ఇట్లు.. తాత కాని తాత!

కృష్ణాపురంలో ఆదిత్యుడు ఉండేవాడు. బాల్యంలోనే అతని తల్లీతండ్రీ చనిపోవడంతో చిన్నచిన్న పనులు చేసుకుంటూ జీవనం సాగించేవాడు. అదే ఊరిలో రామయ్య అనే వృద్ధుడు మూలికా వైద్యం చేస్తూ నలుగురికి తలలో నాలుకలా ఉండేవాడు.

Updated : 14 Mar 2024 07:00 IST

కృష్ణాపురంలో ఆదిత్యుడు ఉండేవాడు. బాల్యంలోనే అతని తల్లీతండ్రీ చనిపోవడంతో చిన్నచిన్న పనులు చేసుకుంటూ జీవనం సాగించేవాడు. అదే ఊరిలో రామయ్య అనే వృద్ధుడు మూలికా వైద్యం చేస్తూ నలుగురికి తలలో నాలుకలా ఉండేవాడు. అతడు సుమారు ఏభై ఏళ్లకిందటే ఆ ఊరు వచ్చి స్థిరపడటం వల్ల.. ఎవరికి ఏ జబ్బు వచ్చినా రామయ్య దగ్గరికి తీసుకెళితే, తప్పకుండా నయమవుతుందనే నమ్మకం ఊళ్లో అందరికీ ఉండేది. అతనికి భార్యా పిల్లలూ ఎవరూ లేరు.

‘ఈ రామయ్య దగ్గర పనికి కుదిరి వైద్యం నేర్చుకుంటే.. ఈయన తర్వాత నేనే వైద్యుడిగా ఊరికి సేవ చేయవచ్చు. డబ్బు కూడా సంపాదించుకోవచ్చు’ అని భావించాడు ఆదిత్యుడు. అనుకున్నదే తడవుగా రామయ్య దగ్గరికి వెళ్లాడు. రామయ్య గుడిసె లోపల గుళికలు చేసుకుంటూ... పద్యాలు పాడుకుంటూ ఉన్నాడు. ఆదిత్యుడిని చూడగానే ‘నీకేమైంది... నిక్షేపంలా ఉన్నావు... నీకే మందూ అవసరం లేదు’ అని కసిరాడు రామయ్య.  

 ‘నేను వైద్యం కోసం రాలేదు!’ అన్నాడు ఆదిత్యుడు. ‘మరి?’ అని ప్రశ్నించాడు రామయ్య. ‘వైద్యం నేర్చుకోవడానికొచ్చాను!’ అని జవాబిచ్చాడు ఆదిత్యుడు. ‘అంత సులువు అనుకున్నావా రోగాలు తగ్గించడం?’ అని మళ్లీ ప్రశ్నించాడు రామయ్య. ‘తెలుసు తాతా...! అందుకే నేర్చుకోవడానికొచ్చాను. నువ్వా ముసలివాడివవుతున్నావు... నాకూ ఎవరూ లేరు. కాబట్టి నేను నీ దగ్గరుండి నీకు అన్ని పనులూ చేసి పెడతా. నాకు నువ్వు వైద్యం నేర్పు చాలు!’ అన్నాడు ఆదిత్యుడు.

 ‘నీతో చేయించుకునే పనులేవీ నాదగ్గర లేవు... వెళ్లు!’ అని కసురుకున్నాడు రామయ్య. ‘తాతా నువ్వా ముసలివాడివి... ఇంకా అడవికి వెళ్లి మూలికలూ అవీ ఏం తెస్తావు... నేను తీసుకొస్తా. నువ్వు గుళికలు చెయ్యి!’ అని అభ్యర్థనగా అన్నాడు ఆదిత్యుడు. రామయ్య ఏమనుకున్నాడో ఏమో... ‘సరే!... మూలికలు నేను తీసుకురాగలను. ఇంటిపని మాత్రం నువ్వు చెయ్యి.. చాలు. చనువు ఇచ్చానని మందుల తయారీ దగ్గరకొచ్చావో కళ్లు పీకేస్తా!’ అని హెచ్చరించాడు రామయ్య.

దొరికిందే కొలువు అనుకుని సరేనన్నాడు ఆదిత్యుడు. రామయ్య అతనితో అన్ని పనులూ చేయించుకున్నా అడవికి తోడు తీసుకెళ్లేవాడు కాదు. అలాగే మూలికలు నూరేటప్పుడూ, గుళికలు చుట్టేటప్పుడు దగ్గరికి కూడా రానిచ్చేవాడు కాదు. నెలలు దొర్లిపోతున్నాయి కానీ, ఆదిత్యుడికి ఏ చిట్టి చిట్కా కూడా చెప్పలేదు రామయ్య.
ఇలా కొన్నేళ్లపాటు రామయ్యకు సకల సేవలూ చేశాడు ఆదిత్యుడు. దాంతో ఒకరి మీద ఒకరికి ఎంతో ఆప్యాయత, అనురాగం ఏర్పడింది. ఎప్పుడూ రోజులు ఒకేలా ఉండవు కదా! రామయ్యకు వయసు మీద పడటంతో తీవ్రంగా జబ్బు చేసింది. ఆదిత్యుడు ఎంతో దు:ఖించాడు. సీసాలో ద్రావణం, రెండు గుళికలు తెచ్చి ఇచ్చాడు. ‘ఈ మందు తాగు తాతా! జబ్బు పారిపోతుంది’ అన్నాడు. ‘నాకొచ్చిన జబ్బు ఈ గుళికలతో పోదు. నాతోనే పోతుంది!’ అని వేదాంతిలా నవ్వుతూ అన్నాడు రామయ్య. ‘పోనీ ఆ గుళిక పేరు చెప్పు... తయారీ విధానం నాకు చెప్పకు. ఆ మందు తీసుకో!’ అని ఆదిత్యుడు అన్నా.. రామయ్య తీసుకోలేదు.

తనకు అంతిమ ఘడియలు సమీపిస్తున్న సంగతి రామయ్యకు అర్థమవుతోంది. ఒకరోజు ఆదిత్యుడిని దగ్గరికి పిలిచి వైద్యంలోని రహస్యాలు చెప్పాలని భావించాడు. ఓ రాత్రి.. ‘నాయనా... నా మూలికా రహస్యాలు, చిట్కాలు, తయారీ విధానాలను ఓ తాటాకు గ్రంథంలో రాసి, అటక మీద పాత కుండలో దాచాను. నేను చనిపోయాక వాటిని చదివి నేర్చుకో... నీ శ్రద్ధ, సహనం వల్ల తప్పకుండా నీకు న్యాయం జరుగుతుంది’ అని చెప్పి నిద్రలోకి జారుకున్నాడు రామయ్య. అదే అతనికి శాశ్వత నిద్ర అవుతుందని ఆదిత్యుడు ఊహించలేదు. ఇంటిపెద్ద చనిపోతే ఎలా బాధపడతాడో అలా బాధపడ్డాడు. రామయ్య తాతకు అన్ని కర్మలూ చేసి ఇంటికి చేరాడు.
అన్నాళ్లు రామయ్యతో ఉన్న తాను ఇప్పుడా ఇంట్లో ఉండలేక వేరే చోటుకు వెళ్లిపోవాలనుకున్నాడు. ఇంతలో తాత చెప్పిన చివరి మాటలు గుర్తుకొచ్చాయతనికి. వెంటనే అటక మీద పాతకుండలో తాటాకు గ్రంథం కోసం వెతికాడు. ఆ కుండలో అది లేదు. కేవలం ఓ లేఖ ఉంది. అందులో వైద్య విశేషాలు ఏమీ లేవు. కానీ.. ‘నాయనా ఆదిత్యా... నా జీవితం చరమదశలో నీవు తోడుగా వచ్చావు. మొదట నువ్వు వైద్య విషయాలు నేర్చుకోవాలనే చేరావు. రాను రాను మనిద్దరి మధ్య చెప్పలేని అనుబంధం ఏర్పడింది. నీకో రహస్యం చెప్పాలి. దాదాపు 50 ఏళ్ల నుంచి నేను వైద్యుడిగా బతికాను. నిజానికి నాకు ఏ వైద్యమూ రాదు. ప్రజలంతా విశ్వాసంతో నేను ఇచ్చిన గుళికలు మందుబిళ్లలుగా స్వీకరించారు. అవి కేవలం బలానికి మాత్రమే. నామీద నమ్మకంతో నాది మంచి హస్తవాసి అంటూ ప్రచారం జరిగి అందరికీ మంచే జరిగింది. ఇప్పుడు నువ్వు వచ్చి వైద్యం అంటే నీ మీద జనానికి నమ్మకం లేదు. కాబట్టి నువ్వు ఇచ్చే మందు వాళ్లకు మానసిక ప్రశాంతత ఇవ్వదు. నీ మీద కేవలం వాళ్లకు జాలి మాత్రమే ఉంది. నమ్మకం పెంచుకోవడానికి చాలా సమయం పడుతుంది. నమ్మకానికి మూలికా వైద్యానికి చాలా దగ్గర సంబంధం ఉంది. నువ్వు నా దగ్గర విద్య నేర్చుకుని సాధన మొదలుపెట్టేసరికి ఈలోగా ఇంకో వైద్యుడు ఈ ఊరివారికి దగ్గరవుతాడు. లేదా.. అందరూ తమ రోగనివారణ కోసం పక్క ఊరికి వెళ్లి వైద్యం చేయించుకుంటారు. నువ్వు ఖాళీగా ఉండి మనశ్శాంతి కోల్పోతావు. అందుకే.. ఈ ఇల్లు నీదే. నాకెవరూ లేరు. పెరట్లో ఉన్న జామచెట్టు కింద లంకెబిందెలు దాచాను. ఆ సంపదా నీదే. చివరిదశలో నువ్వెంతో సాయం చేశావు. ఆ ధనం నీకు చెందడమే ధర్మం. దాంతో నువ్వు ఏదైనా వ్యాపారం చెయ్యి. వృద్ధిలోకి వస్తావు. ఇట్లు నీ తాతకాని తాత’ అని రాసి ఉంది. ఎటువంటి రక్త సంబంధం లేకపోయినా తన గురించి ఆలోచించిన రామయ్యను నిత్యం స్మరిస్తూ, వ్యాపారం మొదలు పెట్టాడు ఆదిత్యుడు. కృష్ణాపురంలో అంచెలంచెలుగా ఎదిగాడు. విశ్వాసంతో పనిచేస్తే ఎప్పటికైనా మంచి రోజులు వస్తాయి అని అందరూ చెప్పుకునేలా వృద్ధి చెందాడు.

- తరిగొప్పుల వీఎల్‌ఎన్‌ మూర్తి


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని