మాట నిలబెట్టుకున్న నక్క..!

రామాపురం ఊరి చివర ఒక అడవి ఉంది. ఒకసారి పెద్ద గాలివాన రావడంతో అందులోని చాలా జంతువులు చనిపోయాయి. కొన్నేమో.. సొమ్మసిల్లి పడిపోయాయి. వాటిలో ఒక నక్క కూడా ఉంది. దానికి చాలా గాయాలయ్యాయి.

Updated : 30 Jan 2024 01:22 IST

రామాపురం ఊరి చివర ఒక అడవి ఉంది. ఒకసారి పెద్ద గాలివాన రావడంతో అందులోని చాలా జంతువులు చనిపోయాయి. కొన్నేమో.. సొమ్మసిల్లి పడిపోయాయి. వాటిలో ఒక నక్క కూడా ఉంది. దానికి చాలా గాయాలయ్యాయి. అయినా.. దాని బిడ్డను జాగ్రత్తగా కాపాడుకుని మరో అడవికి వెళ్లిపోయింది. అక్కడికి వెళ్లాక.. ‘నా శరీరానికి చాలా గాయాలు అయ్యాయి. నేను ఎక్కువ సమయం బతకను. కాబట్టి ఇప్పుడే.. నీకు కొన్ని విషయాలు చెప్పాలి. జంతువులన్నీ నన్ను జిత్తులమారి నక్క అని పిలిచేవి. అది నిజమే! పులి తిని వదిలేసే ఆహారం కోసం నేను.. దాని దగ్గర చాలా అబద్ధాలు చెప్పాను. దాంతోనే నా ఆకలి తీర్చుకున్నాను. ఇతర జీవులను మోసం చేసి, పులికి బలి చేశాను. ఆ తప్పు నాకు ఇప్పుడు తెలిసొచ్చింది. కానీ నువ్వు నాలా ఉండకుండా.. వేరే అడవికి వెళ్లి మంచి పేరు తెచ్చుకో. వీలైతే ఇతర జంతువుల ప్రాణాలు రక్షించడానికి ప్రయత్నించు కానీ.. వాటికి మాత్రం ఎలాంటి హాని తలపెట్టకు’ అని బిడ్డకు చెప్పింది. దాంతో ఆ పిల్ల నక్క ‘తప్పకుండా అమ్మా.. నువ్వు చెప్పినట్లే నడుచుకుంటాను’ అంటూ మాటిచ్చింది. ఇదంతా జరిగిన కాసేపటికే కళ్లు మూసిందా తల్లి నక్క. తర్వాత చిన్న నక్క ఏడుస్తూ ఏడుస్తూ.. తల్లి మాటలను గుర్తు చేసుకుంటూ మరో అడవికి చేరుకుంది. అక్కడికి వెళ్లాక.. దానికి అన్నీ సాధు జంతువులు కనిపించాయి. నక్కను చూడగానే అవి దూరందూరంగా వెళ్లసాగాయి. దాంతో అది ‘నేను ఎవ్వరికీ హాని చేయను. నన్ను నమ్మండి!’ అంది. ‘అసలే నక్కలు జిత్తులమారివి. కొంచెం చనువిస్తే చాలు.. మోసం చేసేస్తాయి. అలాంటిది ఇప్పుడు నిన్ను ఒక్కసారిగా అలా ఎలా నమ్మేస్తాం. నీ ప్రవర్తన చూశాకే ఒక నిర్ణయానికి వస్తాం’ అంది అంజి అనే కోతి.

అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత.. ఆ అడవికి ఒక పులి వచ్చింది. అప్పటి వరకు ఎంతో సంతోషంగా ఉన్న జంతువులన్నీ భయపడసాగాయి. నక్క ఆ పులితో జత కట్టింది. ‘మీరు ఈ అడవికి మహారాజుగా ఉండండి. నేను మంత్రిగా ఉంటాను’ అని దానితో అంది నక్క. ఆ మాటలకు సరేనంటూ జవాబిచ్చిన పులి.. ‘నువ్వు జంతువుల ఉనికిని కనిపెడుతూ ఉండు. నేను వాటిని వేటాడతాను’ అంది. ఒకరోజు పులి ముందు నడుస్తుంటే.. దాని వెనకే నక్క కూడా వెళ్లసాగింది. ఒకచోట పచ్చని ఆకులు తింటున్న జింకను చూసి మెల్లగా మాటున దాగింది పులి. అది చూసిన నక్క.. జింకను ఎలాగైనా కాపాడాలని నిర్ణయించుకొని.. ‘రాజా! ఆగండి’ అని గట్టిగా అరిచింది. ఆ అరుపులు విన్న జింక వెంటనే అక్కడి నుంచి పారిపోయింది. దాంతో ‘నీ వల్ల నోటి వరకు వచ్చిన ఆహారం చేజారింది. నేను తినబోతుండగా నీ అరుపులు విని ఆ జింక తప్పించుకుంది’ అని నక్క మీద కోప్పడింది పులి. ‘రాజా! కొన్ని రోజుల క్రితం ఈ చుట్టపక్కల వచ్చిన గాలివాన వల్ల ఎన్నో జంతువులు ప్రాణాలు విడిచాయి. బతికున్న జీవులేమో.. అనేక జబ్బుల బారినపడ్డాయి. కారణం.. అవి ఆకలికి తట్టుకోలేక.. ప్రాణాలు నిలబెట్టుకోవడానికి పిచ్చిగడ్డిని ఆహారంగా తీసుకోవడమే. ఆ వ్యర్థ ఆహారం తిన్న జంతువులను మీరు తింటే.. మీకూ జబ్బు చేస్తుంది. అది ప్రాణాలు పోవడానికి కూడా దారి తీస్తుందని విన్నాను.

ఇందాక పారిపోయిన జింక కూడా జబ్బుతో బాధ పడుతోంది.. అందుకే మీ ప్రాణాలు రక్షించాలని మిమ్మల్ని ఆపాను’ అంది నక్క. ‘ఓ.. అలాగా.. అయితే జబ్బు చేయని జంతువును చూపించు’ అంది పులి. ఈ సంభాషణంతా.. చెట్టు మీద కూర్చున్న అంజి విన్నది. వెంటనే అది మిగతా జీవుల దగ్గరకు వెళ్లి.. ‘కొత్తగా వచ్చిన నక్కను మనం నమ్మొచ్చు’ అని జరిగిన సంఘటన వివరించింది. ‘జింకను కాపాడినట్లు నక్క నాటకం ఆడి ఉంటుంది’ అంది ఎలుగుబంటి. దాంతో అంజి ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయింది. అలా కొన్ని రోజులు గడిచాయి.

‘రాజా! ఇక్కడ ఏ జంతువునూ వేటాడే పరిస్థితి కనిపించడం లేదు. ప్రతి జంతువుకు ఏదో ఒక జబ్బు ఉంది. చివరకు పక్షుల్లో కూడా జబ్బు ఉందని తెలిసింది’ అంది నక్క. ‘మరిప్పుడెలాగ? ఆహారం తిని ఇప్పటికే రెండు రోజులు గడిచింది. నాకు చాలా ఆకలిగా ఉంది’ అంది పులి.  ‘బతికుంటే బలుసాకు తినవచ్చు అనే సామెత మీకు తెలియంది కాదు. కొన్ని ప్రాంతాల్లో భూమిలో దుంపలు ఉన్నాయి. కాళ్లతో ఆ నేలను తవ్వితే అవి బయటపడతాయి. మరికొన్ని చోట్ల పుట్ట గొడుగులు కూడా ఉన్నాయి. అవే మనకు ఆహారం’ అంది నక్క. ‘అయితే ఇప్పుడు ఆహారం కోసం వేటాడటం కాకుండా.. భూమిని తవ్వాలన్నమాట’ అంది పులి. ‘అవును రాజా! ఇక నుంచి.. మీ కష్టం మీది, నా కష్టం నాది’ అంది నక్క. ఇదంతా అక్కడే ఉన్న కొన్ని జంతువులు చూశాయి. అప్పుడు వాటికి నక్క మీద నమ్మకం కలిగింది. అప్పటి నుంచి పులి నేలను తవ్వి దుంపలతో కడుపు నింపుకోసాగింది. ‘మాంసాహారం లాగానే.. ఈ దుంపలు, పుట్టగొడుగులు కూడా చాలా రుచిగా ఉన్నాయి’ అంది పులి. ‘రాజా! తినగ తినగా వేపాకు కూడా రుచిగానే ఉంటుంది’ అంది నక్క. తల్లికి ఇచ్చిన మాట ప్రకారం నక్క అడవిలో మంచి పేరు తెచ్చుకుంది. పులిని కూడా మార్చేసింది. అప్పటి నుంచి ఇక అన్ని జీవులు కలసిమెలసి ఆనందంగా జీవించసాగాయి.  

యు.విజయశేఖర రెడ్డి


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని