడగకండి’ అని అన్నాడు.
అతడు వెంటనే తిరిగి వచ్చి తోటి పండితులతో... ‘రాజుగారి మనస్సు ఎందుకో ఇప్పుడు బాగాలేదు. అందుకు కారణం కూడా తెలియదు’ అని అన్నాడు. అది విని పండితులందరూ నిరాశ చెందారు. ఇకముందు రాజుగారు ఈ ఆనవాయితీని కొనసాగించరని కొందరు పండితులు వదంతులు కూడా వ్యాప్తి చేశారు. ఇలా ఒక సంవత్సరం గడిచింది.
ఆ సంవత్సరం రాజుగారు వసంతోత్సవాలు జరుపుతూ.. రాజ్యంలో ఉన్న పండితులందర్నీ సత్కరించాలని అనుకుంటున్నానని తీపికబురు అందించాడు. పండితులందరూ ఎంతో సంతోషించి సభకు హాజరయ్యారు. రాజు.. కవి పండితుల సన్మానానికి ముందు మాట్లాడుతూ ‘పండితులారా... గత సంవత్సరం నేను ఎందుకు వసంతోత్సవాలు జరపలేదో, మిమ్మల్ని ఎందుకు సత్కరించలేదోనని మీ అందరి మనసులో సందేహం ఉందని నాకు తెలుసు. అందుకు కారణాన్ని ఇప్పుడు చెబుతున్నాను. ఆ సమయంలో మన పొరుగురాజైన వసంతుడు మన మీద యుద్ధానికి సిద్ధపడ్డాడు. అతడు మన రాజ్యం మీద దాడి చేయడానికి సమయం కోసం వేచి ఉన్నాడు. ఆ సమయంలో ప్రజల రక్షణ గురించి నాకు విచారం పట్టుకుంది. అందుకే నేను వసంతోత్సవాలు జరపలేదు. మిమ్మల్ని సత్కరించనూ లేదు. ఆనందంగా ఉన్నప్పుడే ఉత్సవాలు, కవి పండిత గోష్ఠులను జరపాలని నేను అనుకున్నాను. మన కోశాగారంలో ఉన్న ధనాన్ని అంతా రాజ్యంలో సైన్యాన్ని సమకూర్చుకోవడానికి, యుద్ధ సామగ్రి కోసం వెచ్చించాను. అప్పుడే మన రాజ్యంలోని ఒక వృద్ధ పండితుడు గురుపాదుడు వచ్చి నన్ను కలిశారు. నేను ప్రజల భద్రత గురించి దిగులుగా ఉండటం చూసి నాకు ధైర్యం చెప్పి రెండు రాజ్యాలకు యుద్ధం మంచిది కాదని తెలిపారు.  వసంతుడే ముందు దాడికి సన్నద్ధం అయ్యాడనీ, ఆత్మ రక్షణకే నేను యుద్ధానికి సిద్ధమయ్యానని ఆయనకు చెప్పాను. అప్పుడు ఆయన పొరుగు రాజైన వసంతునికి కవిత్వం అంటే చాలా ఇష్టమని, తాను స్వయంగా వెళ్లి తన కవిత్వాన్ని వినిపించి యుద్ధాన్ని ఆపే ప్రయత్నం చేస్తానని నాకు చెప్పారు. గురుపాదుడు వసంతుడి వద్దకు వెళ్లి తన పాండిత్యంతో మెప్పించారు. అతడు గురుపాదుని సత్కరిస్తానంటే తనకు సత్కారం వద్దని చెప్పి, మన రాజ్యం మీద దండయాత్రను ఆపాలని కోరాడు. వసంతుడు అంగీకరించి, యుద్ధాన్ని మానుకుని, మనకు స్నేహహస్తాన్ని అందించాడు. అలా యుద్ధం జరగకుండా ప్రాణనష్టం నివారణకు ఈ గురుపాదుడు తన వంతు కృషి చేశారు. ఆయన్ను నేను సత్కరిస్తానంటే కూడా ఒప్పుకోలేదు. తోటి పండితులను సత్కరించండి చాలు. వారికి లేని సత్కారం తనకెందుకని నాతో అన్నారు. యుద్ధ నివారణకు తోడ్పడిన ఆ గురుపాదుణ్ని ఈ సత్కారానికి ఒప్పించాలి. ఆ బాధ్యత మీదే..’ అని అన్నాడు.
అప్పుడు కవి పండితులు అందరూ గురుపాదుణ్ని సత్కారానికి ఒప్పుకునేటట్లు చేశారు. ఆ తర్వాత రాజు అందరినీ సన్మానించాడు. తనకు జరిగిన సన్మానానికి గురుపాదుడు కృతజ్ఞతలు తెలుపుతూ.. ‘ఈ అవకాశాన్ని ఇచ్చిన కీర్తిసేనునికి, తన మాటలను విన్న వసంతునికి ధన్యవాదాలు’ అన్నాడు. వారిద్దరూ కవి పండితులు కావడం వల్ల తాను అనుకున్నది సాధించానని, రాజులు యుద్ధకాంక్షను వదిలిపెట్టి ప్రజల శ్రేయస్సు, శాంతిని కోరుకోవాలన్నాడు. గురుపాదుని మాటలకు పండితులతో పాటు సభలోని వారందరూ హర్షధ్వానాలు చేశారు.
సంగనభట్ల చిన్న రామకిష్టయ్య


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని