వంశీని మార్చిన వానరం!

అది ఒక ప్రాథమిక పాఠశాల. రెండో తరగతిలో ఉపాధ్యాయుడు రాము.. ‘కోతి బావా..! నీకు కాస్త కోపమెక్కువ!’ అంటూ కొంటె కోతి పాఠాన్ని పాట రూపంలో వినిపిస్తున్నారు. పిల్లలంతా శ్రద్ధగా వింటున్నారు.

Updated : 13 Feb 2024 06:46 IST

ది ఒక ప్రాథమిక పాఠశాల. రెండో తరగతిలో ఉపాధ్యాయుడు రాము.. ‘కోతి బావా..! నీకు కాస్త కోపమెక్కువ!’ అంటూ కొంటె కోతి పాఠాన్ని పాట రూపంలో వినిపిస్తున్నారు. పిల్లలంతా శ్రద్ధగా వింటున్నారు. అంతలో కిటికీ పక్కన కూర్చున్న కిరణ్‌, బయట ప్రహరీ గోడ మీద చప్పుడు అయితే ఒక్కసారిగా అటు వైపు చూశాడు. అక్కడ గోడ మీద ఒక కోతి కూర్చుని ఉంది. ‘సార్‌! కోతి.. కోతి..!’ అంటూ గట్టిగా అరిచాడా అబ్బాయి. పిల్లలంతా కిరణ్‌ చెప్పిన కిటికీ వైపు ఆత్రంగా చూశారు. ‘ఏయ్‌! కోతి, భలేగా ఉంది కదూ! పైగా అది మన గది వైపే చూస్తోంది’ అని పిల్లలంతా వాళ్లల్లో వాళ్లు అనుకుంటున్నారు.

దాంతో ‘పిల్లలూ! గట్టిగా అరవకండి. కోతి లోపలికి వచ్చేస్తుంది. అందరూ కూర్చోండి’ అని రాము సార్‌ అనడంతో.. పిల్లలు వారి వారి బెంచీల మీద కూర్చున్నారు. ఆ పిల్లల అరుపులకు కోతి కాస్త భయపడిపోయింది. అయినా కదలకుండా, మెదలకుండా తరగతి గదిలోకి చూస్తోంది. అది లోపల ఉన్న ఎవరి కోసమో వెతుకుతున్నట్లుగా అనిపించింది ఆ ఉపాధ్యాయుడికి. కోతిని చూసి అందరూ పైకి లేచారు కానీ, వంశీ తన చోటు నుంచి కదలకపోవడం రాము సార్‌ గమనించారు.  

‘వంశీ... ఆ కోతి ఎందుకు నీ వైపే చూస్తోంది. అది నీకు తెలుసా? ఇంతకీ ఏమైంది?’ అని ఆశ్చర్యంగా అడిగారు రాము సార్‌. అలా అడగడంతో పిల్లలంతా వంశీ వైపు చూశారు. ఆ అబ్బాయి లేచి, ఏమీ చెప్పకుండా.. కోతి వైపు చూశాడు. కోతి కూడా.. వంశీ వైపే చూడసాగింది.

‘ఏమైందో చెబితేనే తెలుస్తుంది. మౌనం సమాధానం కాదు’ అని సార్‌ మళ్లీ అడిగారు. ‘సార్‌! ఈ కోతి కొన్ని సంవత్సరాలుగా రోజూ మా పెరట్లోకి వస్తుంది. జామచెట్టు ఎక్కి జామపళ్లు తింటుంది. నేను రోజూ కొబ్బరి పెడితే, చెట్టు మీద నుంచి కిందకు దిగి, నా దగ్గరకు వచ్చి తింటుంది. అలా నాకు మచ్చిక అయింది. ఒక్కోసారి నేను బడికి వస్తుంటే కూడా, చెట్లెక్కుతూ నన్ను అనుసరిస్తూ వస్తుంది. నేను బడికి చేరుకోగానే తిరిగి వెళ్లిపోతుంది’ అని బదులిచ్చాడు వంశీ.

‘మరి ఈ రోజు ఎందుకు గోడ మీద కూర్చుని అలాగే ఉంది’ అని సార్‌ ఆసక్తిగా అడిగారు. ‘అదీ.. అదీ...’ అంటూ వంశీ చెప్పలేక ఆగాడు. ‘ఫర్వాలేదు, చెప్పు వంశీ’ అని సార్‌ అడగడంతో.. ‘‘హోంవర్క్‌ చేయలేదని అమ్మతో బడికి వెళ్లనన్నాను. అప్పుడు అమ్మ.. ‘వంశీ, బద్ధకంతో హోంవర్క్‌ చేయకపోవడం నీ మొదటి తప్పు. బడి మానేయాలనుకోవడం...  రెండో తప్పు. నేను ఒప్పుకుంటే అది మూడో తప్పు అవుతుంది. బడి మానడానికి వీల్లేదు’ అంది. అమ్మ మీద కోపం వచ్చింది. టిఫిన్‌ తినలేదు. అమ్మ చెప్పినా వినలేదు. చెట్టుపైనున్న ఈ కోతికి నేను బై చెప్పకుండా వచ్చాను. అందుకే అది నా కోసం వచ్చింది సార్‌’’ అని కోతి వైపు చూస్తూ చెప్పాడు వంశీ.  

‘చూశారా పిల్లలూ.. సాధు జంతువులను మచ్చిక చేసుకుంటే అవి మన కూడా.. ఉంటాయి. వాటికీ మనసుంటుంది. మూగ జీవులను అనవసరంగా, ఆకతాయితనంతో రాళ్లతో కొట్టకూడదు. వంశీ తన తప్పును తెలుసుకోవడం జ్ఞానం. తప్పు అని తెలిసి చేయడం అజ్ఞానం. కోతికి బై చెప్పేసి రా!’ అని రాము సార్‌ వంశీని బయటకు పంపించారు.

అప్పుడే అమ్మ టిఫిన్‌ బాక్స్‌ పట్టుకుని వంశీ కోసం వచ్చింది. విషయమంతా సార్‌ చెప్పడంతో.. అమ్మ కూడా కోతి వైపు చూసింది. ‘అమ్మా! ఇంకెప్పుడూ బద్ధకంగా ఉండను. ఎప్పటి హోంవర్క్‌ అప్పుడు చేసుకుంటాను. సరేనా!’ అంటూ అమ్మ చేతిలో ఉన్న టిఫిన్‌ బాక్స్‌ అందుకున్నాడు. తప్పు తెలుసుకున్న కొడుకు వైపు అమ్మ మురిపెంగా చూసింది. వంశీ బై.. చెప్పడంతో కోతి కూడా అక్కడి నుంచి వెళ్లిపోయింది. ‘వంశీలో మార్పు మొదలైంది. పిల్లలూ చప్పట్లు కొట్టండి’ అని సార్‌ అనడంతో విద్యార్థులంతా గట్టిగా చప్పట్లు కొట్టారు.

కె.వి.లక్ష్మణరావు


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు