మహారాజు మారువేషం!

కౌశాంబీ రాజ్యాన్ని మాధవసేనుడు పాలించేవాడు. ఒకసారి తన పాలన గురించి ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసుకోవాలన్న ఆసక్తి కలిగింది.

Updated : 23 Feb 2024 04:24 IST

కౌశాంబీ రాజ్యాన్ని మాధవసేనుడు పాలించేవాడు. ఒకసారి తన పాలన గురించి ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసుకోవాలన్న ఆసక్తి కలిగింది. అందుకోసం మారువేషం ధరించి ఒంటరిగా బయలుదేరాడా మహారాజు. ఒక గ్రామానికి వెళ్లి అక్కడ కనిపించిన వ్యక్తిని పిలిచి.. ‘మీ రాజు పరిపాలన బాగుందా? అన్ని సౌకర్యాలు అందుతున్నాయా?’ అని ప్రశ్నించాడు. ఆ వ్యక్తి ఏమీ మాట్లాడకుండా ఇంట్లోకి వెళ్లి.. దుస్తులన్నీ తీసుకొచ్చి రాజు ముందు పడేశాడు. దాంతో ఆయనకు పట్టలేనంత కోపం వచ్చింది. అయినా.. ఏమీ అనకుండా నిశ్శబ్దంగా ఉన్నాడు. అవన్నీ ఇంట్లోకి తీసుకెళ్లి తనను సర్దమంటున్నాడనుకొని అపోహపడిన రాజు.. ‘నేను వచ్చి వాటిని సర్దాలా? నువ్వు బాగానే ఉన్నావు కదా సర్దుకోలేవా?’ అన్నాడు. అప్పుడు కూడా ఆ వ్యక్తి ఏమీ మాట్లాడకుండా కోపంగా చూస్తూ.. వెళ్లిపోయాడు. అతను ఎందుకలా చేశాడో అర్థం కాక.. అదే ఆలోచించుకుంటూ మరో గ్రామానికి వెళ్లిపోయాడాయన.

అక్కడ ఎదురుపడిన ఒక వ్యక్తిని ఆపి.. మొదటి వ్యక్తిని అడిగిన ప్రశ్నే మళ్లీ అడిగాడు రాజు. అతను కూడా ఏమీ మాట్లాడకుండా.. గునపంతో మట్టిని తవ్వి, దాన్ని ఒక తట్టలో ఎత్తి రాజు ముందు పారబోశాడు. అది చూసిన రాజుకు అతన్ని తిట్టాలన్నంత కోపం వచ్చింది. ఆ మట్టిని తన మీదే పోసినట్లుగా భావించాడు. వెంటనే అక్కడి నుంచి బయలుదేరి మరో గ్రామానికి వెళ్లిపోయాడు. ఆ చోట కూడా ఓ చెట్టు కింద కూర్చున్న వృద్ధుడి దగ్గరకు వెళ్లి ఇంతకు ముందు అడిగిన ప్రశ్నే అడిగాడు. అప్పుడు ఆ వృద్ధుడు ఎక్కడి నుంచో ఒక తాబేలును తీసుకొచ్చి.. కొన్ని విషయాలు చెప్పాడు. కానీ అవేవీ రాజుకు అర్థం కాలేదు. ‘తాబేలును చూపించాడంటే.. నా పరిపాలన నెమ్మదిగా సాగుతుందని చెప్పి ఉంటాడు’ అని మనసులోనే అనుకుంటూ ఇక కోటకు బయలుదేరాడాయన. ఆ రోజు జరిగిందంతా.. ఆలోచించుకుంటూ తన పాలన బాగోలేదేమోనని బాధపడ్డాడు రాజు.

రెండు రోజుల తర్వాత మంత్రిని పిలిచి.. ‘మంత్రివర్యా..! మొన్న నేను మారువేషంలో వెళ్లి రాజ్యంలో మూడు ప్రాంతాల్లో పర్యటించాను’ అని చెప్పి, అక్కడ జరిగిన విషయాలన్నీ వివరించాడు మహారాజు. అప్పుడు మంత్రి బదులిస్తూ.. ‘మీరు పొరపాటుపడ్డారు మహారాజా! మీరు మొదటిసారి ప్రశ్నించిన వ్యక్తి మాట్లాడలేడు. ఆ గ్రామంలో దొంగల బీభత్సం ఎక్కువగా ఉంది. దొంగలు తమ ఇళ్లలోకి వచ్చి అన్నీ చిందరవందర చేస్తున్నారని మీకు తెలియజేయడానికి అలా చేశాడు. అంతే తప్ప అందులో మరో ఉద్దేశం ఏమీ లేదు. అందువల్ల మీరు దొంగలను పట్టుకొని ఆ భయం వారికి లేకుండా చేస్తే సరిపోతుంది’ అని చెప్పాడు. దాంతో ఆనందించిన రాజు.. ‘మరి రెండో గ్రామంలో జరిగింది?’ అని ఆశ్చర్యంగా అడిగాడు.

‘మీరు ప్రశ్నించిన వ్యక్తి మౌన వ్రతం చేస్తున్నాడు. అందుకే మాట్లాడకుండా.. మీకు సైగల ద్వారా జవాబు చెప్పాడు. ‘ఈ మట్టి చాలా ప్రత్యేకమైంది. అందుకే ఇక్కడ చాలా పంటలు పండుతాయి. కానీ ఇప్పుడు సాగునీటి సౌకర్యం లేదు. కాలువలు తవ్వించాలని అతను మీకు అలా మట్టి పారబోసి చెప్పాడు’ అన్నాడు మంత్రి. అలాగేనన్న మహారాజు.. ‘మరి మూడో వ్యక్తి విషయమేంటి?’ అని అడిగాడు. ‘దానికి కూడా ఒక బలమైన కారణం ఉంది. వృద్ధాప్యం వల్ల అతను మాట్లాడిన మాటలు మీకు అర్థం కాలేదు. తాబేలు చూడటానికి పైన అంతా డిప్ప. చాలా దృఢంగా ఉంటుంది. లోపల మాత్రం శరీరం మెత్తగా ఉంటుంది. అలాగే మేము పైకి బాగానే కనిపించినా.. మా శరీరంలో చాలా ఆరోగ్య సమస్యలున్నాయి. పేదరికం వల్ల సరైన భోజనం కూడా తీసుకోలేకపోతున్నాం. తిండికి, వైద్యానికి కాస్త ఆర్థిక సాయం కావాలని దాని అర్థం. అంతే తప్ప మీ పరిపాలన నెమ్మదిగా ఉందని కాదు’ అన్నాడు మంత్రి. ఆ మాటలకు సంతోషించిన రాజు.. ‘ఈ విషయాలన్నీ మీకు ఎలా తెలిశాయి’ అని ఆశ్చర్యంగా అడిగాడు. ‘మీరు గ్రామ పర్యటనకు వెళ్లిన మరుసటిరోజే.. నేను మన వేగులను అక్కడికి పంపించి విషయం తెలుసుకున్నాను’ అని బదులిచ్చాడు మంత్రి. దాంతో మాధవసేనుడి మనసు కుదుటపడింది. ఆ రోజు నుంచే దొంగల భయం లేకుండా.. అవసరమైన గ్రామాల్లో గస్తీ ఏర్పాటు చేయించాడు. సాగునీటి వసతి లేనిచోట కాలువలు తవ్వించాడు. ఆ తర్వాత మంత్రి సూచనతో వృద్ధులకు ఆర్థిక, వైద్య సాయం కూడా ప్రకటించాడు. అప్పుడు రాజ్యంలోని ప్రజలంతా ఎలాంటి భయం లేకుండా సంతోషంగా జీవించసాగారు.

సంగనభట్ల చిన్న రామకిష్టయ్య


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని