ఘటమయ్య సమయస్ఫూర్తి..!

పారిజాత రాజ్యానికి రాజు విజయుడు. ప్రజలందరికీ అందుబాటులో ఉంటూ.. ప్రతి సమస్యకీ మార్గం చూపేవాడు. దాంతో విజయుడు అంటే ఆ రాజ్య ప్రజలందరికీ అమితమైన గౌరవం ఉండేది. మందార రాజ్యానికి రాజు ముకులుడు.

Updated : 20 Jan 2024 03:31 IST

పారిజాత రాజ్యానికి రాజు విజయుడు. ప్రజలందరికీ అందుబాటులో ఉంటూ.. ప్రతి సమస్యకీ మార్గం చూపేవాడు. దాంతో విజయుడు అంటే ఆ రాజ్య ప్రజలందరికీ అమితమైన గౌరవం ఉండేది. మందార రాజ్యానికి రాజు ముకులుడు. అతడు ఇప్పటి వరకు చాలా రాజ్యాలను ఒంటి చేత్తో జయించాడు. అంతటి వీరుడిపైన విజయుడు గెలుపొందాడు. దాంతో అతనిలో గర్వం పెరిగింది. అప్పటి నుంచి విజయుడు రాజ భవనం నుంచి బయటకు రావడం మానేశాడు. ప్రజల సమస్యలను పెడచెవిన పెట్టసాగాడు. కష్టాలు చెప్పుకోవడానికి వచ్చిన వారిని భటులు ముఖ ద్వారం నుంచే తిప్పి పంపించేవారు. చేసేదేమీ లేక ప్రజలు నిరాశతో వెనుదిరిగేవారు. ఈ విషయం ఆ నోటా ఈ నోటా దోపిడీ దొంగలకు తెలిసింది. వాళ్లు ఇదే అదునుగా భావించారు.

ఒకరోజు అడిమయ్య అనే పశువుల కాపరి మందను మేపడానికి ఓ గుట్టపైకి తీసుకెళ్లాడు. ముసుగులు ధరించి వచ్చిన ఆ దొంగలు అతన్ని బెదిరించి ఆంబోతులను తోలుకెళ్లిపోయారు. వాటిని అంగడిలో అమ్ముకొని సొమ్ము చేసుకున్నారు. ఆ విషయం చెప్పడానికి కోటకు వచ్చిన అడిమయ్యకు నిరాశే ఎదురయ్యింది. ఆ మరుసటి రోజే.. పాపయ్య అనే గొర్ల కాపరి అదే గుట్ట మీదకు గొర్రెలను మేపడానికి వెళ్లాడు. ముందు రోజులాగానే దొంగలు వచ్చి, పొట్టేళ్లను తీసుకెళ్లారు. ఫిర్యాదు చెయ్యడానికి రాజమందిరానికి వెళ్లినా.. ప్రయోజనం లేకుండా పోయింది.

ఇలా క్రమక్రమంగా పారిజాత రాజ్యంలో దొంగతనాలు పెరిగిపోయాయి. ప్రజలంతా భయాందోళనలతో బతుకుతున్నారు. వారి మంచిచెడులు పట్టించుకోకపోవడంతో ఆ ప్రాంత ప్రజలకు రాజు మీద ద్వేషం పెరగసాగింది. ఒకరోజు సాయంత్రం అడిమయ్య, పాపయ్య రచ్చబండ దగ్గర కూర్చొని మాట్లాడుకుంటుండగా.. వాళ్ల స్నేహితుడైన ఘటమయ్య అక్కడికి వచ్చాడు. అతడు కుండలు చేయడంలో నేర్పరి. ఆ చుట్టుపక్కల ప్రజలంతా అతని దగ్గరే కుండలు కొంటారు. మిత్రులను చూసిన ఘటమయ్య.. ‘ఏమైంది మీకు? ఎందుకలా దిగాలుగా ఉన్నారు?’ అని అడిగాడు. దాంతో వాళ్లు జరిగిందంతా వివరించారు. విషయం తెలుసుకున్న అతను.. ‘కొన్ని రోజులు ఓపిక పట్టండి. మీ సమస్యలకే కాదు.. మన రాజ్య ప్రజలందరి సమస్యలకూ పరిష్కారం దొరుకుతుంది’ అని మిత్రులకు హామీ ఇచ్చాడు.

వేసవికాలం రావడంతో కొన్ని మంచి కుండలు తయారుచేసి రాజ భవనానికి పంపించమని ఘటమయ్యకు కబురు పంపాడు విజయుడు. ప్రజలు పడుతున్న ఇబ్బందులు రాజుకు తెలియజేయడానికి ఇదే మంచి సమయం అని భావించాడు ఘటమయ్య. తాను చేసిన ఒక కుండను తీసుకెళ్లి.. రాజు సింహాసనం పక్కన పెట్టి దానిలో నీరు పోసి ఉంచాడు. మూడు రోజుల తర్వాత ఆ కుండ నుంచి ఒక్కొక్క చుక్కగా కారి సింహాసనం కిందకు చేరింది. అది గమనించిన రాజుకు ఆవేశం కట్టలు తెంచుకుంది. వెంటనే ఘటమయ్యను బంధించి తీసుకురమ్మని భటులను ఆజ్ఞాపించాడు. తీసుకొచ్చాక.. ‘కుండలు చేయడంలో నైపుణ్యంగలవాడివని నీకు పని అప్పగిస్తే.. నాసిరకంగా తయారుచేస్తావా?’ అని గద్దించాడు రాజు. ‘మహారాజా! మీరు ఆగ్రహించకండి.. ఆ కుండకు ఉన్నది చిన్న రంధ్రమే. కానీ, మీ సింహాసనాన్ని తడిపేసింది. అది మీకు ఇబ్బందిగా ఉంది. అలాగే మన రాజ్యంలో చిన్నచిన్న సమస్యలే పెద్ద సమస్యలుగా మారాయి. దాంతో ప్రజలంతా భయభ్రాంతులకు గురవుతున్నారు. దోపిడీ దొంగల ఆగడాలు పెరిగాయి. ఈ విషయం మీకు ప్రత్యక్షంగా చూపిద్దామనే.. రంధ్రం ఉన్న కుండను మీ సింహాసనం దగ్గర పెట్టాను. తప్పైతే మన్నించండి’ అన్నాడు ఘటమయ్య. అతని మాటలు విన్న విజయుడు ఆలోచనలో పడ్డాడు. కాసేపటికి.. ‘ఘటమయ్యా! నీ మాటలతో గర్వాన్ని తొలగించి.. నా కళ్లు తెరిపించావు. సమస్యలపై నేను స్పందించకపోవడంతో ప్రజలు పడిన ఇబ్బందులను నాకు తెలియజేశావు. నీ ధైర్యాన్ని అభినందిస్తున్నాను’ అని చెప్పి అతన్ని సన్మానించాడు రాజు. ఇక ఆ రోజు నుంచి విజయుడు ప్రజలందరికీ అందుబాటులో ఉంటూ.. దోపిడీ దొంగలను రాజ్యం నుంచి తరిమికొట్టాడు. సమయస్ఫూర్తితో వ్యవహరించి, దీనంతటికీ కారణమైన ఘటమయ్యను ప్రజలంతా మెచ్చుకున్నారు.

 ముక్కామల జానకీరామ్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని