చెకుముకిలోనే చంద్రముఖి!

గౌతమీ గోదావరి పాయల సమీపంలో తరంగిణి అనే అడవి ఉండేది. అందులో అన్ని రకాల పక్షులు నివసించేవి. కాకులు, కొంగల్లాంటి పక్షులు ఉదయాన్నే బయటకు వెళ్లి సాయంత్రానికి తిరిగి చేరుకునేవి. గద్దలు మాత్రం ఒక పక్షం రోజులు అన్నిచోట్లా తిరిగి వచ్చేవి. మిగిలిన చిలుకలు, గోరువంకలు, నెమళ్లు, పావురాలు మాత్రం అక్కడి పండ్లు, గింజలే తింటూ కిలకిలారావాలతో కాలక్షేపం చేసేవి. అవి అస్సలు అడవి దాటి వెళ్లేవి కాదు.

Updated : 11 Jan 2024 03:47 IST

గౌతమీ గోదావరి పాయల సమీపంలో తరంగిణి అనే అడవి ఉండేది. అందులో అన్ని రకాల పక్షులు నివసించేవి. కాకులు, కొంగల్లాంటి పక్షులు ఉదయాన్నే బయటకు వెళ్లి సాయంత్రానికి తిరిగి చేరుకునేవి. గద్దలు మాత్రం ఒక పక్షం రోజులు అన్నిచోట్లా తిరిగి వచ్చేవి. మిగిలిన చిలుకలు, గోరువంకలు, నెమళ్లు, పావురాలు మాత్రం అక్కడి పండ్లు, గింజలే తింటూ కిలకిలారావాలతో కాలక్షేపం చేసేవి. అవి అస్సలు అడవి దాటి వెళ్లేవి కాదు.

ఉదయాన్నే బయటకు వచ్చిన గోరువంక వెంటనే భయంతో మళ్లీ గూటిలోకి వెళ్లింది. ‘గోరువంకా...! ఎందుకు అలా భయపడుతున్నావు’ అంది చిలుక. ‘బయట కొమ్మ మీద...’ అంటూ వణుకుతోందది. ‘ఏమిటి కొమ్మ మీద’ అంటూ గూడు నుంచి బయటకు వచ్చింది చిలుక. అక్కడ ఓ నేరేడు కొమ్మ మీద మెడ అటు ఇటు తిప్పుతూ చూస్తోంది ఓ గుడ్లగూబ. దాని మెడలో వజ్రాలు పొదిగిన నగ ఉంది. దాన్ని చూడగానే చిలుకమ్మ కూడా భయపడింది. ఆ అడవిలో గుడ్లగూబలు లేకపోవడం, ఆ పక్షుల గురించి వాటికి పెద్దగా తెలియకపోవడమే కారణం.

‘ఏయ్‌.. ఎవరు నువ్వు.. కొత్తగా కనిపిస్తున్నావు’ అంది చిలుక కాస్త ధైర్యం చేసి. ‘నాపేరు చెకుముకి. నేనొక గుడ్లగూబను. మా అడవిలో పెద్ద గాలి వాన వస్తే... మేమంతా తలో దిక్కు అయిపోయాం. మా వాళ్లందరూ నా నుంచి విడిపోయారు. ఇక అక్కడ ఉండలేక వాళ్లను వెతుక్కుంటూ తిరుగుతున్నాను’ అంది గుడ్లగూబ.

‘ఇది చెప్పే మాటలకు, తీరుకు అసలు పొంతన లేదు. పైగా మెడలో వజ్రాల గొలుసు ఉంది. దీన్ని చూస్తే కష్టాల్లో ఉన్నట్లు అనిపించడం లేదు’.. అంది అప్పుడే అక్కడికి వచ్చిన పావురం. ‘పోనీలే.. తప్పిపోయి వచ్చాను అంటోంది కదా! వీలుంటే సహాయం చేద్దాం. లేదంటే లేదు’ అంది నెమలి. ‘సహాయమా.. మనమేం చేయగలం’ అంది గోరువంక.

మొదట్లో మిగతా పక్షులు చెకుముకితో మాట్లాడటానికి భయపడినా తర్వాతర్వాత దాంతో స్నేహంగా ఉండటం మొదలుపెట్టాయి. అలా కొంత స్నేహం పెరిగిన తరువాత ఒకరోజు.. ‘ఓ నెమలీ.. నువ్వు పక్షుల్లో రాణిలాంటిదానివి. నీ అందం దేనికీ లేదు. నీ పింఛాలు అబ్బా ఎంత ముచ్చటగా ఉంటాయో కదా! అలాంటి నువ్వు ఇలా పండ్ల గింజలు తిని పెరగటం ఏమిటి. అందువల్లే కొంత నీరసించినట్టు కనబడుతున్నావు. నాతో ఓ రోజు రా.. నేను ఇంతకు ముందున్న అడవికి తీసుకెళ్తాను. మంచి పెసర గింజలు, మినుములు, జొన్నలు తిందువు కానీ, మళ్లీ ఇద్దరం ఇక్కడకు వచ్చేద్దాం’ అంది వినయంగా.

‘అమ్మో .. ఈ అడవి దాటడమా మిగిలిన పక్షులకు మా అక్క నెమలికి తెలిస్తే ఏమన్నా ఉందా! కాకి, గద్ద, కొంగలు తప్ప మిగిలిన పక్షులు ఈ అడవి దాటడం నిషేధం’ అంది నెమలి. అన్నింటికీ చెబుతామా ఏంటి? ఇలా వెళ్లి అలా వచ్చేస్తాం, మనం అసలు వెళ్లినట్టే తెలీదు’ అంది చెకుముకి. ‘కనీసం మా అక్కకైనా చెప్పి వస్తా!’ అంది నెమలి. ‘ఎవరికీ చెప్పక్కరలేదు నువ్వు తినగా మిగిలిన కొన్ని పెసలు, జొన్న కంకులు తీసుకొచ్చి ఇస్తే వాళ్లే సంతోషిస్తారు’ అందది.

అలా నెమలిని దాని మాటలతో మభ్య పెట్టి అడవి దాటించింది గుడ్లగూబ. తరువాత ఏమీ ఎరగనట్టుగా తరంగిణి అడవికి చేరింది. మరుసటి రోజు నెమలి కనిపించక తల్లడిల్లి పోయాయి పక్షులన్నీ. ‘ఏమిటి.. ఏం జరిగింది?’ అంటూ అమాయకంగా అక్కడికి వచ్చింది చెకుముకి. నెమలి కనిపించలేదని అవి చెప్పడంతో అది కూడా బాధ పడినట్లు నటించింది. కొన్ని రోజులు గడిచాక అక్క నెమలిని కలిసింది. నీ చెల్లి కనిపించనప్పటి నుంచి, ఈ అడవి చిన్నబోయింది. నాకు తెలిసి ఆ రాబందే దాన్ని దాచి ఉంటుంది’ అంది. ‘రాబందా.. అదెవరు?’ అంది అక్క నెమలి. ‘నీకు తెలీదా! మన పక్క అడవిలోనే ఉంటుందది. నెమళ్లను పట్టి బంధించడం దానికి ఓ సరదా’ అంది చెకుముకి.

‘మరి మా చెల్లాయిని విడిపించడం ఎలా?’ అని అంది అక్క నెమలి. ‘నాతోపాటు రా.. నేను విడిపిస్తా ..’ అంది గుడ్లగూబ. మరొకరి సహాయం కూడా తీసుకుందాం అందా నెమలి. ‘అలా అలా ఈ మాట రాబందుకు తెలిస్తే మీ చెల్లికి ప్రమాదం’ అంది చెకుముకి. అలా అక్క నెమలిని కూడా అడవి దాటించింది. ఎవరికీ చెప్పకుండా నెమలిని ఎక్కడి తీసుకు వెళుతుందో అనుకుంటూ వెనుకగా అనుసరించింది చిలుక. అడవి దాటేదాకా అనుసరించి, ఇక ముందుకు వెళితే ప్రమాదం అని వెనక్కు వచ్చి మిగిలిన పక్షులను పిలిచి విషయం చెప్పింది.

ఎక్కడెక్కడో తిరిగి వచ్చిన ఓ గద్ద.. ‘ఏం జరిగింది’ అని అడిగింది. జరిగిందంతా చెప్పాయి పక్షులు. ‘ఓహో.. ఆ చంద్రముఖి... చెకుముకి మన అడవికి కూడా వచ్చిందన్న మాట’ అంది. ‘అది నీకు ముందే తెలుసా’ అంది చిలుక. ‘ఆ విషయం చెప్పి మన నెమళ్లను హెచ్చరిద్దామనే నేను వెళ్లి ఇంకా పక్షం రోజులు కాకుండానే వచ్చేశాను. కానీ ఇప్పటికే అనర్థం జరిగిపోయింది. ఆ చెకుముకి ఓ మాటు పిట్ట. ఒక వేటగాడు దాన్ని పెంచి ఇలా నెమళ్లను మభ్య పెట్టి వాడి దగ్గరకి తీసుకెళ్లేలా శిక్షణ ఇచ్చాడు. అప్పటి నుంచి అది ప్రతి అడవీ తిరిగి నెమళ్లను మోసగించి అతడి దగ్గరకు చేరుస్తుంది. వాడు వాటిని నగరానికి తీసుకెళ్లి, అమ్మి సొమ్ము చేసుకుంటాడు. రెండో నెమలి నిన్ననే వెళ్లింది అంటున్నారు కదా! వాడు ఆ అడవి దాటకుండానే, వాటిని విడిపిద్దాం’ అంటూ కొన్ని పక్షులను తీసుకుని అటు వైపు ఎగిరింది గద్ద. వేటగాడు ఓ చోట చెట్టు కింద నిద్రపోతూ కనిపించాడు. వాడి పక్కనే బంధించి ఉన్న నెమళ్లు, వాటి పక్కగా పంజరంలో నిద్రపోతున్న గుడ్లగూబా కనిపించాయి. ఒక్కసారిగా గద్ద, కొంగ, కాకి వేటగాడి మీద దాడి చేశాయి. గద్ద వాడి కళ్లు పొడిచింది. కాకి నెమళ్లను విడిపించింది. ఈ ఆకస్మిక దాడికి భయపడి వేటగాడు పారిపోయాడు. ‘ఓ పక్షుల్లారా మీ ఐకమత్యానికి నా అభినందనలు. నన్ను కూడా ఈ పంజరం నుంచి విడిపించండి. వాడి మాటల మాయలో పడి, చంద్రముఖి ఆవహించినట్లు వాడు చెప్పినట్లే చేశాను. చాలా నెమళ్లను మోసగించాను. నాకు నా తప్పు తెలిసొచ్చింది. ఇక మంచిగా జీవిస్తాను’ అంది చెకుముకి. ముందు వద్దనుకున్నా, తర్వాత దాన్ని కూడా పంజరం నుంచి విడిపించాయి పక్షులు. ‘కొత్తవారిని వెంటనే నమ్మడం మంచిది కాదని, ఇప్పటికైనా తెలుసుకోండి’ అంది పావురం నెమళ్లతో. అంతా కలిసి తరంగిణి అడవికి చేరాయి. అటుగా వెళ్లలేక వాటి వంక చూస్తూ చెకుముకి మరోవైపు ఎగిరిపోయింది.

కూచిమంచి నాగేంద్ర


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు