మంచి మిత్రులు..!

శంకరాపురంలో రామయ్య, భీమయ్య అని ఇద్దరు స్నేహితులు ఉండేవారు. వాళ్ల ఇళ్లు కూడా పక్కపక్కనే ఉండేవి. రామయ్య వ్యవసాయం చేస్తే.. భీమయ్య వడ్డీ వ్యాపారం చేసేవాడు.

Published : 28 Feb 2024 00:14 IST

శంకరాపురంలో రామయ్య, భీమయ్య అని ఇద్దరు స్నేహితులు ఉండేవారు. వాళ్ల ఇళ్లు కూడా పక్కపక్కనే ఉండేవి. రామయ్య వ్యవసాయం చేస్తే.. భీమయ్య వడ్డీ వ్యాపారం చేసేవాడు. రామయ్యకు బాగా పరిచయం ఉన్నవారు, భీమయ్య దగ్గర నూటికి పావలా వడ్డీ చొప్పున అప్పు తీసుకునేవారు. అదే గ్రామంలో ఉండే కనకయ్య వారి స్నేహాన్ని చూసి అస్సలు ఓర్వలేక పోయేవాడు. ఎలాగైనా వారిని విడదీయాలని నిర్ణయించుకున్నాడు. దాంతో ఒకరోజు భీమయ్య ఇంటికి వెళ్లి.. ‘రామయ్యకు తెలిసిన వారికి నువ్వు అంత తక్కువ వడ్డీకి డబ్బులు ఇవ్వడం బాగోలేదు. వాళ్లు నీ దగ్గర తీసుకొని రామయ్యకు ఇస్తున్నారు. అతనేమో పక్క గ్రామంలో వడ్డీకి ఇస్తున్నాడు. ఈ విషయం నాకు నిన్ననే తెలిసింది’ అన్నాడు కనకయ్య. ఆ మాటలు విన్న భీమయ్య ఆలోచనలో పడ్డాడు.

అలా వారం రోజులు గడిచాయి. అప్పుడు కనకయ్య మళ్లీ వచ్చి.. ‘భీమయ్యా! నాకు కాస్త డబ్బులు అవసరం ఉన్నాయి. నూటికి రూపాయి చొప్పున వడ్డీ ఇస్తాను. లక్ష రూపాయలు కావాలి’ అన్నాడు. రూపాయి వడ్డీ అనే సరికి భీమయ్యకు ఆశగా అనిపించింది. అయితే.. ప్రతినెలా వడ్డీ చెల్లించేలా పత్రం రాయించుకుని కనకయ్యకు లక్ష రూపాయలు ఇచ్చాడతను. ఈ విషయం భీమయ్య తన స్నేహితుడు రామయ్యకు చెప్పలేదు. దాదాపు ఆరు నెలలు గడుస్తున్నా కనకయ్య ఇస్తానన్న వడ్డీ ఇవ్వలేదు. కొన్నిరోజులకు భీమయ్య.. కనకయ్యకు లక్ష రూపాయలు ఇచ్చాడన్న విషయం రామయ్యకు తెలిసింది. వెంటనే అతని దగ్గరకు వెళ్లి.. ‘కనకయ్యకు డబ్బులు ఇచ్చిన విషయం నాకు చెప్పనేలేదు’ అన్నాడు రామయ్య. ‘క్షమించు మిత్రమా! అతను నీ మీద లేని పోనివి చెప్పి, డబ్బులు తీసుకెళ్లాడు. నా కూతురి వివాహం నిశ్చయమైంది. సమయానికి చేతిలో కావాల్సినంత డబ్బు లేదు. నాకు ఏం చేయాలో తోచడం లేదు’ బాధగా అన్నాడు భీమయ్య. ‘నువ్వేమీ బాధపడకు. ఆ కనకయ్యకు నేను బుద్ధి చెబుతాను’ అని ధైర్యం చెప్పాడు రామయ్య.

ఆ తర్వాత రామయ్య తన బావమరిదిని కనకయ్య దగ్గరకు తీసుకెళ్లి.. ‘నేను, భీమయ్య మాట్లాడుకోవడం లేదు. ఇప్పుడు మా మధ్య ఎలాంటి స్నేహమూ లేదు. ఈయన నా బావమరిది. పెద్ద వ్యాపారం చేయాలనుకుంటున్నాడు. ఒక లక్ష రూపాయల అప్పు కావాలి. నూటికి రెండు రూపాయల చొప్పున వడ్డీ ఇస్తాడు.. నాదీ పూచీ’ అన్నాడు. దాంతో.. ‘నేను వడ్డీ వ్యాపారం చేస్తున్నానని ఎవరు చెప్పారు?’ అని కాస్త కంగారుపడుతూ అడిగాడు కనకయ్య. ‘మనం ఉండేది పెద్ద నగరమా? వంద ఇళ్లు ఉన్న గ్రామం. ఏ విషయమైన గుప్పుమని పొగలా ఇంట్లోంచి బయటకు వస్తుంది’ అన్నాడు రామయ్య. ‘సరే ప్రస్తుతానికి నా దగ్గర మీరు అడిగినంత ధనం లేదు. ఒక వారం రోజులు ఆగి రండి. అన్నట్టు... తాకట్టు లేనిదే డబ్బు ఇవ్వను’ అన్నాడు కనకయ్య. వెంటనే.. సంచిలో నుంచి ఇంటి కాగితాలు తీసి కనకయ్యకు చూపించాడు రామయ్య బావమరిది. ‘సరే.. వారానికి రండి’ అని మళ్లీ అన్నాడతను.

చెప్పినట్లుగానే వారం గడిచాక.. రామయ్య, అతని బావమరిది కనకయ్య ఇంటికి వెళ్లారు. ఇంటి కాగితాలు తీసుకుని లక్ష రూపాయలు ఇచ్చాడు కనకయ్య. నెల నెలా వడ్డీ ఇస్తానన్న వాళ్లు మూడు నెలలు పూర్తయినా.. ఇవ్వకపోయేసరికి రామయ్య ఇంటికి వెళ్లాడు. ‘ఏంటి రామయ్యా! ఇన్ని నెలలు గడుస్తున్నా.. వడ్డీ ఊసు లేదు. పైగా మీ బావమరిది ఇచ్చిన కాగితాలు నకిలీవి’ అని కోపంగా అన్నాడతను. అదే సమయానికి అక్కడికి భీమయ్య కూడా వచ్చాడు. ‘అవును అవి నకిలీవే. నువ్వు రామయ్య మీద లేనిపోనివి చెప్పి లక్ష రూపాయలు తీసుకెళ్లి.. ఇంత వరకు ఒక్క రూపాయి కూడా చెల్లించలేదు. ముల్లును ముల్లుతోనే తీయాలని పెద్దలు ఊరకనే చెప్పలేదు. నీకు గుణపాఠం చెప్పడానికి రామయ్య, తన బావమరిది ఆడిన నాటకం ఇది’ అన్నాడు భీమయ్య. దాంతో ఆశ్చర్యపోయిన కనకయ్య ఏమీ మాట్లాడకుండా నిలబడిపోయాడు. ‘ఇప్పటికైనా నీ బుద్ధి మార్చుకొని మంచిగా ఉండు. ఇలా మనుషుల్ని విడదీయాలని చూస్తే.. అది నీకే నష్టం చేస్తుంది. అసలు రాబట్టుకున్నాము. ఇక నీకు.. నీ వడ్డీకి ఒక నమస్కారం’ అన్నాడు భీమయ్య. ‘నిజమైన స్నేహం ఎప్పటికీ చెడిపోదు. మనం ఎప్పటికీ మంచి మిత్రులుగానే ఉండాలి’ అనుకున్నారు రామయ్య, భీమయ్య.  

 యు.విజయశేఖర రెడ్డి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని