మృగరాజు గుణపాఠం..!

గౌతమీ నది తీరాన ఉన్న భద్రాది అడవికి సింహం రాజు, ఏనుగు మంత్రిగా ఉన్నాయి. ప్రతిరోజు ఉదయాన్నే ఒకసారి అడవిలో తిరిగి జంతువులన్నింటినీ చూసి గుహకు వెళ్లి నిద్రించేది మృగరాజు. మంత్రి మాత్రం అన్ని జీవులనూ పలకరించి వాటి యోగక్షేమాలు తెలుసుకొని, కావాల్సిన సూచనలు చేసి.. ఇతర జంతువుల నుంచి వాటికి ముప్పు రాకుండా చూసేది. అది ఆ అడవిలోనే ఉండే తస్కర అనే నక్కకు ఏ మాత్రం నచ్చేది కాదు.

Published : 24 Feb 2024 05:05 IST

గౌతమీ నది తీరాన ఉన్న భద్రాది అడవికి సింహం రాజు, ఏనుగు మంత్రిగా ఉన్నాయి. ప్రతిరోజు ఉదయాన్నే ఒకసారి అడవిలో తిరిగి జంతువులన్నింటినీ చూసి గుహకు వెళ్లి నిద్రించేది మృగరాజు. మంత్రి మాత్రం అన్ని జీవులనూ పలకరించి వాటి యోగక్షేమాలు తెలుసుకొని, కావాల్సిన సూచనలు చేసి.. ఇతర జంతువుల నుంచి వాటికి ముప్పు రాకుండా చూసేది. అది ఆ అడవిలోనే ఉండే తస్కర అనే నక్కకు ఏ మాత్రం నచ్చేది కాదు. అది ఏ జంతువును వేటాడినా.. ‘మృగరాజు తినగా వదిలినదంతా నువ్వే తింటున్నావు కదా? వాటిని వదిలిపెట్టు’ అని చెప్పేది మంత్రి.

అందుకే ఎలాగైనా ఏనుగును మంత్రి పదవి నుంచి తొలగించాలని నిర్ణయించుకుందా నక్క. తేనెపట్టు కోసం చెట్టు ఎక్కుతున్న ఎలుగుబంటి దగ్గరకు వెళ్లి.. ‘మంత్రి పదవిలో ఉండాల్సిన నువ్వు.. ఇతర జంతువులతో తేనె తెప్పించుకొని తినాల్సిన నువ్వు.. ఇలా దాని కోసం కష్టపడటం చూస్తుంటే బాధగా ఉంది’ అంది. అసలే తేనె దొరక్క చిరాకులో ఉన్న ఎలుగుకు దాని మాటలు ఇంకా కోపం వచ్చేలా చేశాయి. దాంతో అది.. ‘నీకు మంత్రితో ఏదైనా పని పడితే చెప్పు.. నేను చేయిస్తాను. అంతేగానీ ఇలా అనవసర మాటలు దేనికీ?’ అని అంది. ఆ మాటలు విన్న నక్క.. ఇక దీనితో లాభం లేదనుకొని పులి దగ్గరికి వెళ్లి కూడా అలాంటి మాటలే చెప్పింది. ‘నాకు మంత్రి అవ్వాలనే ఆలోచన ఎప్పుడూ లేదు. అయినా ఇప్పుడు అడవిలో అంతా బాగానే ఉంది కదా? నీకు ఎందుకు ఆ ఆలోచన వచ్చింది? ఇంకెప్పుడూ ఇలా మాట్లాడకు’ అంటూ చిన్నగా చెప్పింది పులి.

నక్క చేస్తున్న పనులన్నీ కాకి ముందు నుంచే గమనిస్తూ ఉంది. అది అడవిలో జరుగుతున్న ముఖ్యమైన విషయాలు తెలుసుకొని రాజుకి చేరవేస్తుంది. ఎలుగు, పులి దగ్గర దాని ఎత్తులు పని చేయకపోవడంతో.. మంత్రి దగ్గరకు చేరింది నక్క. అప్పుడే చెరకు తిని విశ్రాంతి తీసుకుంటున్న ఏనుగుకి నమస్కరించి.. ‘మంత్రిగారూ.. మిమ్మల్ని చూస్తుంటే జాలిగా ఉంది. అడవిలో జంతువుల బాగోగులు చూసేది మీరు. కానీ పేరు మాత్రం మృగరాజుది. ఏం చేయక పోయినా, నచ్చిన జంతువులను చంపి తిన్నా రాజంటేనే అందరికీ అభిమానం. ఏంటో అర్థంకాదు’ అంది నిట్టూరుస్తూ. ఆ మాటలన్నీ విని.. ఏమీ అనకుండా నవ్వేసింది ఏనుగు. ‘నా మాటల ప్రభావం వెంటనే పని చేయకపోయినా విషబీజం నాటాను’ అని మనసులోనే అనుకుంటూ అక్కడి నుంచి వెళ్లిపోయింది నక్క. ఇదంతా గమనించిన కాకి.. ‘అసలు నక్కకు ఇదేం బుద్ధి. దీని మాటలకు మంత్రి ఏం చేస్తుందో చూడాలి. అవసరమైతేనే మృగరాజుకు విషయం చెప్పాలి. అప్పటి వరకు వీటిని గమనిస్తూ ఉంటాను’ అని అనుకోసాగింది. తస్కర చెప్పిన మాటలు ఏనుగు దగ్గర బాగా పని చేశాయి. ఆ రోజు నుంచి అది ముభావంగా ఉండసాగింది. జంతువులతో సరిగ్గా మాట్లాడటం లేదు. ఎందుకలా ఉన్నావని మృగరాజు ప్రశ్నించినా.. ఏమీ లేదంటూ అక్కడి నుంచి వెళ్లిపోయేది ఏనుగు.

కాసేపటికి అక్కడికి వచ్చిన కాకి విషయం మొత్తం మృగరాజుకు వివరించింది. ‘ఆ నక్కకు బుద్ధి చెప్పడం చిటికెలో పని. కానీ.. అలా చేస్తే మంత్రిలో మార్పు రాదు’ అని జంతువులన్నింటికీ సమావేశం ఏర్పాటు చేసింది మృగరాజు. ‘నేనొక అత్యవసరమైన పని మీద బయటకు వెళ్తున్నాను. అంత వరకు అడవికి రాజుగా మన మంత్రి ఏనుగే ఉంటుంది. నాకు ఎలా గౌరవం ఇచ్చారో.. మంత్రిని కూడా అలాగే చూడాలి’ అని చెప్పి వెళ్లిపోయింది సింహం.

మృగరాజు అడవిని విడిచిపెట్టి వెళ్లిపోయిందని తెలియగానే.. తోడేలు, నక్క, పులి లాంటి జంతువులకు ఒక్కసారిగా స్వేచ్ఛ వచ్చినట్లు అయింది. కనిపించిన ప్రతి చిన్న జీవిని తినేయసాగాయి. ఏనుగు ఎంత చెప్పినా అవి అస్సలు పట్టించుకోలేదు. ఒక్కరోజు రాజుగా ఏనుగుకు అడవిని ఎలా కాపాడాలో అర్థంకాలేదు. ‘ఇదే కొనసాగితే ఈ అడవిలో ఏ ఒక్క జీవి కూడా ప్రాణాలతో ఉండదు’ అని కాకితో మాట్లాడి వెంటనే మృగరాజు దగ్గరికి బయలుదేరిందది. అక్కడికి వెళ్లి.. ‘మృగరాజా నన్ను క్షమించండి. రాజుగా మీరు మాతో ఉంటేనే.. మాకు క్షేమం. మీరు లేని అడవి జంతువులకు హానికరంగా మారిపోతుంది. వెంటనే అడవికి వచ్చి ఆ పెద్ద జీవుల నుంచి చిన్న జంతువులను రక్షించండి. ఆ చెప్పుడు మాటలు చెప్పే నక్కకు.. నేను బుద్ధి చెబుతాను’ అంది ఏనుగు. ‘ఇదంతా నీకు తెలియజేయడం కోసమే నేను ఇలా బయటికి వచ్చాను. కానీ అడవి జీవులకు నష్టం జరుగుతుందంటే.. కచ్చితంగా అండగా ఉంటాను’ అంటూ మళ్లీ అడవికి వచ్చింది సింహం. ఆ విషయం తెలుసుకున్న నక్క అడవిని వీడి వెళ్లిపోవడానికి ప్రయత్నించింది. కానీ మృగరాజు దాన్ని పట్టుకొని.. దానితో పాటుగా అనవసరంగా చిన్న జీవులను వేటాడిన పులి, తోడేలును కూడా శిక్షించింది. సరైన సమయంలో విషయం తెలియజేసిన కాకిని అభినందించింది మృగరాజు.

కూచిమంచి నాగేంద్ర


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని