గోవిందుడు అందరివాడు!

గోవిందుడు కొత్తగా గుర్రపు బండి అద్దెకు తెచ్చుకుని నడుపుతున్నాడు. అతను ప్రయాణికులతో చాలా దురుసుగా ప్రవర్తించేవాడు. తండ్రి చిన్నతనంలోనే చనిపోవటంతో తల్లి బాగా గారాబం చేసింది. దాంతో.. మొండిగా పెరిగాడతను.

Updated : 22 Mar 2024 04:46 IST

గోవిందుడు కొత్తగా గుర్రపు బండి అద్దెకు తెచ్చుకుని నడుపుతున్నాడు. అతను ప్రయాణికులతో చాలా దురుసుగా ప్రవర్తించేవాడు. తండ్రి చిన్నతనంలోనే చనిపోవటంతో తల్లి బాగా గారాబం చేసింది. దాంతో.. మొండిగా పెరిగాడతను. ఇంత కాలం తల్లి సంపాదన మీదనే ఇల్లు గడిచింది. పొరుగూరిలో ఉన్న ఓ కర్మాగారంలో ఆమె రోజు కూలీగా పని చేసేది. కొంతకాలంగా దగ్గు, ఆయాసంతో బాధపడుతోంది. ప్రస్తుతం పనికి వెళ్లలేక మంచానికే పరిమితమైంది. కొడుకు ఏదో ఒక పనిలో పడి సంపాదించుకుంటే పెళ్లి చేసి బాధ్యత తీర్చుకోవాలనుకుంది.

ఒకరోజు గోవిందుడి గుర్రపు బండిలో అయిదుగురు ప్రయాణికులు కూర్చోగా.. ఇంకొకరికి చోటుంది. ఆ ఒక్కరూ ఎక్కితే బండి నాదర్‌గుల్‌కు బయలుదేరుతుంది. కానీ పావుగంటయినా ఎవరూ రాలేదు. కాసేపటికి ఒక పెద్దాయన చేతి సంచితో అటుగా వచ్చాడు. ఆయన్ను చూడగానే.. ‘నాదర్‌గుల్‌..! నాదర్‌గుల్‌..!’ అని అరిచాడు గోవిందుడు. ఆయన కండువాతో చెమటలు తుడుచుకుంటూ.. ‘బాబూ! బండి.. ఆదిభట్ల వెళ్తుందా?’ అని అడిగాడు. ‘లేదు.. నాదర్‌గుల్‌ వరకే వెళ్తుంది. అక్కడి నుంచి ఇంకో కిలోమీటరు దూరం ఉంటుంది. నాదర్‌గుల్‌ వరకు వస్తానంటే ఎక్కి కూర్చో.. రెండు రూపాయలవుతుంది’ అన్నాడు గోవిందుడు బండి కదిలిస్తూ.

మధ్యాహ్నం భోజన సమయం కావడంతో.. అక్కడ వేరే బండ్లు కూడా కనిపించలేదు. మారు మాట్లాడకుండా బండి ఎక్కి కూర్చున్నాడు పెద్దాయన. ప్రయాణికులిద్దరు దారిలో దిగారు. బండి నాదర్‌గుల్‌ చేరుకున్నాక అందరూ దిగిపోయారు. కానీ, ఆ పెద్దాయన అలాగే కూర్చుండిపోయాడు. ‘ఓ.. పెద్దాయనా! బండి దిగు.. నేను తిరిగి బాలాపూర్‌ వెళ్లాలి!’ అని అరిచాడు గోవిందుడు. ‘బాబూ! ఆదిభట్ల వరకు తీసుకెళ్తావా?’ అని మళ్లీ ఆశగా అడిగాడు పెద్దాయన. ‘దిగు..! దిగు..! తిన్నగా నడుచుకుంటూ పో.. అక్కడికి బండి రాదు’ అని కఠినంగా సమాధానం ఇచ్చాడు గోవిందుడు.

‘బాబూ! ఒక ముఖ్యమైన పని మీద వచ్చాను. నేను అత్యవసరంగా ఒక చోటకు వెళ్లాలి’ అన్నాడు పెద్దాయన. గోవిందుడు మౌనంగా ఉండిపోయాడు. ‘నీకు మరో రెండు రూపాయలిస్తాను.. అక్కడికి చేర్చు’ అన్నాడా పెద్దమనిషి. ‘రెండు రూపాయలు కాదు. అయిదు రూపాయలవుతుంది’ అన్నాడు గోవిందుడు. ‘అయిదు రూపాయలా! నాలుగు కిలోమీటర్ల దూరానికి రెండు రూపాయలు తీసుకున్నావు. ఒక్క కిలోమీటరు దూరానికి అయిదు రూపాయలా?’ అని ఆశ్చర్యంగా అడిగాడు పెద్దాయన.

‘ఈ మార్గంలో ఎక్కేవారు దొరకరు. నిన్నొక్కడినే తీసుకెళ్లాలి. మళ్లీ నేను ఖాళీ బండితో రావాలి. అయినా ఇదంతా.. కుదిరేది కాదు కానీ, ముందు బండి దిగు.. బాలాపూర్‌ వెళ్లే వాళ్లొస్తున్నారు’ అని విసుక్కున్నాడు గోవిందుడు. ఇక ఏం చేయలేక అయిదు రూపాయలివ్వడానికి పెద్దాయన ఒప్పుకోవడంతో.. బండి ఆదిభట్ల కదిలింది. దారిలో.. ‘ఆదిభట్లలో ఎక్కడి వరకు వెళ్లాలి’ అని అడిగాడు గోవిందుడు. ‘రామాలయం పక్కన ఉండే గౌరమ్మ ఇంటికి వెళ్లాలి’ అని చేతి సంచిలోంచి ఉత్తరం తీసి చూస్తూ అన్నాడు పెద్దాయన. గోవిందుడు ఆయన్ను పరీక్షగా చూసి.. ‘ఆమె నీకేమవుతుంది?’ అంటూ రామాలయం సందు తిప్పాడు.

‘నా పేరు సిద్ధరామయ్య. కాశీలో ఆయుర్వేద వైద్యం చేస్తుంటాను. గౌరమ్మ తన ఆరోగ్యం క్షీణించిందని, కాశీకి వచ్చి కలుద్దామంటే కొడుకు బాధ్యత లేకుండా తిరుగుతున్నాడని బాధపడుతూ గత మాసం ఉత్తరం రాసింది. నేను రామేశ్వరం వెళ్తూ.. ఆమెను పరీక్షించి మందులు ఇచ్చి వెళ్దామని ఇటు వచ్చాను’ అన్నాడు సిద్ధరామయ్య. ‘అయ్యా! ఆ గౌరమ్మ మా అమ్మనే. ఇంత కాలం బాధ్యత లేకుండా తిరిగాను. ఈ పక్షం రోజులుగానే అద్దెకు తీసుకుని ఈ గుర్రపుబండి నడుపుతున్నాను. మీ వంటి మంచి వారిని నేను గుర్తించలేకపోయాను. మీతో చాలా కఠినంగా మాట్లాడాను. నన్ను మన్నించండి’ అని కాళ్ల మీద పడ్డాడు గోవిందుడు. తర్వాత ఇంట్లోకి తీసుకెళ్లాడు.

కాసేపటి తర్వాత, ఆ పెద్దాయన గౌరమ్మను పరీక్షించి.. ‘ఈ మందులు వాడండి. త్వరలోనే కోలుకుంటారు. మరేం ఫర్వాలేదు’ అన్నాడు. ఆ పూటకు వాళ్లింట్లోనే ఆయనకు భోజనం ఏర్పాటు చేశారు. సాయంత్రానికి దగ్గరుండి సిద్ధరామయ్యను.. గోవిందుడు రామేశ్వరం వెళ్లే రైలెక్కించాడు. ఆనాటి నుంచి ప్రయాణికులనే కాదు అందరినీ గౌరవిస్తూ, సౌమ్యంగా మాట్లాడటం అలవాటు చేసుకున్నాడు. ఇతరులకు తనకు తోచిన సాయం చేయడం ప్రారంభించాడు. ఇలా అందరికీ తలలోనాలుకలా మారి.. గోవిందుడు అందరివాడు అనిపించుకున్నాడు.

పైడిమర్రి రామకృష్ణ


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని