మృగరాజు కాలికి గాయమైంది!

‘మృగరాజు కాలికి దెబ్బ తగిలింది. వెంటనే నీవు వెళ్లి వైద్యుడు ఎలుగుబంటిని తీసుకొని రా’ అని వానరాన్ని పిలిచి మంత్రి నక్క చెప్పింది. అది వైద్యుడు ఎలుగుబంటి దగ్గరకు పరుగు పరుగున బయలుదేరింది.

Published : 01 Mar 2024 00:06 IST

‘మృగరాజు కాలికి దెబ్బ తగిలింది. వెంటనే నీవు వెళ్లి వైద్యుడు ఎలుగుబంటిని తీసుకొని రా’ అని వానరాన్ని పిలిచి మంత్రి నక్క చెప్పింది. అది వైద్యుడు ఎలుగుబంటి దగ్గరకు పరుగు పరుగున బయలుదేరింది. ఒక ఏనుగు వానరాన్ని ఆపి.. ‘ఇంత ఉదయమే అలా పరుగు పరుగున వెళ్తున్నావు ఎందుకు?’ అని అడిగింది. వానరం తన నడక ఆపకుండానే... ‘మృగరాజు కాలికి గాయమైంది. వైద్యం కోసం ఎలుగుబంటిని తీసుకురావడానికి వెళ్తున్నాను’ అని జవాబు ఇచ్చింది.

ఏనుగు.. ‘అయ్యో మృగరాజు కాలికి దెబ్బ తగిలిందా!’ అని గుహవైపు బయలుదేరింది. ఆ పరిసరాల్లో ఉన్న జింక, ఏనుగు మాటలు విని ఈ విషయము తమ జింకల నాయకుడికి చెప్పాలనే ఉద్దేశంతో ముందుకురికింది. జింక పరుగున వెళుతున్నపుడు ఒక కుందేలు చూసి... ‘జింక మిత్రమా! ఏమైంది అలా పరిగెడుతున్నావు’ అని అడిగింది. ‘మన మృగరాజు కాలు విరిగింది’ అని చెప్పి ముందుకు వెళ్లింది. కుందేలు పొదలోకి వెళ్లి తన తల్లితో.. ‘అమ్మా! మృగరాజు కాళ్లు విరిగిపోయాయి అంట!’ అని చెప్పింది. కుందేలు తన బిడ్డతో మృగరాజు దగ్గరకు బయలుదేరింది.

వైద్యుణ్ని తీసుకురావడానికి వెళ్లిన కోతి ఇంకా రాలేదని మంత్రి నక్క గుహ బయటకు వచ్చింది. గుహ బయట అడవిలోని చాలా జంతువులు బారులు తీరి నిలబడి ఉన్నాయి. మంత్రి నక్క వాటిని చూసి.. ‘మీరంతా ఇక్కడికి ఎందుకు వచ్చారు’ అని అడిగితే.. ‘మృగరాజు కాళ్లు విరిగి పోయాయట కదా.... అందుకే పరామర్శించడానికి వచ్చాం’ అని చెప్పాయి. ఇంతలో ఎలుగుబంటిని తోడ్కొని వానరం వచ్చింది.

మంత్రి నక్క గుహ దగ్గర ఉన్న జంతువులతో... ‘మీరు ఇక్కడే ఉండండి’ అని చెప్పి వైద్యుణ్ని లోపలికి తీసుకువెళ్లింది. గుహ బయట ఉన్న జంతువులు ఒకదానితో మరొకటి ‘మృగరాజు ఎడమకాలు పూర్తిగా విరిగిపోయిందట!.... వెనక కుడి కాలికైతే విపరీతమైన రక్తం కారుతోందట!... మృగరాజుకు చాలా పెద్ద ప్రమాదమే జరిగిపోయింది’ అని మాట్లాడుకుంటున్నాయి.

ఎలుగుబంటి మృగరాజు ముందు కాలికి తగిలిన చిన్న దెబ్బకు పసరు మందు వేసింది. మృగరాజు గుహ బయటకు వచ్చింది. అది సునాయాసంగా నడిచి రావడం చూసి బయట వేచి ఉన్న జంతువులు ఆశ్చర్యపోయాయి. తమలో తాము గుసగుసలాడుకున్నాయి. అప్పుడు మృగరాజు పక్కనే ఉన్న మంత్రి నక్క.. ‘మృగరాజుకు తగిలిన చిన్న దెబ్బకు, మీరంతా చిలువలు పలువలు చేసి, కాళ్లు విరిగిపోయాయని తీర్మానం చేసుకుని వచ్చారు. అవునా...!’ అని అడిగింది.

‘మాకు అలాగే సమాచారం అందింది’ అని అన్నాయి. ‘మీకెవరు అలా చెప్పారు’ అని మృగరాజు అడగడంతో ఒకదాని ముఖాలు మరోటి చూసుకున్నాయి. మృగరాజు వెంటనే వానరాన్ని.. ‘నువ్వు నా కాళ్లు విరిగాయని చెప్పావా?’ అని అడిగింది. ‘లేదు మృగరాజా! నేను వైద్యుణ్ని తీసుకురావడానికి హడావిడిగా వెళుతున్నప్పుడు అదిగో ఆ ఏనుగు అడిగితే, రాజు గారి కాలికి చిన్న దెబ్బ తగిలింది అని చెప్పా! నేను మరి ఎవరికి ఏ సమాచారమూ ఇవ్వలేదు’ అని చెప్పింది.

అప్పుడు మంత్రి నక్క కలగజేసుకుని... ‘మృగరాజా! నేడు మనం అదిగో తోక అంటే... ఇదిగో పులి అనే లోకంలో ఉన్నాం. గత వారం కూడా కొన్ని జంతువులు మీరు లేనప్పుడు నా దగ్గరకు వచ్చి మన అడవిలోని కొలనులో కొన్ని ఏనుగు పిల్లలు దిగి బురదమయం చేస్తున్నాయని ఫిర్యాదు చేశాయి. నేను అప్పుడు వాటితో మృగరాజుకు, వాటి తల్లిదండ్రులకు విషయం తెలియజేసి ఏనుగు పిల్లలను అదుపు చేయిస్తానని మాట ఇచ్చాను. కానీ నేను అన్న మాట ఆ ఏనుగుల తల్లిదండ్రులకు.. మృగరాజుతో చెప్పి వాటిని అడవి నుంచి తరిమేస్తానని నేను అన్నట్టు చేరింది. ఆ విషయాన్నే నాపై మీకు ఆ ఏనుగుల తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. నేను అన్నమాట వేరు... వారి చెవులకు చేరేటప్పటికీ దాని రూపమే మారిపోయింది. ఇప్పుడు కూడా మీకు తగిలిన చిన్న గాయం చెవులు మారి.. మారి.. మృగరాజు కాళ్లు విరిగిపోయాయి అన్నంతగా మారిపోయింది’ అని చెప్పింది.

మృగరాజు అక్కడకు చేరిన జంతువులను ఉద్దేశించి.. ‘మంత్రి నక్క చెప్పిన మాట నిజమే. కళ్లతో చూడకుండా ఎవరో చెప్పిన మాటలు విని మనం ఇతరుల ప్రవర్తన అంచనా వేయడం సరికాదు. దాని వల్ల అనర్థాలే జరుగుతాయి. ఏనుగుల ఫిర్యాదు విని నేను తొందరపడి చర్యలు తీసుకుని ఉంటే..., చేయని తప్పునకు మంత్రి నక్క శిక్ష అనుభవించి ఉండేదేమో! అందుకే ఇప్పటికైనా ఇతరులు చెప్పే మాటను చక్కగా విని, ఆ విషయాన్ని అలాగే చెప్పాలి. కానీ మన సొంత ఆలోచన ఉపయోగించి, లేనిది ఉన్నట్లు.. ఉన్నది లేనట్లు చెబితే చాలా ప్రమాదాలు జరుగుతాయి’ అని చెప్పింది. అక్కడికి వచ్చిన గున్న ఏనుగుల తల్లిదండ్రులు ముందుకు వచ్చి మంత్రి నక్కతో.. ‘క్షమించండి... అప్పుడు మీపై తప్పుగా మేము మృగరాజుకు ఫిర్యాదు చేశాం’ అని క్షమాపణలు కోరుకున్నాయి.

మొర్రి గోపి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని