మూడు వజ్రాలు.. ముగ్గురు మిత్రులు..!

టైగ్రిస్‌ నది ఒడ్డున ఉన్న నగరంలో అలీ, అల్లా, అర్షద్‌ అనే ముగ్గురు స్నేహితులు ఉండేవారు. వాళ్లు చిన్నప్పటి నుంచి కలిసి చదువుకున్నారు. పెద్దయ్యాక.. ఎవరికి వారు తమ సొంత వ్యాపారాలు చేసుకోసాగారు. ఒకరోజు మిత్రులు ముగ్గురూ కలిసినప్పుడు.. ‘ఈ వ్యాపారంలో ఒకసారి లాభం, మరోసారి నష్టం వస్తోంది.

Updated : 30 Mar 2024 06:24 IST

టైగ్రిస్‌ నది ఒడ్డున ఉన్న నగరంలో అలీ, అల్లా, అర్షద్‌ అనే ముగ్గురు స్నేహితులు ఉండేవారు. వాళ్లు చిన్నప్పటి నుంచి కలిసి చదువుకున్నారు. పెద్దయ్యాక.. ఎవరికి వారు తమ సొంత వ్యాపారాలు చేసుకోసాగారు. ఒకరోజు మిత్రులు ముగ్గురూ కలిసినప్పుడు.. ‘ఈ వ్యాపారంలో ఒకసారి లాభం, మరోసారి నష్టం వస్తోంది. కాబట్టి మనం సముద్ర వ్యాపారం చేద్దాం. వచ్చిన లాభాలు సమానంగా పంచుకుందాం’ అన్నాడు అలీ. ‘అవును! నిజమే.. ఇలా చేస్తే బాగుంటుంది’ అన్నాడు అర్షద్‌. సరేనంటూ ఇద్దరి మాటలకు తలూపాడు అల్లా. అలా ముగ్గురు కలసి ముందుగా ఓ మంచి మర పడవ కొనుగోలు చేశారు. కొంత మంది సిబ్బందిని నియమించుకొని ఇక వ్యాపారం చేయడం మొదలుపెట్టారు.

మొదటి పదిహేను రోజుల వ్యాపారంలో కొద్దిపాటి లాభం వచ్చింది. తక్కువ ధరకు సరకు కొనడం, కాస్త ఎక్కువ ధరకు అమ్మడం వారి పని. కొన్ని నెలల తర్వాత వాళ్లు సముద్ర తీరాన ఉన్న హంసల దీవికి వెళ్లారు. అక్కడ రత్నాలు, వజ్రాలు చాలా ప్రత్యేకం. అక్కడి హంసలు సుదూర ప్రాంతాలకు ప్రయాణించి.. ఒక్కోచోట తళుక్కుమనే రాళ్లు తెచ్చి వ్యాపారులకు ఇస్తాయి. వాళ్లకు అనుకూలంగా ఆ హంసలకు శిక్షణ ఇస్తారు. చాలా విలువైన వజ్రాలు అక్కడ చౌకగానే దొరుకుతాయి. ‘ఇక్కడ వజ్రాలు కొని.. మన నగరంలో అమ్మితే ఒకేసారి కోటీశ్వరులం కావచ్చు’ అన్నాడు అలీ.

అప్పుడు.. ‘ఆ వ్యాపారం అందరికీ కలిసిరాదని మా అక్క చెప్పింది. నాకెందుకో భయంగా ఉంది.. మనం చక్కగా మన వ్యాపారమే చేసుకుందాం’ అన్నాడు అర్షద్‌. ‘కష్టపడి ఇంత దూరం వచ్చింది.. తిరిగి వెళ్లడానికా! మన దగ్గర ఉన్న ధనంతో ఆ వజ్రాలు కొని, మన నగరంలో అమ్మాల్సిందే’ అని బదులిచ్చాడు అల్లా. ఇలా ఇద్దరూ ఒకే మాట మీద ఉండటంతో.. తమ దగ్గర ఉన్న డబ్బుతో కొన్ని చిన్నవాటితో సహా.. మూడు ప్రత్యేక వజ్రాలు కొనుక్కొని బయలుదేరారు. ‘అతి విలువైన మూడు వజ్రాలు నేనే తీసుకుంటాను. మిగతా ఇద్దరినీ తప్పిస్తే, ఇక జీవితంలో వెనక్కి తిరిగి చూడాల్సిన పని ఉండదు’ అని మనసులోనే అనుకున్నాడు అల్లా. దాంతో ఆ రోజు రాత్రి మిత్రులు తినే భోజనంలో విషం కలిపాడు. ముగ్గురూ భోజనాలకి కూర్చున్నారు. అర్షద్‌ తినబోతుండగా.. ‘ఒక్క క్షణం ఆగరా! నన్ను క్షమించు.. ఆ అన్నంలో విషం కలిపాను’ అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు అల్లా. అప్పుడు.. ‘మీరు కూడా నన్ను క్షమించండి, నేను మీ భోజనంలో విషం కలిపాను’ అని చెప్పాడు అలీ. నేనూ అదే పని చేశాను.. నన్నూ క్షమించండి’ అన్నాడు అర్షద్‌. అలా ఒకరికి తెలియకుండా మరొకరు భోజనంలో విషం కలిపి, వజ్రాలు దక్కించుకోవాలని చూశారు.

కాసేపటికి.. ‘ఇదంతా వజ్రాల ప్రభావమే’ అన్నాడు అర్షద్‌. ‘ఏది ఏమైనా.. మన స్నేహం కన్నా ఆ వజ్రాలు ఏం ఎక్కువ కాదు. అందుకే చివరి నిమిషంలో మనల్ని మనం రక్షించుకున్నాం’ అన్నాడు అల్లా. ఇంతలోనే నలుగురు సముద్ర దొంగలు పడవలోకి ప్రవేశించారు. కత్తులతో చంపేస్తామంటూ బెదిరించి.. వాళ్ల దగ్గర ఉన్న వజ్రాలను తీసుకెళ్లారు. ‘ఈ మూడు వజ్రాలు నలుగురం పంచుకోలేం కదా!’ అంటూ.. పక్కన ఉన్న దొంగని కత్తితో పొడిచేశాడు ఒకడు. ‘ఇంకా తగ్గితే మనకే లాభం’ అనుకుంటూ ఒకరినొకరు పొడుచుకొని అందరూ చనిపోయారు. అప్పుడు అర్షద్‌.. ‘చూశారా మిత్రమా! వజ్రాల ప్రభావం’ అన్నాడు. ‘ఇది వజ్రాల ప్రభావం కాదు.. నాయనా అతి విలువైనవి, దాచుకోవడానికి వీలుగా ఉండే వస్తువులు ఎవరైనా సొంతం చేసుకోవాలని చూస్తారు. అలాంటి సమయంలో ఏమైనా జరగవచ్చు. మీ మంచితనమే.. మిమ్మల్ని, మీ చిన్న వజ్రాలను కాపాడింది. వాటిని నగరంలో అమ్మి మంచి పనికి ఆ ధనాన్ని ఉపయోగించండి’ అని చెప్పాడు, మొదటి నుంచి అక్కడే ఉండి అంతా గమనిస్తున్న ఒక పెద్దాయన. ‘డబ్బు అవసరమే.. కానీ అదే అన్నింటికీ మూలం కాదు. అవసరానికి మించింది ఏదైనా మనం చెడు దారిలో నడిచేలా చేస్తుంది. కాబట్టి మనం ఎప్పటిలాగే చక్కగా మన సముద్ర వ్యాపారం చేసుకుందాం’ అంటూ అక్కడి నుంచి తిరుగు ప్రయాణమయ్యారు.. ముగ్గురు స్నేహితులు.

కూచిమంచి నాగేంద్ర


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని