తల్లి పిచ్చుక.. పిల్ల పిచ్చుకలు!!

మానేపల్లి గ్రామ శివారులో లక్ష్మయ్య పొలం గట్టున ఉన్న పొదల్లో ఒక పిచ్చుక జంట గూడు కట్టుకుని వాటి పిల్లలతో హాయిగా జీవిస్తోంది. ఒకరోజు లక్ష్మయ్య పంట చేలో కలుపు తీసి వెళ్లేటప్పుడు ఆ పిచ్చుక గూడు కనిపించింది. ‘

Updated : 15 Feb 2024 05:05 IST

మానేపల్లి గ్రామ శివారులో లక్ష్మయ్య పొలం గట్టున ఉన్న పొదల్లో ఒక పిచ్చుక జంట గూడు కట్టుకుని వాటి పిల్లలతో హాయిగా జీవిస్తోంది. ఒకరోజు లక్ష్మయ్య పంట చేలో కలుపు తీసి వెళ్లేటప్పుడు ఆ పిచ్చుక గూడు కనిపించింది. ‘అయ్యో! చిన్న పిల్లలే... కోతల వేళకు రెక్కలొచ్చి ఎగిరిపోతే బాగుండు’ అనుకున్నాడు. ఆ చుట్టుపక్కల ఉన్న పురుగులు ఏరుకుంటున్న తల్లి పిచ్చుక ఆ మాటలు వింది. ఎగురుకుంటూ వచ్చి, పిల్లల నోట్లో ఆహారం పెట్టి... జాగ్రత్తలు చెప్పింది. లక్ష్మయ్య ఎప్పుడు వచ్చినా, ఏం మాట్లాడుకున్నదీ విని వివరంగా తనకు చెప్పాలంది. పిల్లలు సరే అనగానే.. ఎగిరిపోయింది తల్లి పిచ్చుక.

పంట బాగా పండింది. కోతల సమయానికి పిల్లలకు రెక్కల్లో ఇంకా పూర్తిగా బలం రాలేదు. చుట్టుపక్కలే బోలెడు ధాన్యం ఉన్నా.. అమ్మ ఎందుకు బయటకు వెళుతుందో అర్థం కాలేదు పిల్లలకు. ఎప్పటిలాగే ఆహారానికి వెళ్లి, సాయంత్రానికి తిరిగి గూటికి చేరుకుంది తల్లి పక్షి. ‘అమ్మా... అమ్మా...’ అంటూ తల్లి చుట్టూ తిరిగి కిచకిచమంటూ అరవసాగాయా పిల్లలు. వాటికి కడుపునిండా ఆహారం పెట్టిందా పిచ్చుక.

 తర్వాత.. ‘ఈ రోజు సంగతులు ఏమిటి?’ అని అడిగింది తల్లి పక్షి. ‘నేను చెప్తాను అంటే.. నేను చెప్తాను...’ అని వంతులాడుకోసాగాయి పిల్ల పక్షులు. ‘సరే ఎవరో ఒకరు చెప్పండి’ అంది తల్లి పక్షి. ‘అమ్మా! ఈ రోజు పొలం యజమాని వచ్చాడు, రేపు కోతకు కూలి వాళ్లను రమ్మన్నాడు. అదీ ఈ రోజు విశేషం’ అని చెప్పింది ఒక పిల్ల.

‘అయితే రేపటి నుంచి వడ్ల గింజలు దొరకవన్న మాట’ అంది రెండో పిల్ల. ‘అమ్మా మనం వేరే చోటకు వెళ్లిపోదాం’ అంది మొదటి పిల్ల. ‘మీరు భయపడకండి.. హాయిగా పడుకోండి’ అంది తల్లి పక్షి. హాయిగా నిద్రపోయాయి పిల్లలు. తెల్లవారగానే యథావిధిగా తల్లి పక్షి బయటకు వెళ్లి సాయంత్రానికి తిరిగి వచ్చింది. ‘అమ్మా పంట కోతకు ఈ రోజు కూలి వాళ్లు రాలేదు. బంధువులను సాయానికి రమ్మన్నాడు యజమాని’ అని చెప్పాయి పిల్ల పక్షులు.

‘మరేం ఫర్వాలేదు. మరో రోజు మనకు గడువుంది’ అని నిట్టూర్చింది తల్లి పిచ్చుక. మర్నాడు యజమాని పొలం గట్టు దగ్గరకు వచ్చి... ‘తుపాను వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే వారం గడిచింది. ఇక ఆలోచిస్తూ కూర్చుంటే లాభం లేదు. నేను పక్క ఊరువెళ్లి, కొడవళ్లు పదును పెట్టించుకుని వస్తాను. కొడుకులు, నువ్వూ తలో చెయ్యి వెయ్యండి’ అన్నాడు భార్యతో. ఆ మాటలు విన్న పిచ్చుక పిల్లలు, తల్లితో చెప్పాయి.

‘సరే’ అని మర్నాడు ఉదయం ఒక్కో పిల్లను అతికష్టం మీద నోట కరుచుకుని వేరే చోటుకు తరలించింది పిచ్చుకల జంట. కొత్త గూడు, కొత్త ప్రదేశం చూసి ఆశ్చర్యపోయాయి పిచ్చుక పిల్లలు. ‘అమ్మా ఈ ప్రదేశం బాగుంది. ఈ గూడు ఎప్పుడు కట్టావు?’ అని అడిగాయి పిల్లలు. ‘యజమాని కూలి వాళ్లపై, చుట్టాల మీద ఆధారపడ్డాడు, పని జరగలేదు. తాను స్వయంగా పూనుకుంటే పని ఆగదు. అందుకే మేము ఎవరి మీదా ఆధారపడకుండా రోజూ బయటకు వెళ్లి మీ కోసం కొత్త గూడు కట్టాం. మన పని మనం చేసుకున్నంత ఉత్తమం మరొకటి లేదు. ఏ రోజైతే కొడవళ్లు పదును పెట్టించడానికి పక్క ఊరికి వెళ్లాడో అప్పుడే మాకు అర్థమైంది. యజమాని తనే వరి చేను కోసుకోవడానికి సిద్ధపడ్డాడు అని. అందుకే ఇంత త్వరగా ఇక్కడికి తీసుకొచ్చాం’ అంది తల్లి. అమ్మ ముందు చూపునకు ముచ్చటపడ్డాయి పిచ్చుక పిల్లలు.

- కాశీ విశ్వనాథం పట్రాయుడు


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని