ష్‌.. గప్‌చుప్‌.. ఇది వృత్తి రహస్యం!

రత్నగిరి జమీందారు రాఘవరాజుకు రత్నగిరి చుట్టుపక్కల అనేక వ్యాపారాలు ఉన్నాయి. రాఘవరాజు పరమలోభి. చాలా కఠినాత్ముడు. తన నౌకర్లకు చాలా తక్కువ జీతాలు ఇచ్చి ఎక్కువ పని చేయించుకునేవాడు. రాఘవరాజును కొంతకాలంగా ఒక వింతరోగం పీడిస్తోంది. రత్నగిరిలో వైద్యులందరూ పరీక్ష చేసి ఏవో మందులు ఇచ్చినా ఉపయోగం లేకుండా పోయింది. కానీ చంద్రాపురం యువ వైద్యుడు చంద్రప్ప ఇచ్చే ఆయుర్వేద మందు తాగిన వెంటనే ఉపశమనం కలిగేది.

Published : 12 Feb 2024 00:02 IST


త్నగిరి జమీందారు రాఘవరాజుకు రత్నగిరి చుట్టుపక్కల అనేక వ్యాపారాలు ఉన్నాయి. రాఘవరాజు పరమలోభి. చాలా కఠినాత్ముడు. తన నౌకర్లకు చాలా తక్కువ జీతాలు ఇచ్చి ఎక్కువ పని చేయించుకునేవాడు. రాఘవరాజును కొంతకాలంగా ఒక వింతరోగం పీడిస్తోంది. రత్నగిరిలో వైద్యులందరూ పరీక్ష చేసి ఏవో మందులు ఇచ్చినా ఉపయోగం లేకుండా పోయింది. కానీ చంద్రాపురం యువ వైద్యుడు చంద్రప్ప ఇచ్చే ఆయుర్వేద మందు తాగిన వెంటనే ఉపశమనం కలిగేది. రాఘవరాజుకు చంద్రప్ప వైద్యం మీద నమ్మకం కుదిరింది. అందుకే ప్రతి గురువారం నౌకరు నర్సింహను చంద్రాపురం పంపి చంద్రప్పను దివాణానికి పిలిపించుకునేవాడు.

చంద్రప్ప ఇంటి పక్కనే ఇంద్రజాలికుడు ఇంద్రయ్య తాత ఇల్లు. ఒకప్పుడు ఇంద్రయ్య రత్నగిరి చుట్టు పక్కల గ్రామాల్లో తన ఇంద్రజాలాన్ని ప్రదర్శించి వచ్చే డబ్బుతో జీవనం సాగించేవాడు. చంద్రప్పకు ఇంద్రయ్య తాత ఇంద్రజాలం చాలా ఇష్టం. చేతిలో నాణేన్ని చూపించి పిడికిలి మూసి ఏదో మంత్రం చదివి మాయం చేసేవాడు. మరో మంత్రం చదివి తెప్పించేవాడు. ఖాళీ డబ్బాలో మంత్రదండం తిప్పి రంగు రంగుల కాగితపు ముక్కలు తీసేవాడు. మళ్లీ అదే డబ్బాలో మంత్రదండం తిప్పి పావురం తెప్పించేవాడు. ‘తాతా! అవి ఎలా వస్తున్నాయి. ఆ మంత్రాలు నాకూ నేర్పించవా!?’ అని చంద్రప్ప అడిగాడు. ‘అలాగే లే’ అనేవాడు.. కానీ ఎప్పుడూ ఆ రహస్యం చెప్పేవాడు కాదు ఇంద్రయ్య. ఇప్పుడు వయసు మీరటంతో ఇంద్రయ్య చంద్రాపురం వీధుల్లోనే ప్రదర్శిస్తూ కాలం గడుపుతున్నాడు. ఇప్పుడు ఇంద్రయ్య భార్య, బిడ్డలు లేని ఒంటరివాడయ్యాడు.

ఎప్పటిలా గురువారం నౌకరు నర్సింహ చంద్రాపురం వచ్చాడు. చంద్రప్ప ఇచ్చిన మూలికల పెట్టెను గుర్రంబండిలో పెట్టాడు నర్సింహ. గుర్రంబండి ముందుకు కదిలింది. చంద్రప్ప తనకన్నా వయసులో చిన్నవాడు కావటం, అతనితో చనువుండటంతో... ‘బాబూ! జమీందారు గారికి మీ వైద్యం మీద మంచి నమ్మకం. మీరు వైద్యం చేసినందుకు ఇతర వైద్యులకన్నా ఎక్కువ డబ్బు తీసుకుంటారు. ఇంకా దివాణం నుంచి మీకోసం బండి కూడా పంపుతారు. ఎంగిలి చేత్తో కాకిని కూడా తోలని మనిషి మీకోసం ఖర్చు పెట్టడం ఆశ్చర్యంగా ఉంది’ అన్నాడు నర్సింహ.

చంద్రప్ప చిన్నగా నవ్వుతూ... ‘అతని ఆరోగ్యం కోసం ఖర్చు పెడుతున్నాడు. నాకోసం కాదుగా. ఇక నేను పేదలకు ఉచితంగానే వైద్యం చేస్తున్నాను!’ అన్నాడు. ‘బాబూ! తమరేమనుకోనంటే ఒక ప్రశ్న అడగాలనుంది?’ అన్నాడు నర్సింహ. ‘అడుగు నర్సింహా!’ అన్నాడు చంద్రప్ప. ‘ఇంతకీ జమీందారు గారి జబ్బు ఏమిటో.. మీరు వారం వారం ఇచ్చే మందేమిటో తెలుసుకోవచ్చా!?’ అడిగాడు నర్సింహ. ‘అలాగే ..నర్సింహా!’ అన్నాడు చంద్రప్ప.

బండి చంద్రాపురం కూడలికి చేరింది. అక్కడ జనం గుమికూడి ఉన్నారు. ఇంద్రయ్య తాత ఇంద్రజాలం ముగింపులో ఉంది. ‘బండి పక్కకు ఆపు నర్సింహా!’ అన్నాడు చంద్రప్ప. ఇద్దరూ ఇంద్రజాల ప్రదర్శన తిలకించారు. మొదటి సారిగా ఇంద్రయ్య ఇంద్రజాలం చూసిన నర్సింహకు అద్భుతం అనిపించింది. జనాలు తమకు తోచిన డబ్బు ఇంద్రయ్యకు ఇస్తున్నారు.

చంద్రప్ప నూరు వరహాలు ఇంద్రయ్యకిస్తూ.. ‘తాతా! ఇప్పటికైనా ఇంద్రజాల రహస్యాలు చెబుతావా!?’ అని అడిగాడు. ‘అలాగే లే’ అన్నాడు నవ్వుతూ ఇంద్రయ్య. నర్సింహను ఇంద్రయ్యకు పరిచయం చేశాడు చంద్రప్ప. ‘మా చంద్రప్పకు చిన్నప్పటి నుంచి నా ఇంద్రజాలమంటే ప్రాణం. నన్నెప్పుడూ ఎలా మాయ చేస్తారో రహస్యం చెప్పమంటాడు. ఈ ముసలోడు ఎవరి వద్దా చెయ్యి చాచకుండా ఇంకా బతుకుతున్నాడంటే, ఆ రహస్యాలు చెప్పకపోవటమే కారణం!’ అన్నాడు ఇంద్రప్ప.

ఏదో అర్థమైనట్లు తల ఆడించాడు నర్సింహ. ‘రహస్యం చెప్పనంతవరకే మనం దానికి యజమానులం! ఒక్కసారి చెప్పామో ఇక జీవితాంతం దానికి బానిసలం!’ అనుకున్నాడు నర్సింహ. తర్వాత బండి వేగంగా రత్నగిరికి పోనిచ్చాడు. జమీందారుకు ఇచ్చే మందు రహస్యం గురించి చంద్రప్పను అడిగి తెలుసుకునే ప్రయత్నం ఏనాడూ చేయలేదు నర్సింహ.

మహంకాళి స్వాతి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు