భీమన్న అనుమానం!

అమరావతిలోని భీమన్నకు లోకజ్ఞానం బొత్తిగా లేదు. కూలిపని చేసుకుంటూ జీవిస్తుండేవాడు. ఊళ్లో వాళ్లు అతడిని ఒట్టి అమాయకుడిగా జమకట్టేవాళ్లు.

Updated : 02 Apr 2024 02:25 IST

అమరావతిలోని భీమన్నకు లోకజ్ఞానం బొత్తిగా లేదు. కూలిపని చేసుకుంటూ జీవిస్తుండేవాడు. ఊళ్లో వాళ్లు అతడిని ఒట్టి అమాయకుడిగా జమకట్టేవాళ్లు. బుద్ధిబలం శూన్యమైనా కండబలం ఉండేది. ఓ పెళ్లికి పెద్ద పందిరి కట్టాలంటే భీమన్న కూడా కూలీగా వెళ్లాడు. ‘ఆకాశమంత పందిరి’ అని ఎంతో గొప్పగా అందరూ పొగిడారు. ఆ రాత్రి భీమన్న ఆరు బయట పడుకుని ఆకాశం కేసి చూశాడు. అకస్మాత్తుగా అతడికొక భయంకరమైన ఊహ తట్టింది!
‘ఎంత చిన్న పందిరి అయినా.. నాలుగు గుంజలుంటాయి కదా! మరి ఇంత పెద్ద ఆకాశానికి ఒక్క స్తంభం అయినా లేదే. అది పడితే ఇంకేమైనా ఉందా?!’ అనుకొని భయంతో లేచి కూర్చున్నాడు. ఎవరితో చెప్పుకుందామన్నా అందరూ నిద్రపోతున్నారు. భీమన్న పరిగెత్తుకుంటూ వెళ్లి ఊరి బయట ఉన్న ఊడల మర్రి కింద కూర్చున్నాడు. ఆకాశం పడితే చెట్టుకొమ్మలైనా తన ప్రాణాలు కాపాడతాయనుకున్నాడు. ఆ రాత్రంతా చెట్టు కిందనే జాగారం చేశాడు.

తెల్లవారగానే భీమన్న ఊళ్లోకి తిరిగి వచ్చి, కనిపించిన ప్రతివాళ్లతోనూ.. ‘చిన్న పందిరికే నాలుగు గుంజలుంటే, ఇంత పెద్ద ఆకాశానికి ఎన్ని స్తంభాలుండాలి? ఒక్కటి కూడా లేదే. అది మీద పడితే మనమంతా చచ్చిపోమా? మనమంతా అకాశం లేని చోటికి వెళ్దాం’ అన్నాడు. ‘భీమన్నకేదో పిచ్చి పట్టింది!’ అని అందరూ నవ్వుకున్నారు. అతని మాటలను ఎవరూ లెక్కచేయలేదు. ‘వీళ్లంతా బతికే యోగ్యత లేని వాళ్లు. అందుకే నా మాట వినడం లేదు. అయినా ఒకరితో నాకెందుకు? నేను ఆకాశం లేని చోటుకు వెళ్లి, హాయిగా బతుకుతాను’ అనుకుని ఊరి నుంచి బయలుదేరాడు భీమన్న.
అడవి దారిన వెళ్తూ.. ఎదురైన ప్రతి ఒక్కరికీ తన భయాన్ని చెబుతున్నాడు. వాళ్లంతా అతణ్ని ఎగాదిగా చూసి నవ్వుకుంటున్నారు. కొందరైతే ఎగతాళిగా.. ‘నీకేమన్నా మతిపోయిందా ఏంటి? అసలు ఆకాశానికి స్తంభాలేంటి?’ అన్నారు. ఇంత చిన్న విషయాన్ని కూడా ఎవరూ అర్థం చేసుకోనందుకు చిరాకుపడుతూ భీమన్న ఇంకా ముందుకు నడిచాడు. ఎంత దూరం వెళ్లినా.. అడవి తరగటం లేదు. ఎక్కడా ఊరు తగలలేదు. ఒకచోట తల ఎత్తి చూస్తే, చెట్ల మీదుగా ఆకాశం నీలంగా కనిపించింది. ఆకాశం లేని చోటు చేరాలంటే ఇంకా నడవాలి’ అని మనసులో భయపడుతూ నడుస్తున్నాడు.
అలా చీకటి పడే దాకా నడిచిన భీమన్న, పెద్ద చెట్టు కిందకు వచ్చాడు. అక్కడున్న ఒక యోగి, అతని అలికిడికి కళ్లు తెరిచి చూశాడు. భీమన్న ఆయన్ను చూడగానే.. ‘మీరు కూడా ఆకాశం పడుతుందనేనా, ఇంత దూరం వచ్చి చెట్టు కింద చేరారు?’ అని అడిగాడు. ఆయన చిరునవ్వుతో.. ‘ఆకాశం పడటమేమిటి?’ అని అడిగాడు. ‘చిన్న పందిరికే నాలుగు గుంజలుంటాయి కదా? ఇంత పెద్ద ఆకాశం స్తంభాలు లేకుండా ఎంతకాలం పడకుండా ఉంటుంది’ అన్నాడు భీమన్న.  ‘ఓ.. అదా నీ అనుమానం? ఆ సంగతి తీరిగ్గా రేపు ఉదయం చెబుతాను. ఈ రాత్రికి నిద్రపో’ అన్నాడు యోగి. దాంతో భీమన్న ఆ రాత్రి నిశ్చింతగా నిద్రపోయాడు.

తెల్లవారి భీమన్న లేవగానే.. ‘నాయనా! ఆకాశానికి స్తంభాలు లేవని కదూ, నీ అనుమానం? ఇటుగా వెళ్లావంటే ఒక గ్రామం వస్తుంది. ఆ ఊరిలో ప్రతి ఇంటికీ వెళ్లి.. వాళ్లను తిట్టి, భిక్షం పెట్టించుకుని సాయంత్రానికల్లా నా దగ్గరికి రా!’ అన్నాడు యోగి. భీమన్న ఆయన చెప్పిన మార్గాన వెళ్లి.. ఒక్కొక్క ఇంటి ముందు ఆగి, ఇంట్లో వాళ్లను తిడుతూ భిక్షం పెట్టమని అడగసాగాడు. అందరూ అతణ్ని కొట్టబోయినవాళ్లే కానీ.. ఒక్కరూ భిక్ష వేయలేదు. ఇక ఆఖరున ఓ ఇంటి ముందుకు వెళ్లి భిక్షం వెయ్యమని అరిచాడు. లోపలి నుంచి జవాబు లేదు. భీమన్న తిట్లు ప్రారంభించాడు.
ఇంతలో ఒక మహిళ వచ్చి.. ‘ఆలస్యం అయింది నాయనా! ఆకలితో అలమటించే వాడివి.. కోపగించుకోకు. ఆకలి బాధతో తిడుతున్నావని నాకర్థమైంది’ అంటూ తీసుకొచ్చిన అన్నం, కూరా భీమన్నకు ఇచ్చింది. దాంతో భీమన్న ఆశ్చర్యపోయాడు. సాయంత్రం యోగి దగ్గరకు వెళ్లి.. జరిగిందంతా వివరించాడు.

ఆ యోగి నవ్వి.. ‘చూశావా? నువ్వు తిట్టినా కోపం తెచ్చుకోకుండా... ఆమె నీకు తిండి పెట్టింది. అటువంటి మహాతల్లులు నూటికి, కోటికి ఒకరున్నా చాలు, వాళ్లే ఆకాశానికి స్తంభాలు. నువ్వు కట్టే పందిరికి నాలుగే గుంజలు, కాని అలాంటి ఉత్తమ ఇల్లాళ్లు ఆకాశానికి స్తంభాలుగా ఉన్నారు. అందుకే ఆకాశం పడిపోదు’ అన్నాడు. తన భయాన్ని తీర్చిన యోగికి నమస్కరించి.. తర్వాత ఆయనకు సేవలు చేసుకుంటూ, భీమన్న అరణ్యంలోనే ఉండిపోయాడు.  
 తరిగొప్పుల వీఎల్‌ఎస్‌ మూర్తి


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని