ఇంతకీ ఆ పెట్టెలో ఏముంది..?

శాలినీ రాజ్యాన్ని కీర్తిసేనుడు పాలించేవాడు. అతనికి విశ్వాసపాత్రుడైన ఒక ఆంతరంగికుడు కావాల్సి వచ్చింది. అందుకోసం మహామంత్రి సుబుద్ధుడి సలహా అడిగాడు రాజు.

Updated : 06 Mar 2024 04:31 IST

శాలినీ రాజ్యాన్ని కీర్తిసేనుడు పాలించేవాడు. అతనికి విశ్వాసపాత్రుడైన ఒక ఆంతరంగికుడు కావాల్సి వచ్చింది. అందుకోసం మహామంత్రి సుబుద్ధుడి సలహా అడిగాడు రాజు. ఒక ప్రకటన చేయిద్దామని సలహా ఇచ్చాడు ఆ మంత్రి. అనుకున్నట్లుగానే ఆ పదవి కోసం చుట్టుపక్కల గ్రామాల్లో దండోరా వేయించారు. అయితే.. దాని కోసం పోటీ పడటానికి చాలా మంది యువకులు వచ్చారు. వారికి కొన్ని పరీక్షలు నిర్వహించి తర్వాత అందులో నుంచి ఒక ముగ్గురిని, ప్రాథమికంగా ఎంపిక చేశారు రాజు. కానీ వారిలో ఎవరికి పదవి అప్పగించాలో ఆయనకు అర్థం కాలేదు. అప్పుడు మంత్రి.. రాజుకి ఒక సలహా ఇచ్చాడు. దానికి సరేనన్న మహారాజు వారిని ఒక్కొక్కరిగా లోపలికి పిలవడం ప్రారంభించారు.

ముందుగా నరేంద్రుడిని పిలిచి ఒక చిన్న పెట్టెను ఇచ్చి.. ‘ఇందులో మూడు రాళ్లు ఉన్నాయి. వాటిని జాగ్రత్తగా చూసుకో. వారం రోజుల తర్వాత మళ్లీ ఈ పెట్టెను భద్రంగా తీసుకొచ్చి నాకు అప్పజెప్పు’ అని చెప్పారు రాజు. సరేనంటూ అక్కడి నుంచి వెళ్లిపోయాడు నరేంద్రుడు. ఆ తర్వాత రెండో వ్యక్తి సురేంద్రుడిని రమ్మని.. అతనికి కూడా అలాంటి పెట్టెనే ఇచ్చి.. మొదటి వ్యక్తికి చెప్పినట్లే చెప్పి పంపించారు. అలాగేనంటూ పెట్టె తీసుకొని వెళ్లిపోయాడతను. ఆ వెంటనే వచ్చిన మూడో వ్యక్తి దేవేంద్రుడికి కూడా అలాగే చెప్పి పంపించారు మహారాజు.

పెట్టె తీసుకొని ఇంటికి వెళ్లిన నరేంద్రుడు.. ‘మహారాజు ఇందులో రాళ్లు ఉన్నాయని అన్నారు. వాటిని జాగ్రత్తగా చూసుకోమని ఎందుకు చెబుతారు. అయినా.. ఒకసారి తెరిచి చూస్తే అందులో ఉన్నది రాళ్లా? రత్నాలా? తెలుస్తుంది. మళ్లీ ఎప్పటిలా మూసేస్తే సరిపోతుంది!’ అనుకుంటూ దాన్ని తెరిచాడు. రాజు చెప్పినట్లు అందులో రాళ్లు ఉన్నాయి. అది చూసి ఆశ్చర్యపోయిన నరేంద్రుడు.. ‘అయ్యో! రాజు చెప్పింది నిజమే! ఇందులో రాళ్లే ఉన్నాయి. అనవసరంగా ఈ పెట్టెను తెరిచి చూశాను’ అనుకున్నాడు. ఆ తర్వాత అతి కష్టం మీద పెట్టెను మూసివేశాడు. రెండో వ్యక్తి సురేంద్రుడికి కూడా అతనికి వచ్చిన అనుమానమే వచ్చి, పెట్టెను తెరిచి చూశాడు. ఒక్కసారిగా అతని కళ్లు జిగేలుమన్నాయి. ఎందుకంటే.. అందులో మూడు విలువైన రత్నాలు ఉన్నాయి. అప్పుడతను.. ‘పాపం! మహారాజు వీటిని రాళ్లు అనుకొని నాకు ఇచ్చారు. కాబట్టి రత్నాలు నేను తీసుకొని.. రాళ్లు ఇందులో పెడతాను’ అని ఆనందంగా రత్నాలు తీసుకున్నాడు.

మూడో వ్యక్తి అయిన దేవేంద్రుడికీ అదే ఆలోచన వచ్చింది. ‘రాజు ఈ పెట్టెలో రాళ్లు ఉన్నాయని చెప్పారు. వాటిని జాగ్రత్తగా కాపాడాల్సిన అవసరం ఏముంది. ఇందులో ఏదో మర్మం ఉంది. అయినా ఏముంటే నాకేంటి? చెప్పిన పని చేస్తే చాలు. అందులో రత్నాలు ఉండనీ ఇంకేమైనా ఉండనీ..! నాకు కావాల్సింది పదవి మాత్రమే. తాత్కాలిక అవసరాలకు ఆనందపడి.. కొలువును దూరం చేసుకోవడం సరైంది కాదు! కాబట్టి నేను ఈ పెట్టె జోలికి వెళ్లనే వెళ్లను’ అని దాన్ని పక్కన పెట్టేశాడు.

అలా వారం రోజులు గడిచాయి. ముగ్గురూ కోటకు వెళ్లి వారి దగ్గరున్న పెట్టెలను రాజుకు అందించారు. నరేంద్రుడి పెట్టెను చూసి.. ‘నువ్వు ఈ పెట్టెను తెరిచినట్లున్నావు’ అన్నాడు మంత్రి. అప్పుడతను కంగారుపడుతూ.. ‘లేదండి తెరవలేదు.. నాకేం తెలియదు’ అని జవాబిచ్చాడు. ‘పెట్టెను తెరిచిందే కాకుండా.. ఇంకా అబద్ధాలు చెబుతున్నావా.. నువ్వు ఈ పదవికి అర్హుడివి కాదు వెళ్లిపో’ అన్నాడు మంత్రి. ఆ తర్వాత సురేంద్రుడి పెట్టెను చూసి.. ‘నువ్వు కూడా తెరిచావు కదూ..!’ అన్నాడు మంత్రి. ఇక చేసేదేం లేక.. ‘అవునండీ..! తెరిచాను నన్ను క్షమించండి’ అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడతను. వెంటనే తాను తీసుకున్న రత్నాలు తిరిగిచ్చి అక్కడి నుంచి వెళ్లిపోయాడు.

మూడో వ్యక్తి అయిన దేవేంద్రుడిని కూడా.. ‘నువ్వు కూడా పెట్టెను తెరిచే ఉంటావు కదా! ఇందులో ఏముంది చెప్పు’ అని అడిగాడు మహారాజు. అప్పుడతను.. ‘మహారాజా! నేను ఈ పెట్టె తెరవనేలేదు. ఇందులో ఏముందో నాకు తెలియదు. మీరు భద్రంగా వారం రోజులు నా వద్ద ఉంచుకొని మళ్లీ అప్పగించమన్నారు.. నేను అదే చేశాను’ అని అన్నాడు. ఆ తర్వాత కొన్ని పరీక్షలతో అతను పెట్టె తెరవలేదని నిర్ధారించుకున్నాడు రాజు. ‘నీ నిజాయతీనే ఈ రోజు నీకు ఈ కొలువును తెచ్చిపెట్టింది. ఎవరూ చూడటం లేదని నువ్వు కూడా పెట్టెను తెరిచి ఉంటే.. ఈ పదవి నీకు వచ్చేది కాదు’ అని చెప్పి.. దేవేంద్రుడిని పదవిలో చేర్చుకున్నాడు మహారాజు.

 సంగనభట్ల చిన్న రామకిష్టయ్య


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని