భీమన్న మారిపోయాడు..!

రామన్న భీమన్నలు అన్నదమ్ములు. వాళ్ల నాన్న చిన్నప్పుడే చనిపోవడంతో.. తల్లే పెంచి పెద్ద చేసింది. రామన్నది చిన్నప్పటి నుంచీ కష్టపడి పనిచేసే తత్వం. బతుకుదెరువు కోసం చిన్నచిన్న పనులు చేసుకుంటూ వచ్చిన డబ్బులతో కుటుంబాన్ని పోషించేవాడు.

Updated : 12 Jan 2024 05:24 IST

రామన్న భీమన్నలు అన్నదమ్ములు. వాళ్ల నాన్న చిన్నప్పుడే చనిపోవడంతో.. తల్లే పెంచి పెద్ద చేసింది. రామన్నది చిన్నప్పటి నుంచీ కష్టపడి పనిచేసే తత్వం. బతుకుదెరువు కోసం చిన్నచిన్న పనులు చేసుకుంటూ వచ్చిన డబ్బులతో కుటుంబాన్ని పోషించేవాడు. కొన్నిరోజులు తనతో పాటుగా తమ్ముడిని కూడా పనులకి తీసుకెళ్లాడు. కానీ భీమన్నకి అన్నలా ఎక్కువగా కష్టపడటం, చాలీచాలని సంపాదన కోసం పని చేయడం ఇష్టంలేదు. తక్కువ కష్టంతో ఎక్కువ డబ్బులు సంపాదించాలన్నది అతని కోరిక. దాంతో ఒకరోజు.. ‘అన్నయ్యా.. నేను నీతో ఇక పనికి రాలేను. నాకు నచ్చిన పని వేరే ఏదైనా చేసుకుంటాను’ అన్నాడు భీమన్న. తమ్ముడి ఆలోచనను కాదనలేక.. రామన్న కూడా ‘అలాగే నీకు నచ్చిన పని చేసుకో జాగ్రత్త!’ అని చెప్పాడు. ఇక భీమన్న ఏ పని చేసైనా సరే.. అధిక మొత్తంలో డబ్బు సంపాదించాలని నిర్ణయించుకున్నాడు.

తక్కువ కష్టంతో డబ్బులు బాగా వచ్చే పని ఏముంటుందని చాలా ఆలోచించాడు భీమన్న. వెంటనే అతని మనసులో ఒక ఆలోచన తట్టింది. వాళ్లు నివసించే గ్రామం పక్కనే ఒక చిన్న అడవి ఉంది. అక్కడే ఎక్కువ డబ్బు సంపాదించే అవకాశం ఉందని భావించాడు. ఆ చోటుకి వెళ్లి, సాయంత్రం వరకు పని చేసి డబ్బులు తీసుకొని ఇంటికి వెళ్లాడు. అది చూసిన అతని తల్లీ, అన్నయ్య చాలా సంతోషించారు. ఆ రోజు నుంచి భీమన్న అదే పని చేస్తున్నాడు. కానీ తను చేస్తున్న పని ఇంట్లో వాళ్లకి తెలియదు. ఒకరోజు రామన్న.. ‘ఇంత డబ్బు అసలు ఏ పని చేసి సంపాదిస్తున్నావు?’ అని భీమన్నని అడిగాడు. దాంతో అతడు ‘మన ఊరి పక్కనున్న అడవిలో చెట్లు కొట్టి, వాటిని అమ్మి సొమ్ము చేసుకుంటున్నాను’ అని జవాబిచ్చాడు. ఆ మాటలు విన్న భీమన్న తల్లి.. ‘మనం బతకడం కోసం పచ్చని చెట్లను నరకడం మంచి పద్ధతి కాదు. అది మానవాళికి చాలా నష్టం చేస్తుంది. ప్రకృతి పాడైపోవడానికి దారి తీస్తుంది. నువ్వు ఇక ఈ పని చేయడం మానెయ్యి. ఇంకా వేరే ఏదైనా చూసుకో’ అని చెప్పింది. కానీ అతడు దానికి ఏమాత్రం అంగీకరించలేదు. నేను ఆ పని తప్ప, మరేది చేయనని గట్టిగా చేప్పేశాడు. అతని ప్రవర్తనకు రామన్న, వాళ్లమ్మ ఇద్దరూ చాలా బాధపడ్డారు. ఇక చేసేదేం లేక తనకి చెప్పడం కూడా మానేశారు.

ఒకరోజు భీమన్న ఎప్పటిలాగే అడవికి వెళ్లాడు. మధ్యాహ్నం వరకు కొన్ని చెట్లు నరికి, మోపులుగా కట్టాడు. మరో చెట్టును కొట్టడం ప్రారంభించాడు. ఆ చెట్టు పక్కనే చిన్న ఏరు ప్రవహిస్తుంది. దాని అంచునే ఈ చెట్టు ఉండటంతో.. నరుకుతుండగానే అది ఒక్కసారిగా విరిగి భీమన్న మీద పడబోయింది. దాని నుంచి తప్పించుకొని, కంగారులో ఏరులో పడిపోయాడతను. ఆ క్షణం ఏం చేయాలో తోచలేదు. ‘కాపాడండి.. కాపాడండి..!’ అని అరిచాడు. తనకు ఈత రాకపోడంతో ప్రవాహంలో కొట్టుకుపోసాగాడు. ఆ సమయంలో అక్కడ భీమన్న తప్ప మరెవ్వరూ లేరు. ఇక చనిపోతానేమోనని భయపడసాగాడు. అప్పుడే అతనికి కాస్త దూరంలో అదే ఏటి ఒడ్డున నీటిలోకి వంగి ఉన్న ఒక చెట్టుకొమ్మ కనిపించింది. అది చూడగానే అతనికి ప్రాణం మీద ఆశ కలిగింది. ప్రవాహంలో అక్కడి వరకు వెళ్లగానే.. టక్కున కొమ్మను పట్టుకుని, మెల్లగా పైకి ఎక్కాడు. మొత్తానికి చెట్టు సాయంతో తను ప్రాణాలతో బయటపడ్డాడు. అప్పుడే అతనిలో ఒక ఆలోచన మొదలైంది. ‘నా మూర్ఖత్వంతో అమ్మ, అన్నయ్య ఎంత చెప్పినా వినలేదు. చాలా చెట్లను నరికేశాను. ఇప్పుడు ఈ చెట్టే లేకపోతే నేను ప్రాణాలతో బయటపడేవాడినే కాదు. ధనం కోసం ఆశపడి చేయకూడని తప్పు చేశాను’ అని చాలా బాధపడ్డాడు భీమన్న. ఇంటికెళ్లి విషయాన్ని వివరించాడు. ఆ రోజు నుంచి అతనిలో మార్పు వచ్చింది. చెట్లను నరకడం మానేసి.. వేరే పని చేసుకోసాగాడు.

నంద త్రినాథరావు


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని