చంద్రం చెప్పాడు.. నారద దత్తు విన్నాడు!

నాదర్‌గుల్‌ కూడలిలో చలమయ్యది చెరుకురసం అంగడి. ఎద్దును చక్రానికి కట్టి గానుగను తిప్పి రసం తీసేవాడు. చలమయ్య కొడుకు చంద్రం తండ్రికి సహకరించేవాడు. చంద్రం చదువుకున్న వాడు. తెలివైన పేద యువకుడు. తన కొడుకును మంచి కొలువులో చూసుకోవాలనుకునేవాడు చలమయ్య.

Updated : 29 Jan 2024 06:54 IST

నాదర్‌గుల్‌ కూడలిలో చలమయ్యది చెరుకురసం అంగడి. ఎద్దును చక్రానికి కట్టి గానుగను తిప్పి రసం తీసేవాడు. చలమయ్య కొడుకు చంద్రం తండ్రికి సహకరించేవాడు. చంద్రం చదువుకున్న వాడు. తెలివైన పేద యువకుడు. తన కొడుకును మంచి కొలువులో చూసుకోవాలనుకునేవాడు చలమయ్య.

నాదర్‌గుల్‌ జమీందారు నారాయణ దత్తుకు ఒక్కగానొక్క కొడుకు నారద దత్తు. దివాణంలో ఉండక రోజూ చుట్టు పక్కల గ్రామాలు చుట్టొచ్చేవాడు. ఇలా గాలికి తిరగకుండా ఏదైనా వ్యాపారం చేసుకోమని పలుమార్లు చెప్పాడు నారాయణ దత్తు. కానీ నారద దత్తుకు కష్టపడటం ఇష్టం ఉండేది కాదు. తండ్రి సంపాదించిన ఆస్తులున్నాయిగా.. అనుకునేవాడు.

నారద దత్తు చెరుకు రసం తాగటానికి రోజూ చలమయ్య అంగడికి వచ్చేవాడు. అలా చంద్రంతో అతనికి మంచి స్నేహం ఏర్పడింది. చంద్రం చదువుకున్నవాడు, మంచివాడు కావటంతో సొంత విషయాలు కూడా పంచుకునేవాడు నారద దత్తు. ఒక రోజు.. ‘మిత్రమా! నాన్నగారు వ్యాపారం చేయమని పోరు పెడుతున్నారు. మాకు ఇప్పటికే తరగని ఆస్తి ఉంది. కష్టపడి వ్యాపారం చేసి నేను కూడా ధనం సంపాదించాల్సిన అవసరం లేదు. అలాగని నాన్నగారిని బాధ పెట్టటం కూడా ఇష్టంలేదు!’ అన్నాడు నారద దత్తు.

‘మిత్రమా! మీ తండ్రి చెప్పింది నిజమే! కొండంత ఆస్తి కూడా కూర్చొని తింటే ఇట్టే కరిగి పోతుంది. ఉన్న ధనాన్ని వ్యాపారంలో పెట్టి కష్టాన్ని ఇష్టంగా మార్పు చేసుకుని, నువ్వూ ఆస్తిని రెట్టింపు చేసుకోవచ్చు!’ అన్నాడు చంద్రం. నారద దత్తు చెరుకు రసం తాగుతూ ఆలోచిస్తున్నాడు.

‘మిత్రమా! గానుగలో తీసిన చెరుకు రసం తాగటానికి ఇష్టంగా ఉంటుంది. కొంచెం కష్టపడి పాకంగా మార్పు చేసి బెల్లం, పంచదారను తయారు చేయవచ్చు. వాటితో అరిసెలు, లడ్డూలు, బూరెలు... ఇలా రకరకాల తీపి పదార్థాలు చేయవచ్చు. వ్యాపారంలో కూడా మానసికంగా కొంత ఒత్తిడి ఉంటుంది. దాన్ని గానుగలో వేసి చెరుకు గడను నొక్కినట్టు భరిస్తే వచ్చేవి అన్నీ మంచి ఫలితాలే!’ అన్నాడు చంద్రం.

నారద దత్తులో మార్పు వచ్చింది. ఒక మంచిరోజు చూసి వ్యాపారం మొదలు పెట్టాడు. చంద్రాన్ని కొలువులోకి తీసుకుని నిర్వహణ బాధ్యతలు అప్పగించాడు. కొంతకాలానికే వ్యాపారంలో అనేక విజయాలు పొందాడు. కొడుకుల ఎదుగుదలను చూసి నారాయణ దత్తు, చలమయ్య చాలా మురిసిపోయారు.

పైడిమర్రి రామకృష్ణ


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని