అంతా రామయ్య మంచితనం!

అనాథైన రామయ్యను, రంగాపురంలో పాల వ్యాపారం చేసే భీమయ్య చేరదీసి తన వద్ద పనికి పెట్టుకున్నాడు. రోజూ రెండు పూటలా పితికిన పాలను తీసుకెళ్లి సంతలో అమ్ముకొచ్చేవాడు.

Updated : 04 Feb 2024 06:56 IST

అనాథైన రామయ్యను, రంగాపురంలో పాల వ్యాపారం చేసే భీమయ్య చేరదీసి తన వద్ద పనికి పెట్టుకున్నాడు. రోజూ రెండు పూటలా పితికిన పాలను తీసుకెళ్లి సంతలో అమ్ముకొచ్చేవాడు. రామయ్య. కొంత కాలం తరువాత భీమయ్య ఆరోగ్యం క్షీణించి కన్నుమూశాడు. రామయ్య ఎంతగానో బాధపడ్డాడు. భీమయ్య కొడుకు శివయ్య పాల వ్యాపారం చేయలేక ఉన్న గేదెలను అమ్మి పట్నం చేరుకున్నాడు.

రామయ్య ఊరు వదలి, కొలువు కోసం మరో ఊరు బయలుదేరాడు. సీతాపురంలో నడుచుకుంటూ వెళుతున్న రామయ్యకు ఒక ఎద్దుల బండి ఎదురైంది. దాన్ని దాటి వెళుతుండగా దారిలో ఒక సంచి కనబడింది. అందులో సరుకులు ఉన్నాయి. చుట్టుపక్కల మరెవరూ లేరు.. బహుశా ఆ బండి అతనిదై ఉంటుందనుకున్నాడు. దాన్ని తీసుకుని పరుగున వెళ్ళి.. ‘అయ్యా! బండిని ఆపండి.. ఈ సంచి మీదేనా దారిలో పడి ఉంది’ అన్నాడు రామయ్య.  

 బండి అతను దిగి... ‘అవును ఈ సంచి నాదే బండిలో నుంచి పడిపోయినట్లుంది. నా పేరు భూషయ్య. నాకు కృష్ణాపురంలో పచారీ కొట్టు ఉంది. దొరికిన సంచిని నిజాయతీగా తెచ్చి ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఈ వస్తువుల ఖరీదు చాలా ఎక్కువ. ఇదిగో ఈ ధనం నీ మంచితనానికి బహుమతిగా ఇస్తున్నాను తీసుకో’ అన్నాడు.

 అయ్యా! నాకు ధనం వద్దు. ఆకలిగా ఉంది కాస్త అన్నం పెట్టించండి’ అన్నాడు రామయ్య. ‘నీ పేరెంటి? నువ్వు ఏం చేస్తుంటావు?’ అని అడిగాడు భూషయ్య. రామయ్య జరిగింది చెప్పాడు. ‘నాకు నమ్మకమైన వాళ్లు కావాలి.. నా దగ్గర పనిచేస్తావా?’ అన్నాడు భూషయ్య. ‘అయ్యా! జీతం అక్కరలేదు. మూడు పూటలా కాస్త తిండి పెడితే చాలు.. ఎంతపనైనా చేస్తాను’ అన్నాడు రామయ్య. ‘సరే బండి ఎక్కు’ అన్నాడు భూషయ్య.
బండి.. భూషయ్య ఇంటి ముందు ఆగింది. బండిలోని వస్తువులను తీసి పచారీ కొట్టులో పెట్టాడు రామయ్య. ‘నాకు సహాయపడుతుండు చాలు’ అని చెప్పి.. ‘నీకు ఉండడానికి ఈ చిన్న గది ఇస్తున్నాను. భోజనం పెట్టడంతోపాటు నీ పనిని చూసి జీతం కూడా నిర్ణయిస్తాను’ అన్నాడు భూషయ్య. ‘మీ ఇష్టం అయ్యగారూ’ అన్నాడు రామయ్య. ఒక మాసంలోనే రామయ్య చక్కగా పని నేర్చుకున్నాడు. భూషయ్యకు కూడా రామయ్యపై నమ్మకం కుదిరింది. కొన్ని రోజులకు భూషయ్య బంధువుల పెళ్ళికి పొరుగూరు వెళ్ళాల్సి వచ్చింది. రామయ్యను ఒక వారం పచారీ కొట్టు చూసుకోమని, సరుకులు ఏ విధంగా అమ్మాలో జాగ్రత్తలు చెప్పి కుటుంబ సమేతంగా బయలుదేరాడు.
చాలా ప్రాంతాల్లో పచారీ కొట్లు నడిపే వారు త్రాసులో మోసం చేసి సామాన్య ప్రజలను దోచుకుంటున్నారని, ఆ దేశం రాజు విజయుడికి.. వేగుల ద్వారా సమాచారం అందింది. మంత్రి, తూనికల అధికారితోనూ చర్చించి ముఖ్యమైన వారిని మారు వేషాల్లో వెళ్ళి ఆ పచారీ కొట్లలో సరుకులు కొని తెమ్మన్నాడు. మారు వేషాల్లో వెళ్ళిన వారు తాము తెచ్చిన సరుకులను తూనికల అధికారికి అందజేశారు.
ఆ అధికారి.. ‘దాదాపు ప్రతి పచారీ కొట్టులో తూకంలో ఐదు శాతం మోసం ఉంది.. ఒక్క భూషయ్య కొట్టులో తప్ప’ అని రాజుకు నివేదిక ఇచ్చాడు. ఆ యజమానులతో పాటు భూషయ్యను కూడా కోటకు రమ్మని రాజు కబురు పంపాడు. సరిగ్గా ఆ రోజే భూషయ్య కూడా ఇంటికి చేరుకున్నాడు. తాను సరుకులను బొటాబొటీగా తూస్తున్న విషయం బయటపడి ఉంటుంది. అందుకే రాజు కోటకు పిలిచి ఉంటారు అని భూషయ్య కంగారు పడుతూ కోటకు చేరుకున్నాడు. సభలో పచారీ కొట్ల యజమానులు చాలా మంది వచ్చారు. వారిని చూశాక భూషయ్య మనసు కాస్త కుదుటపడింది. ‘అందరితో పాటూ నేనూ’ అనుకున్నాడు.
‘ఒక్క భూషయ్య అంగడిలో తప్ప మీ అంగళ్లలో తూనికలో మోసం ఉందని రుజువైంది. ప్రజలు వంద శాతం డబ్బులిచ్చి సరుకులు కొనుగోలు చేస్తున్నప్పుడు, మీరు వారికి అయిదు శాతం కోతతో సరుకులు అందిస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. భూషయ్యా! మున్ముందు కూడా మీరు ఇదే విధంగా వ్యాపారం చేస్తూ, ప్రజలకు సక్రమంగా వస్తువులు అందిస్తుండాలి’ అని సత్కరించాడు రాజు.
మిగతా వారిని ఉద్దేశించి.. ‘మీ దగ్గర ఇదివరకు ఎవరెవరు సరుకులు కొన్నారో.. వారందరికీ ఒక మాసం సరిపడా సరుకులు ఉచితంగా ఇవ్వాలి. ఇక మీదట తూనికలో మోసం జరిగితే కఠినమైన శిక్షను అమలు చేస్తాం’ అని రాజు శాసనం చేశాడు. ‘వారందరూ క్షమించండి మహారాజా! ఇంకెప్పుడూ మోసం చేయము’ అన్నారు.
ఇంటికి వచ్చిన భూషయ్య ‘సరుకులను ఏ విధంగా అమ్మావు?’ అని రామయ్యను అడిగాడు. ‘అయ్యగారూ! నేను సంతలో పాలను కొన్న వారికి అసలు కాకుండా రెండు సార్లు పాలను కొసరుగా పోసేవాణ్ని. అదే విధంగా బియ్యం, పప్పు దినుసులు కొన్న వారికి త్రాసుతో తూచి వారి సంచుల్లో పోశాక, రెండు సార్లు పిడికిలితో అదే సరుకును సంచిలో వేసేవాణ్ని.. ఆ అలవాటు పోలేదు నన్ను క్షమించండి’ అన్నాడు రామయ్య. ‘నువ్వు చాలా మంచి పనిచేశావు. నీ వల్లనే నాకు ఈరోజు మంచి పేరు వచ్చింది. ఇక మీదట తూనికలో ఎలాంటి మోసం చేయకుండా నీ పద్ధతినే నేను కూడా అనుసరిస్తాను’ అన్నాడు భూషయ్య.
భూషయ్యను, రాజు సన్మానించారన్న విషయం గ్రామ ప్రజలకు తెలిసింది. దాంతో తన కొట్టుకు మంచి పేరు రావడంతో, రామయ్యకు మంచి జీతం ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు. అంతే కాకుండా తూనికలో తను చేసిన తప్పును సరిదిద్దుకోవడానికి తన దగ్గర వస్తువులు కొన్న వారికి కొన్ని సరుకులనూ ఉచితంగా ఇచ్చాడు.

- యు.విజయశేఖర రెడ్డి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని